ఆస్కార్ అవార్డుల పరిశీలనకు కూడా మన సినిమాలు పనికిరావా..? ఈ ప్రశ్న ఎప్పటిలాగే చర్చనీయాంశమవుతోంది… సోషల్ మీడియాలో చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నయ్… ఆస్కార్ దాకా ఎందుకు..? అసలు జాతీయ అవార్డుల పరిశీలనకు కూడా మన తెలుగు సినిమాలు పనికిరాకుండా పోతున్నయ్ కదా, మరి ఈ దరిద్రం మాటేమిటి..? ఏవో అరకొర అవార్డులు తప్ప మనం జాతీయ స్థాయిలోనే మన ముద్ర వేయలేకపోతున్నాం కదా అనే నిజం గుర్తొచ్చి, బాధ కాదు, నవ్వొచ్చింది…
ఇదేసమయంలో సోషల్ మీడియాలో ఒక మిత్రుడి వాల్ మీద ఒక వీడియో చూశాక ఆ నవ్వు కొన్ని రెట్లు పెరిగింది… ఆ నవ్వు వెనుక దట్టంగా జాలి, విరక్తి, కోపం, అసహనం వంటి ఎమోషన్లు కూడా…!! ఇలాంటి సీన్లు, డైలాగులు, కథలతో ఏ అవార్డుల్ని ఆశించాలి ప్రభూ..? ఇలాంటివి చూస్తుంటేనే నిజమైన సినిమా ప్రేమికులకు కడుపులో నుంచి తన్నుకొస్తుంది ఏవగింపు ప్లస్ ఆపుకోవడం కష్టమయ్యే నవ్వు… ఓసారి ఈ వీడియో చూడండి…
ఇలాంటి అత్యంతాతి పోకడలకు ఏమైనా కొత్త పదాలు కనిపెట్టాలి… ఓ భార్య మరణిస్తుంటే భర్త ఈ గొట్టు పదాలతో ప్రసంగం దంచుతాడా..? ఇది బొబ్బిలి సింహం అనే సినిమాలోనిది… కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీని ఏలిన పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు ఇవి… ఫాఫం, బాలయ్య కూడా ఇలాంటివి ఎందుకు అంగీకరించేవాడో తెలియదు… అదేదో దిక్కుమాలిన సినిమాలో తను తర్జని చూపించగానే, కళ్లురిమిన వెంటనే రైలు వెనక్కి పారిపోతుంది…
Ads
చాలా కమర్షియల్ సినిమాల్లో సూపర్ నేచురల్ ఫైట్లు, అసాధారణ సీన్లు, తలాతోక లేని కథలు, పిచ్చిరేపే కథనాలు, వ్యాయామ డాన్సులు, మితిమీరిన మెలోడ్రామా డైలాగులు వంటి చాలా అవలక్షణాలు మనం చూస్తూనే ఉంటాం… సినిమా అంటే ఇలా ఉండాలి అన్నంతగా మనల్ని అలవాటు కూడా చేసేశారు… కానీ మరీ ఈ రేంజ్ పైత్యప్రదర్శన మరే సినిమాలోనూ కనిపించలేదు… (ఆ సీన్ గురించి ఎప్పుడైనా హైపర్ ఆదితో రోజాను ప్రశ్న అడిగించాలి)
ఈ జాతీయ అవార్డులు, ఆస్కార్ అవార్డులు, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్‌లు, ఫైమా అవార్డులు గాకుండా… ఏదైనా కొత్తరకం అవార్డుల్ని ఎవరైనా ప్రకటిస్తే బాగుండు… ఇతర భాషల్లో సినిమాలన్నీ దాటేసి, మన తెలుగు సినిమాలు వాటిని అలవోకగా గెలుచుకోవడం గ్యారంటీ… ఈ బొబ్బిలి సింహం విషయానికొద్దాం… 1994 బాపతు సినిమా…
బాలయ్యతోపాటు మీనా, రోజా, సత్యనారాయణ, శారద, జగ్గయ్య, శరత్ బాబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సోమయాజులు, శివాజీరాజా, సంగీత… ఇలా బోలెడు మంది పేరున్న నటీనటులు… కీరవాణి సంగీతం, కోదండరామిరెడ్డి దర్శకత్వం… రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ కథ… విచిత్రం ఏమిటంటే… ఇలాంటి డైలాగులున్న ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించడం… ఇలాంటివి పుష్కలంగా డబ్బు తీసుకొస్తుంటే, తొక్కలో అవార్డులు, ఉత్తమాభిరుచులు, ప్రయోగాలు, నవ్యత, నాణ్యత, కళాత్మకత వంటి పదాలు ఎవరిక్కావాలి బ్రదర్..?!
Share this Article