ఏమాటకామాట… తెలుగు పాత్రికేయ వృత్తిలో కొన్ని ఈనాడు మాత్రమే చేయగలదు… ఈనాడును చూసి వాతలు పెట్టుకునే పత్రికల వల్ల కాదు… వాటికి అంత నైపుణ్యం కూడా ఏమీ లేదు… నిజానికి ఈనాడు తన ట్రెయిన్డ్ మానవ వనరుల్ని సరిగ్గా వాడుకోలేకపోతోంది… ఓరకమైన నిర్లిప్తత ఆ వ్యవస్థను ఆవరించింది… కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, తలుచుకుంటే మంచి మంచి కథనాలను ప్రజెంట్ చేయగల స్టాఫ్ ఈనాడులో ఇంకా ఉన్నారు… ఎటొచ్చీ వాళ్లకు సరైన డైరెక్షన్ కావాలి అంతే… లోపించిందీ అదే…
మన స్వతంత్ర భారతపు 75 ఏళ్ల ప్రగతి బాటను, స్వేచ్ఛా పయనాన్ని గుర్తుచేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీకా అమృత మహోత్సవ్’ పేరిట 75 వారాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది… దీనిలో భాగంగా పలు సదస్సులు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాల్ని భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది… ఈ సందర్భాన్ని ఈనాడు అందిపుచ్చుకుంది… మొత్తం 75 వారాలపాటు నిర్వహించగలదో లేదో గానీ… కొన్నాళ్లుగా రోజూ ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట ప్రత్యేక కథనాలను అచ్చేస్తోంది…
భారత స్వాతంత్య్ర చరిత్రలో మనకు తెలియని అనేక ‘అన్ టోల్డ్’ కథల్ని సరళమైన భాషలో చెబుతోంది ఈ శీర్షిక… బాగుంటున్నయ్… కొన్నాళ్లుగా రెగ్యులర్గా ఈ కథనాల్ని చదువుతున్న పాఠకుల అభిప్రాయం ఇదే… అసలు ఇది కదా మన స్వాతంత్య్ర చరిత్రను అక్షరబద్ధం చేయడం అంటే..! మన పాఠ్యపుస్తకాల్లో ఇవేమీ కనిపించవు… మనమేం చదివామో మనకే తెలియదు… ఇక ఇప్పటితరాలకు అసలేమీ తెలియదు… వాళ్లకు చెప్పేవాళ్లు లేరు…
Ads
సమాచార సేకరణ, సులభశైలిలో రచన… ఈనాడు మంచి పనిచేస్తోంది… ఎన్నివారాలపాటు కొనసాగిస్తారనేది వదిలేద్దాం… చేస్తున్నది మాత్రం అభినందనీయమైన పనే… అయితే ఇది ఈ ఆర్టికల్స్ ప్రచురణతో ఆగిపోవద్దు… ఇవన్నీ పుస్తకాలుగా ముద్రించబడాలి… అవి రాష్ట్రంలోని ప్రతి లైబ్రరీని చేరాలి… ఇంకా ఈ కసరత్తు మరింత ఉపయోగపడాలీ అంటే 9, 10 తరగతుల్లో పిల్లలకు నాన్ డిటెయిల్ పాఠ్యపుస్తకాల్ని చేయొచ్చు… మన చరిత్రను సరైన రీతిలో చదువుకోవడంకన్నా మన పిల్లలకు వేరే మంచి పాఠం ఏముంటుంది..? ఇదంతా అయ్యేది కాదు, పొయ్యేది కాదు అనుకుంటే… కనీసం ఈనాడే కొన్ని ఈ-బుక్స్, ఇంకొన్ని ప్రింట్ బుక్స్ తీసుకొస్తే బెటర్… రియల్లీ..!!
ఈమె పేరు… ముఖ్తవరం ఝాన్సీ లక్ష్మీ బాయి. జనగామ జిల్లా, కొడవటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు. చెప్పేది సాంఘిక శాస్త్రం అయినా ఇంటర్నెట్, టూల్స్, యాప్స్ పై మంచి పట్టుంది. భారత స్వాతంత్ర సంగ్రామ ఘట్టాలు ప్రచురిస్తున్న ఈనాడు కథనాలు చదివి భావి తరాలకు అందించాలని సంకల్పించారు. ప్రతిరోజూ వాటిని సేకరించి, మంచి స్వరం, భావానికి తగిన స్వరం గలవారిని సంప్రదించి, స్పష్టంగా చదివి తనకు వాట్సాప్ ద్వారా పంపిస్తే, ఒక యాప్ ద్వారా రికార్డ్ చేసి చదువరులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు… ఇప్పటికి 28 ఘట్టాలు స్వరబద్దం చేశారు. శెభాష్…
Share this Article