సమస్యలు ఏమున్నాయో తెలియదు గానీ… రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికను పట్టించుకోవడం మానేసినట్టున్నాడు..! ఏదో వారానికి ఒకటి, వీలయితేనే ‘కొత్త పలుకు’ అని ఓ వ్యాసరత్నాన్ని జనం మీదకు వదిలేసి, పత్రికలో ఏ వార్త ఎలా వస్తుందో కూడా చేస్తున్నట్టుగా లేదు ఈమధ్య..! తన పొలిటికల్ లైన్ తెలిసిన సిబ్బందినే పెట్టుకున్నాను కదా, ఏదో ఒకటి రాసిపారేస్తారులే అనుకుంటే ఎలా మాస్టారూ… ఇదుగో ఈ వార్త చూడండి… ఫస్ట్ పేజీ వార్త…
గౌతమ్ సావంగ్‌ను డీజీపీ పోస్టు నుంచి పీకేసిన జగన్ ప్రభుత్వం ఇక పరువు కోసం ఏదో పదవి ఇస్తోందట… బాబ్బాబు, ప్లీజ్, ఈ పదవి తీసుకో, నువ్వు కాదంటే మామీద ఒట్టే అని రాయబారాలు ఆడుతోందట… ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సొంత మీడియాలో గోల రాతలకు దిగిందట… ఎహె, ఆయనకు ఇంకా 17 నెలల సర్వీస్ ఉంది, సర్వీసులో ఉండగా ఏపీపీఎస్సీ పదవి ఇవ్వడం ఎలా కుదురుతుంది అని అడిగేసింది… ఆ చాన్సేలేదుపో అనేసింది…
వికీపీడియాలో కూడా జగన్ రెడ్డే సావంగ్ చరిత్రను మార్చేశాడు అన్నట్టుగా జ్యోతి వార్త ఊగిపోయింది… అసలు ఆయనకు ఇష్టమో కాదో కూడా తెలియదు సుమా అని దీర్ఘాలు తీసింది… అంతేకాదు, పదవి ఇచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది అని లోగుట్టు బయటికి లాగినట్టు కవరింగు కూడా..! ఇదంతా డ్యామేజ్ కంట్రోల్ కోసం జరుగుతున్న హైడ్రామా మాత్రమే అని చివరకు తేల్చేసింది… సచివాలయానికి ఓ ప్రతిపాదన వచ్చింది తప్ప ఇంకేమీ లేదని రాసేసింది…
Ads
వికీపీడియాకు తెలిసేలా ప్రచారహడావుడి చేశారుట, వెంటనే వికీపీడియా సావంగ్ చరిత్రను అప్‌డేట్ చేసిందట, కానీ చివరకు నిజం తెలిసి వికీపీడియా ఇందులో ఏదో తిరకాస్తు ఉందని గ్రహించి, నాలుక కర్చుకుని ఆ అప్‌డేట్ తొలగించేసిందట… వికీపీడియాలో ఎడిటింగ్ ఆప్షన్స్ ఏమిటో ఆంధ్రజ్యోతికి కనీస ఐడియా కూడా లేనట్టుంది… ఐనా సగటు ప్రజానీకం నుంచి, అధికార వ్యవస్థల నుంచి వ్యతిరేకత రావడంతో పరువు కోసం ఈ హైడ్రామా అట… ఒక డీజీపీని తీసేస్తే సగటు ప్రజానీకం రోడ్డెక్కి ఉద్యమాలు చేసిందా జగన్‌కు వ్యతిరేకంగా..!!
ఈ వార్తలో ఫస్ట్ వాక్యం ఏమిటో తెలుసా..? ‘‘అవసరాన్ని బట్టి వాడుకుని వదిలేసేరకం కాదు, వాడుకుంటూనే ఉంటాం’’ అనేది జగన్ సూత్రమట… వాడుకుంటూనే ఉండాలనేది పాలసీ అయితే ఆ డీజీపీ పోస్టులోనే ఉండేవాడు కదా సావంగ్… పైగా ఆయన్ని సైలెంట్ చేయాలని జగన్ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారట… సావంగ్‌కు తెలిసిన రహస్యాలు ఏమిటి..? జగన్ ప్రభుత్వం దిగిపోయేలా ఆయన బయటపెట్టబోయే నిజాలు ఏమిటిట..? చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్నే హఠాత్తుగా శంకరగిరి మాన్యాలు పట్టించారు అప్పట్లో… ప్రవీణ్ ప్రకాష్ సహా చాలామందిని కూడా వదిలించుకున్నారు…
పాలకుడి ఇష్టం… ఎవరైనా సరే, కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ‘‘పరిణామాలు’’ ఆలోచించకుండానే కసుక్కుమని వేటు వేస్తారా..? ఐనా జగన్ ఇవన్నీ పట్టించుకునే రకమా..? ఆయనకు ఈ పదవి ఇవ్వడం కుదరదు అని కూడా జ్యోతి తేల్చిపారేసింది… అదేమంటే ఆయన సర్వీసులో ఉన్నాడు కాబట్టి అంటోంది… వీఆర్ఎస్‌కు దరఖాస్తు కూడా చేసుకోలేదు అట…
ఎంతసేపు..? వీఆర్ఎస్ దరఖాస్తు ఎంతసేపు..? ఏపీపీఎస్సీ కొలువు ఇవ్వడం ఎంతసేపు..? పైగా రూల్స్ ప్రకారం, సర్వీసులో ఉన్నప్పుడు ఈ పోస్ట్ ఇవ్వకూడదని ఏమీ లేదు… తెలంగాణాలో ఒక ప్రిన్సిపల్ secretary కి సర్వీసులో వుండగానే tspsc చైర్మన్ పోస్ట్ ఇచ్చారు… అఫ్ కోర్స్, తను ఆ పదవికి ఇష్టపడతాడా లేదానేది తన ఇష్టం… ఏమో, సెంట్రల్ సర్వీసుకు ప్రయత్నించవచ్చు కూడా…!! సావంగ్‌కు ఏపీపీఎస్సీ పదవి ఆఫర్ చేయడం వెనుక ‘‘డ్యామేజీ కంట్రోల్, ఆయన్ని సైలెంట్ చేయడం, పరువు నిలబెట్టుకోవడం, ఇంకా వాడుకోవడం’’ వంటి ఇన్ని వ్యూహాలు దాగి ఉన్నట్టు ఫాఫం, జగన్‌కు కూడా తెలియదు..!!
Share this Article