1947 నుంచి 1964… ప్రధాని నెహ్రూ… స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా జనంలో ఉన్న ఆదరణతో మంచి మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి… సుస్థిర ప్రభుత్వాలు…
1964 నుంచి 1966… ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి… అదే కాంగ్రెస్… నెహ్రూ మరణంతో ఖాళీ అయిన ప్రధాని ప్లేసులో చేరిన శాస్త్రి సమర్థంగా పాలించాడు…
1966 నుంచి 1977… ప్రధాని ఇందిరాగాంధీ… పార్టీలో సంక్షోభాలు ఎలా ఉన్నా సరే, అన్నీ తట్టుకుంటూ, ఇంకెవరికీ ఏ చాన్సూ ఇవ్వకుండా సుస్థిర ప్రభుత్వం రన్ చేసింది…
Ads
ఇక్కడి వరకూ కాంగ్రెస్… ఇక్కడ సీన్ మారింది…
1977 నుంచి 1979… ప్రధాని మొరార్జీ దేశాయ్… పలు పార్టీల కలయికతో ఏర్పడి, ఇందిరకు వ్యతిరేకంగా ఉద్యమించిన జనతా పార్టీ ప్రభుత్వం… ఈ దేశానికి తొలి సంకీర్ణం… రెండేళ్లలోనే ప్రధాని రాజీనామా…
1979 నుంచి 1980… ప్రధాని చరణ్ సింగ్… జస్ట్, ఆరు నెలలు… ఉండీ లేనట్టుగా ప్రభుత్వం… ఎన్నికల కోసం ఎదురుచూస్తూ… దాదాపు కేర్ టేకర్ ప్రభుత్వం అది…
1980 నుంచి 1984… ప్రధాని ఇందిరాగాంధీ… సుస్థిరప్రభుత్వం… మంచి మెజారిటీ… సంకీర్ణాల్లేవ్… ఎక్కడా ఎవరూ నోరెత్తడాల్లేవ్… ఉక్కుమహిళ… కానీ హత్యకు గురైంది…
1984 నుంచి 1989… ప్రధాని రాజీవ్ గాంధీ… ఇదీ సుస్థిర ప్రభుత్వమే… ఇందిర హత్య తాలూకు సానుభూతి వెల్లువెత్తి ఫుల్ మెజారిటీ సీట్లు వచ్చినయ్… పాలన గాడిలో పడుతున్న కాలం ఇది…
1989 నుంచి 1990… ప్రధాని వీపీసింగ్… ఇది మరో సంకీర్ణ ప్రభుత్వం… నేషనల్ ఫ్రంట్ పేరిట కూటమి… ఎన్టీరామారావు లీడర్… బయటి నుంచి లెఫ్ట్ మద్దతు, నానా పార్టీల కూటమి ప్రభుత్వం ఇది… కానీ రెండేళ్లే…
1990 నుంచి 1991… ప్రధాని చంద్రశేఖర్… ఇదో సంకీర్ణం… కొన్నాళ్లు కాంగ్రెస్ మద్దతునిచ్చింది… దేశపాలన పూర్తిగా గాడితప్పింది… మన బంగారాన్ని టన్నుల కొద్దీ అమ్ముకున్న అత్యంత గడ్డుకాలం…
1991 నుంచి 1996… ప్రధాని పీవీనరసింహారావు… మైనారిటీ ప్రభుత్వమే అయినా… అయిదేళ్లూ నెట్టుకొచ్చిన పీవీ దేశ ఆర్థిక విధానాలను సమూలంగా మార్చేశాడు… పార్టీలో గొడవలున్నా స్థిరప్రభుత్వమే ఇచ్చాడు…
1996… ప్రధాని వాజపేయి… 13 రోజుల పదవి… మెజారిటీ నిరూపించుకోలేక రాజీనామా…
1996 నుంచి 1997… ఇక్కడి నుంచీ మళ్లీ సంకీర్ణాలు… దేవెగౌడ ప్రధాని… నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్… బలమైన ప్రాంతీయ పార్టీల పెత్తనాలు… కానీ బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు తప్పలేదు…
1997 నుంచి 1998… ప్రధాని ఐకే గుజ్రాల్… దేవెగౌడను దింపుతారా లేదా అని కాంగ్రెస్ బెదిరించేసరికి, ఆయన నిష్క్రమించి, గుజ్రాల్ వచ్చాడు… కాంగ్రెసే మద్దతుదారు… కానీ తాత్కాలికమే…
1998 నుంచి 1999… ప్రధాని వాజపేయి… ఎన్నికల్లో హంగ్ రిజల్ట్ వచ్చింది… ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏర్పరిచింది… కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు, కానీ 13 నెలల్లోనే పతనం… కారణం, ఓ ప్రాంతీయ పార్టీ అధినేత్రి అహం…
1999 నుంచి 2004… ప్రధాని వాజపేయి… ఎన్డీయే పేరిట మరో సంకీర్ణం… కానీ నేతృత్వం బీజేపీదే… సుస్థిర ప్రభుత్వమే… అయిదేళ్లు ఏ మార్పులూ లేవు… పాలనలో కూడా ఏ మెరుపులూ లేవ్…
2004 నుంచి 2014… ప్రధాని మన్‌మోహన్‌సింగ్… యూపీఏ పేరిట ఇంకో సంకీర్ణం… కానీ నేతృత్వం కాంగ్రెస్‌ది… సుస్థిర ప్రభుత్వాలే… పదేళ్లపాటు నిలకడగా పరిపాలన సాగింది…
2014 నుంచి ఇప్పటిదాకా… ప్రధాని నరేంద్ర మోడీ… ఇది మరో ఎన్టీయే… బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చినా సరే, తమతో ఉన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది…
……… ఇవన్నీ చదివారు కదా… మీకు అర్థమైంది ఏమిటి..?
- ఏదైనా జాతీయ పార్టీకి మెజారిటీ ఉంటే అవి సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి…
- కాంగ్రెస్ లేదా బీజేపీ… అవి ప్రధాన పార్టీలుగా ఉండి, మిగతా కొన్ని పార్టీలు మద్దతుగా నిలిస్తే (యూపీఏ, ఎన్డీయే) సుస్థిర ప్రభుత్వాలనిచ్చాయి…
- ప్రాంతీయ పార్టీల కూటములు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భాల్లో అత్యంత అస్థిరమైన ప్రభుత్వాలు… అస్థిరమైన విధానాలు… పాలనకు ఓ దిశ లేదు, ఓ దశ లేదు…
ప్రధాన పార్టీల భాగస్వామ్యం లేదా వాటి నేతృత్వం లేని కూటముల వల్ల దేశం చంచలమైన ప్రభుత్వాలు వచ్చినయ్… పాలనకోణంలో కూడా దేశం నష్టపోయింది… చంద్రశేఖర్, గుజ్రాల్, దేవెగౌడ… కొంతమేరకు వీపీసింగ్… 1977 నుంచీ మనం చూస్తున్నది అదే… ఇప్పుడు నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల కూటమి అనే కొత్తరాగాలు వినిపిస్తున్నయ్ కదా… 2018 నుంచీ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చూస్తున్నాం కదా… ఓసారి పాత గుణపాఠాలు గుర్తుచేసుకుందామని ఈ కథనం…!!
Share this Article