బాస్ బీజేపీ కాబట్టి కాషాయం పులుముకుంది ఆ పత్రిక… తప్పులేదు, బాసును మించిన ధర్మం ఏముంటుంది..? పైగా ప్రతి పత్రికకూ ఓ పొలిటికల్ లైన్ ఉంటుంది… బాసు నడిచే లైనే పత్రిక లైన్… అదంతే… ప్రస్తుతం వివేక్ బీజేపీలో ఉన్నందున తన వీ6, వెలుగు కూడా అర్జెంటుగా కాషాయం అంగీలు తొడుక్కున్నయ్… టీఆర్ఎస్, కేసీయార్, కేటీయార్, ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజానికే శత్రువుల్లా కనిపిస్తున్నారు… అదీ సహజమే… సో, ప్రతి ప్రత్యేక కథనమూ ఆ కలర్లోనే వెలిగిపోతుంది… అదీ ఈరోజుల్లో, ఇప్పటి పాత్రికేయ ప్రమాణాల్లో అత్యంత సహజం… కానీ..?
ఈరోజు లీడ్ స్టోరీ లైన్, పొడవు, కంటెంటు అన్నీ విచిత్రంగా ఉన్నయ్… నేరుగా ఒక ప్రైవేటు కంట్రాక్టు ఏజెన్సీని టార్గెట్ చేసిన కథనం అది… మేఘా, ఇది తగునా పేరిట… ఇటు దోపిడీ, అటు దగా, మన రాష్ట్రాన్ని నిండా ముంచే కుట్ర అంటూ శ్రీశైలం నీళ్లను జగన్ దారిమళ్లించే ప్రాజెక్టు మొత్తం మేఘా నిర్వాకమే, దాని పాపమే అని సూత్రీకరించారు…
Ads
అదెలా..? నిజమే… మేఘాకు బొచ్చెడు అవలక్షణాలున్నయ్… దాని గురించి లోతైన చర్చ ఇక్కడ అక్కర్లేదు… ప్రాజెక్టులు, కమీషన్లు, లాభార్జన అనేది ఓ పెద్ద సబ్జెక్టు… మేఘా యవ్వారాలు ఒక్క కథనంలో చెప్పగలిగేవీ కావు… కానీ శ్రీశైలం నీళ్లను తీసుకుపోయే సంగమేశ్వరం అలియాస్ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు బాధ్యుడు మేఘా కృష్ణారెడ్డి ఎలా అవుతాడు..? తనెలా కుట్రదారు అవుతాడు..?
అది జగన్ నిర్ణయం… దాంతో జగన్ ఆశించే ప్రయోజనాలు బోలెడు… రాయలసీమ ప్రాంతం కూడా జగన్ నుంచి ఈతరహా నిర్ణయాలే ఆశిస్తోంది… జగన్ కుట్రపూరితంగా దక్షిణ తెలంగాణను ఎండబెట్టి, శ్రీశైలం నీళ్లను, కృష్ణా నదినే మళ్లిస్తే… ఆ ప్రయత్నం చేస్తే… దానికి బాధ్యుడు జగన్ అవుతాడే తప్ప మేఘా ఎలా అవుతుంది..? దాన్ని ఆపలేని కేసీయార్ జవాబుదారీ అవుతాడు తప్ప మేఘా కృష్ణారెడ్డి కుట్రదారు ఎలా అవుతాడు..?
ఎందుకంటే..? సదరు ప్రాజెక్టును మేఘా చేపట్టకపోతే ఇంకెవరో వస్తారు..? మరో కంపెనీని రంగంలోకి దింపుతారు… ఇక్కడ మేఘా జస్ట్, ఓ కంట్రాక్టర్ మాత్రమే… ఇదే కేసీయార్ జూరాల ఎగువన ఓ పెద్ద ప్రాజెక్టు చేపట్టమనండి, జగన్ నీళ్ల దోపిడీ కుట్రలకు చెక్ పెట్టమనండి, ఆ పనులు మేఘాకు ఇవ్వమనండి, చేయడా..?
పోనీ, ఇదే మేఘా బీజేపీకి వ్యతిరేకంగా ఉందా..? బీజేపీ టార్గెట్ చేయాల్సిన అవసరముందా..? లేనే లేదు…! మేఘా తన ఫీల్డులో తను పక్కా ప్రొఫెషనల్… ఎవరికి ఏం ఇవ్వాలో ఇచ్చేయడం, తమ పని చక్కబెట్టుకోవడం… కేసీయార్, జగన్, చంద్రబాబు, మోడీ… కీలక కుర్చీల్లో ఎవరు కూర్చుని ఉన్నా వాళ్లకు రంది లేదు… ఇబ్బంది లేదు…
కేంద్రంలోని బీజేపీతో కూడా మేఘాకు మంచి సంబంధాలే ఉన్నయ్… పైగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు గాను, వివిధ పార్టీలకు తెలుగు రాష్ట్రాల నుంచి తరలిపోయిన వందల కోట్ల నిధుల లెక్కలు, ఎక్కాలు కూడా మేఘా చెప్పేసిందనే టాక్ బిజినెస్, పొలిటికల్ సర్కిళ్లలో ఉన్నదే… ఆ లెక్కలకు రాజకీయ ప్రాధాన్యం ఉంది… మరి బీజేపికి మేఘా టార్గెట్ ఎలా అయ్యిందబ్బా..?! పైగా ఇప్పుడు మోషాకు కేసీయార్, జగన్ కూడా కావల్సినవాళ్లే కదా…! మరి వాళ్లు మెచ్చి కావలించుకున్న ఆ మేఘా మాత్రం భూతం ఎలా అయిపోయింది..?!
Share this Article