గరికపాటి పుష్ప సినిమాపై కోపం తగ్గినా సరే, మహాన్ అనబడే తాజా చిత్రాన్ని కూడా చూడకుండా తమాయించుకోవడం బెటర్… పుష్పలో ఆఫ్టరాల్ అక్షరమ్ముక్క రాని ఓ కూలీ పెద్ద స్మగ్లర్‌గా ఎదుగుతాడు… అంతే, కానీ ఈ మహాన్ ఇది మరోరకం అరాచకం… రెండు లీడ్ రోల్స్, ఒకటేమో తండ్రి విక్రమ్ పోషిస్తే, మరొకటి తన సొంత కొడుకు ధ్రువ్ పోషించాడు… ఒక వయస్సు మళ్లిన తండ్రి కేరక్టరేమో లెక్చరర్ నుంచి, గాంధేయవాదం నుంచి ఏకంగా దారితప్పి మద్యం సిండికేట్ బాస్‌గా ఎదిగిన ప్రస్థానం… మరో కేరక్టరేమో తండ్రి మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటాడో తెలియదు, తండ్రి వెన్ను విరిచే టార్గెట్‌తో చెలరేగిపోతుంటాడు… పేరుకు లీడ్ రోల్, అంతా విలనీ టైపులో డైలాగులు, బాడీ లాంగ్వేజీ గట్రా…
అసలు సినిమా ప్రారంభమే కాస్త వింతగా అనిపిస్తుంది… ‘‘తప్పు చేయడానికి వీల్లేని స్వాతంత్ర్యానికి అర్థమే లేదు’’ అని మహాత్మాగాంధీ చెప్పాడట… ఆ సూత్రాన్ని మనకు అక్షరాల్లో చూపిస్తూ సినిమా ప్రారంభిస్తాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు… అంటే సినిమాలో ఎవరి తప్పుల్ని జస్టిఫై చేయడానికో తెలియదు… ఈ సినిమాను రుద్దిన తప్పుకు సమర్థనేమో కూడా తెలియదు…
సినిమా అంతా ‘అతి’… ఓవరాక్షన్… పలుచోట్ల సీన్లలో అతి… కథ మలుపుల్లో అతి… కథాగమనంలో అతి… అసలు ఎవరు ఎవరి మీద ఎందుకు అంతగా ద్వేషం పెంచుకుని చంపేసుకుంటున్నారో ప్రేక్షకుడికి ఓపట్టాన అంతుచిక్కదు… ద్వేషాన్ని, పగను, కోపాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు దర్శకుడు… అసలు కథేమిటో కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేసేసరికి సినిమాయే అయిపోతుంది… ఏదో టీవీ సీరియల్ చూస్తున్నట్టే… అసలు కథ సిమ్రాన్ పాత్ర అతి ధోరణితో మొదలవుతుంది… సినిమా ఎండింగ్ వరకూ అలాగే నడుస్తుంది….. అసలు మద్యం సిండికేట్ అనేది ప్రత్యేక బలగాలు దింపి, ఎవడు కనిపిస్తే వాడిని ఫట్ ఫట్ అని కాల్చిపారేసేంత ప్రమాదకరమైన మాఫియా ఎప్పుడైంది సుబ్బరాజూ..?
Ads
హఠాత్తుగా ఈ దర్శకుడిని నిద్రలేపి, ప్రధానపాత్రల్లో ఎవరికి ఎవరి మీద ద్వేషమో, ఎందుకు అంత పగ పెరిగిందో అడగండి, సినిమా చివరలో ఎవరు ఏమేం ఎత్తుగడలు వేశారో అడగండి… ఖచ్చితంగా చెప్పలేడు… ఎస్… విక్రమ్ మంచి ప్రతిభ కలిగిన నటుడు… వంక పెట్టే వీలే లేదు… తనను మించిన నటుడు ధ్రువ్… నో డౌట్, ఇండస్ట్రీకి మరో వజ్రం దొరికినట్టే… సరైన పాత్రలు పడితేనే సుమా..!! ఈ సినిమాలో అసలు ఆ రెండు పాత్రల కేరక్టరైజేషన్ బాగా లేదు, దాంతో ఇద్దరూ ఓవరాక్షన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది… అంతెందుకు, సిమ్రాన్, మరో ప్రధానపాత్ర బాబీ సింహా కూడా అంతే… ఏమాటకామాట ఒకటీరెండుచోట్ల విక్రమ్, ధ్రువ్‌తో పోలిస్తే బాబీ బాగా చేసినట్టు అనిపించింది… సరైన కథ, కథనాలు లేకుండా మంచి నటుల ప్రతిభను దర్శకుడు దుర్వినియోగం చేశాడు…
విక్రమ్… అపరిచితుడు తరువాత తెలుగులో తను పెద్దగా ఆకట్టుకున్న సినిమాయే లేదు… తను ఏదో తక్కువ చేశాడని కాదు… తనెప్పుడూ టాప్ రేంజ్ పర్ఫామెన్స్ ఇస్తాడు… కానీ సరైన పాత్రలు, సరైన సినిమాలు పడలేదు… ఇప్పుడు ఇది మరో చేదు ఫలితమే… సినిమా లెంథ్ ప్రధానమైన లోపం… ఎంత ఓటీటీ అయినా అంతసేపు కామెడీ లేకుండా, వేరే వినోదం, రిలీఫ్ లేకుండా భరించడం కష్టం… పైగా తెలుగులో డబ్ చేసిన డైలాగ్స్ తీరు మరో శాపం… మరీ సినిమా క్లైమాక్స్‌లో భాష మరీ విచిత్రంగా ధ్వనిస్తుంటుంది…
పాటల గురించి చెప్పుకోవడం వేస్ట్… అవన్నీ తీసిపారేస్తే ఓ పావుగంట లెంథ్ తగ్గేదేమో… పలుచోట్ల డైలాగుల లెంథ్ కూడా ఎక్కువైంది… ఎడిటింగ్ సరిగ్గా జరగలేదని అర్థమవుతూనే ఉంది… చివరకు లెంథ్ సాకుతో వాణి భోజన్ అనే మరో హీరోయిన్ పాత్రనే కత్తిరించేశారంటే ఎడిటింగ్, డైరెక్షన్ ఫెయిల్యూర్లు అర్థమైపోతయ్… కొన్ని సీన్లలో బీజీఎం మాత్రం బాగుంది… మంచి ఎడిటింగ్ గనుక జరిగి ఉంటే, థియేటర్లలో రిలీజ్ చేసినా నాలుగు డబ్బులు వచ్చేవి కదా… మరి కేవలం ఓటీటీకి ఎందుకు పరిమితమయ్యారో అర్థం కాదు… ఇప్పుడు పెద్దగా కరోనా వ్యాప్తి కూడా లేదు కదా…!!
Share this Article