నిన్న ఓ వైసీపీ నాయకుడు ధాటిగా చెప్పేస్తున్నాడు… ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే జగన్‌కు క్రెడిట్ వస్తుంది కాబట్టి చంద్రబాబు తన పలుకుబడి అంతా ఉపయోగించి, ఆపేయించాడు, రాష్ట్ర వ్యతిరేకి’’ అంటూ గాలికిపోయే కంపను చంద్రబాబు ఇంటివైపు మళ్లిస్తున్నాడు… హహహ, పాపం చంద్రబాబుకు నిజంగా ఢిల్లీలో అంత పలుకుబడి ఉందా..? ఉండి ఉంటే జగన్‌ను ఎప్పుడో జైలులో వేయించేవాడు కదా… కనీసం మోడీ దగ్గర అపాయింట్‌మెంట్ సంపాదించేవాడు కదా… ఏదో అప్పట్లో బాగా బతికి, చితికిపోయిన జీవితం, ఇంకా ఈ రాళ్లు వేసి, వేధించడం దేనికి..?
మరి వైసీపీ చేసిందేమిటి..? ప్రత్యేక హోదా వచ్చేస్తున్నదహో… మా జగనన్న సాధించాడహో… అని టాంటాం చేసుకున్నారు పొద్దున…! మళ్లీ నాలుగైదు గంటలకే… చంద్రబాబుదే తప్పు, హోదా అనేది బీజేపీ బాధ్యత అని కొత్తరాగాలు ఎత్తుకున్నారు… మరి జగన్ తీసుకొస్తున్న ప్రత్యేక హోదా అకస్మాత్తుగా ఎందుకు మాయమైపోయినట్టు..? పైగా మరో ప్రచారం కూడా సాగింది సోషల్ మీడియాలో… టీడీపీ నుంచి బీజేపీలోకి వ్యూహాత్మకంగా చంద్రబాబు ద్వారా చేర్చబడిన సుజనా చౌదరి అండ్ కో తమ నాయకుడు వెంకయ్య ద్వారా ఈ ప్రత్యేక హోదా ప్రకటనను ఆపేయించారట..!! నవ్వొచ్చే విమర్శ… వాళ్లు చెప్పగానే మోడీ, షా వెంటనే హోం శాఖను తిట్టి, ప్రత్యేక హోదా ప్రకటనను నిలిపేశారా ఏం..?!
అసలు దీన్ని కంపు చేసింది జీవీఎల్… హోం శాఖ ఏదో త్రిసభ్య కమిటీ వేసింది… తెలంగాణ- ఏపీ రాష్ట్రాల నడుమ ఇంకా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఆ కమిటీ… ఈ ఇష్యూస్ చూడాల్సింది హోం శాఖే… చాలా ఇష్యూస్ అంత త్వరగా పరిష్కారం కావు, కొన్ని బహుశా అలాగే కొనసాగుతూ ఉండవచ్చు కూడా… ఓ అధికారిక కమిటీ వేశారు, ఏమేం చర్చించాలో, ఆ తేదీ ఏమిటో తేల్చి, ఓ సర్క్యులర్ జారీ చేశారు… ఓ అఫిషియల్ ప్రొసీజర్ ఇది…
Ads
ముందుగా ప్రకటించిన ఎజెండాలో ప్రత్యేక హోదాతో పాటు చాలా అంశాల్ని చేర్చారు… ఇది ప్రిపేర్ చేసిన హోం శాఖ అధికారి ఎవరో, గుడ్డిగా ఎజెండా అంశాల్ని చేర్చినట్టుగా ఉంది… ప్రత్యేక హోదా అనేది హోం శాఖ, రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు తేల్చే అంశం కాదు… పొలిటికల్ నిర్ణయం జరగాలి, దానికి ముందు పెద్ద కసరత్తు జరగాలి, పైగా ఆల్‌రెడీ నీతిఆయోగ్ చెప్పిన కొత్త సూత్రాల ప్రకారం ఇకపై ప్రత్యేక హోదాలు ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదు అనే ఓ విధాననిర్ణయాన్ని బీజేపీ ప్రకటించింది… యూటర్న్ తీసుకోవాలంటే, దానివల్ల తమకు లబ్ధి ఏమిటో చూసుకోవాలి… ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి ఊడిపడే రాజకీయ లబ్ధి ఏమీ లేదు ఏపీలో…
నిజంగా ప్రత్యేక హోదాను మళ్లీ చర్చనీయాంశం చేయాలనుకున్నా…. ఇవ్వాలని అనుకున్నా సరే… రాజకీయ ప్రకటనలు ఉంటయ్… అంతేతప్ప నేరుగా ఓ ఎజెండాలో చేర్చేయరు… చేర్చినా సరే, అది చర్చకు తీసుకున్న అంశం మాత్రమే అవుతుంది… (ప్రత్యేక హోదాకు విభజన హామీలకు సంబంధం లేదనే మాట అబద్ధం… రెవిన్యూ గ్యాప్ భర్తీ, వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు, ప్రత్యేక హోదా వంటివి విభజన నష్టాలకు పరిహారంగా ప్రతిపాదించినవే… కేంద్రం తప్పించుకోలేదు…
ఐతే అది ప్యాకేజీయా, ప్రత్యేక హోదాయా అనేది వేరే సంగతి, ఇదే చంద్రబాబు ప్యాకేజీకి స్వాగతం పలికి, తరువాత యూటర్న్ తీసుకున్నాడు… జగన్ కూడా అంతే కదా… మొదట్లో పోరాటం అదీ ఇదీ అన్నాడు, ఇప్పుడు సైలెంట్… సో, అది అవసరానికి ఉపయోగపడే ఓ రాజకీయ నినాదం… అంతే… ఒకవేళ మోడీషా చెబితేనే హోం శాఖ ఈ ఎజెండా ప్రిపేర్ చేసి ఉంటే, ఈ జీవీఎల్, ఈ సుజనా తదితరులకు ఆ నిర్ణయం మార్చేంత సీన్ ఉందా..? అనవసరంగా వైసీపీ నేతలు కొందరు తొందరపడి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నంలోపడి భంగపడ్డారు…
ఇంకేముంది..? ఆంధ్రజ్యోతి ఆర్కే తదితరులకు చాన్స్ దొరికింది… ఇటు జగన్‌నూ, అటు బీజేపీ క్యాంపునూ బదనాం చేసే అవకాశాన్ని వినియోగించుకుని బదనాం ఆపరేషన్ చేపట్టారు… ఫాఫం, ఆ హోం శాఖ ఉన్నతాధికారి ఎవరో గానీ, బ్యాండ్ పడినట్టే లెక్క… ప్రత్యేక హోదా అనేది ఓ తేనెతుట్టె… అది కదిలించడం అంటే ప్రస్తుతం అనవసర రాద్ధాంతాలకు అవకాశం ఇచ్చినట్టే… చాలా రాష్ట్రాల ప్రత్యేక హోదా డిమాండ్లు పెండింగులో ఉన్నయ్… అవన్నీ వోకే అనే స్థితిలో బీజేపీ ఉందా అనేది ఓ ప్రశ్న… ఐనా జీవీఎల్ వంటి నేతలకు వాటిపై విధాన నిర్ణయాలు ప్రకటించేంత సీన్ ఉందా అనేది అసలు ప్రశ్న…!! ఏతావాతా… ఎప్పుడేం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో బీజేపీ నేతలకు తెలియదు అనడానికి తాజా ఉదాహరణ ఇది..!!
Share this Article