అకస్మాత్తుగా కేసీయార్ ఎందుకింతగా బీజేపీపై విరుచుకుపడుతున్నాడు..? ఏం సెగ తగులుతోంది..? రాజకీయంగానా..? కేసుల వాసన ఏమైనా వస్తోందా..? ఆ చర్చను వదిలేస్తే చాలా అంశాల్ని ఎందుకు, ఎలా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాదు, ఎవరినీ ప్రశ్నించనివ్వడు, మీడియా మీట్‌లో ఎవరైనా ఆ ప్రశ్న వేస్తే ఇక ఆ విలేఖరి పనైపోయినట్టే… కేసీయారే ట్రోలింగుకు దిగుతాడు… నిన్నటి సుదీర్ఘమైన ప్రెస్‌మీట్ అనంతరం విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఓ వింత విషయం చెప్పుకొచ్చాడు తను… ఆంధ్రజ్యోతిలో కనిపించింది ఆ వార్త… అదేమిటంటే..?
‘‘యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గనుక బీజేపీ ఓడిపోతే… కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుంది… దేశ రాజకీయాలు, సమీకరణాలు, ప్రజల అభిప్రాయాల్లో మార్పు చూస్తాం… సార్వత్రిక ఎన్నికలపైనా ఆ ప్రభావం ఉంటుంది… యూపీ ఫలితాలపైనే బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆ పార్టీ తిరిగి యూపీలో అధికారంలోకి వస్తే, కేంద్రంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకూ ఆ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. కానీ, యూపీ ఎన్నికల్లో పరాజయం పొందితే మాత్రం కేంద్రంలోనూ బీజేపీ దెబ్బతింటుంది. లుకలుకలు మొదలై, ఎవరి దారి వారు చూసుకుంటారు. బీజేపీకి వ్యతిరేకంగా నవీన్ పట్నాయక్ కూడా బయటకు వస్తారు. త్వరలోనే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం’’
బొటాబొటీ మెజారిటీతో యూపీలో ప్రభుత్వం వచ్చినా ఆ పార్టీకి అంతర్గత సమస్యలు తప్పవనీ, సమాజ్‌వాదీకి 130 నుంచి 150 వరకు వస్తాయనీ జోస్యం చెప్పాడు… సరే… ఇక్కడ ఓ ప్రశ్న… దుబ్బాకలో, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతే రాష్ట్రంలో కేసీయార్ ప్రభుత్వం పడిపోయిందా..? పోలేదు కదా… ఎందుకు..? కేసీయార్ పార్టీకి ఫుల్లు మెజారిటీ ఉంది గనుక..! మరి మోడీ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుంది..? కేసీయార్‌కు బహుశఆ పార్లమెంటులో పార్టీల వారీగా లెక్కలు గుర్తున్నట్టు లేదు… అఫ్ కోర్స్, తెలిసినా సరే, ఆయన అబద్ధాన్ని జనంలోకి వదులుతూనే ఉంటాడు…
Ads
లోకసభలో సీట్లు 543… అంటే మెజారిటీ మార్క్ 272… ప్రస్తుతం సభలో బీజేపీ సొంత బలం 301… ఎన్‌డీఏ బలం కాదు, అంటే అవసరమైనంత సంఖ్యకన్నా 29 మంది సొంత సభ్యులు ఎక్కువే ఉన్నారు… అంటే నాన్-బీజేపీ పార్టీలన్నీ కలిసినా మెజారిటీ రాదు కదా… మరి మోడీ ప్రభుత్వం ఎలా కూలిపోతుంది..? నవీన్ పట్నాయక్ బయటికి వస్తాడు అట… ఆయన ఇప్పుడు ఏమైనా బీజేపీతో అంటకాగుతున్నాడా..? బీజేపీ అనుబంధ పార్టీయా..? ఎన్డీఏలో ఉన్నాడా..? తను బయటికి రావడం ఏమిటి..?
ఎవరి దారి వారు చూసుకుంటారట… అంటే బీజేపీ చీలిపోయి, నాయకులు అర్జెంటుగా వేర్వేరు పార్టీలు పెట్టేసి, మోడీని దింపేసి, తరిమేస్తారా..? ఇవేం లెక్కలు..? ఇవేం ఆశలు..? ఇవేం విశ్లేషణలు..? ఇవేం అంచనాలు..? ‘‘ఒకవేళ 175కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే మాత్రం, ఇప్పటి నుంచే బీజేపీ ఖతం అవుతుంది. రాకపోయినప్పటికీ, వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ పార్టీ ఖతం అవుతుంది…’’ అంటాడు తను… హేమిటో… నిన్నటి ఇష్టాగోష్టి, ప్రెస్‌మీట్‌లో తను ప్రస్తావించిన అనేక అంశాలు అసంబద్ధంగా, అసందర్భంగా ఉన్నాయి… పాయింట్‌టుపాయింట్ దీటుగా కౌంటర్ ఇచ్చేవాళ్లు బీజేపీలో లేకపోవడం ఆ పార్టీ విషాదం…!!
Share this Article