పార్ధసారధి పోట్లూరి …….. ‘పానిపట్ ఆపరేషనల్ యూనిట్‘…. ఇది ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం తమ కొత్త మిలటరీ యూనిట్ కి పెట్టిన పేరు. అమెరికా వదిలివెళ్ళిన ఆయుధాలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, దానికి ‘Panipat Operational Unit‘ పేరు పెట్టి, ఈ యూనిట్ ని ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల్లో ఉన్న ‘నాన్ గర్హర్ ప్రావిన్స్‘ [Nangarhar province] లో మోహరించింది తాలిబాన్ సర్కార్… మాస్కులు ధరించిన మిలటరీ యూనిట్ పరేడ్ చేస్తున్న దృశ్యాలని నాన్ గర్హర్ ప్రావిన్స్ రాజధాని అయిన జలాలాబాద్ లోని లోకల్ మీడియా సంస్థలు ప్రసారం చేసాయి. పానిపట్ ఆపరేషనల్ యూనిట్ ని పాకిస్థాన్ సరిహద్దుల్లో మోహరించడంలో తాలిబాన్ల ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావట్లేదు. ఈ యూనిట్ ని పాకిస్థాన్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మొహరించిందా ? లేక భారత్ ని దృష్టిలో పెట్టుకొని, ఇంకేదైనా ఆలోచనతో పానిపట్ పేరు పెట్టిందా ?
పానిపట్ అనేది హర్యానాలోని ప్రదేశం పేరు. మన ఖర్మ కొద్దీ మొదటి పానిపట్ యుద్ధం, రెండవ పానిపట్ యుద్ధం అంటూ చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాము. మొదటి రెండు పానిపట్ యుద్ధాలు విఫలయత్నానికి సాక్ష్యంగా నిలవగా, మూడవ పానిపట్ యుద్ధం ఆఫ్ఘన్ దురాక్రమణదారు అయిన అహ్మద్ షా అబ్దిల్ గెలిచాడు అని చరిత్ర.
జనవరి14, 1761 లో మూడవ పానిపట్ యుద్ధం జరిగిన రోజున మరాఠా రాజులతో చేసిన యుద్ధంలో ఆఫ్ఘనిస్థాన్ నుండి వచ్చిన అహ్మద్ షా అబ్దిల్ గెలవడమే కాక, ఒకే రోజున 60,000 మంది మరాఠా యోధులు ఆ యుద్ధంలో మరణించారు. వేల మంది మరాఠా యోధుల్ని యుద్ధ ఖైదీలుగా తనతో పాటు ఆఫ్ఘనిస్థాన్ తీసుకెళ్ళాడు అహ్మద్ షా ఆబ్దిల్. అలా ఖైదీలుగా తీసుకెళ్ళిన మరాఠా యోధులలో చాలావరకు ఇప్పటి బలూచిస్థాన్ లో స్థిరపడ్డారు అప్పట్లో…
Ads
ఇప్పటికీ ఆఫ్ఘన్లు అహ్మద్ షా అబ్దిల్ ని ఆధునిక ఆఫ్ఘన్ నిర్మాతగా భావిస్తారు. పానిపట్ యుద్ధాన్ని తమ చరిత్రలో భాగంగా గొప్పగా చెప్పుకుంటారు. ప్రముఖ చరిత్రకారుడు ఉదయ్ S కులకర్ణి చెప్తున్నప్రకారం మూడవ పానిపట్ యుద్ధం తాలూకు విజయాన్ని దృష్టిలో పెట్టుకొని తాలిబన్లు తమ కొత్త మిలటరీ యూనిట్ కి పానిపట్ అనే పేరు పెట్టారు… తద్వారా మధ్య యుగాలలో జరిగిన క్రూర యుద్ధాలని మళ్ళీ గుర్తు చేసుకుంటూ, దాని నుండి స్ఫూర్తిని రగిలించడానికి చేస్తున్న ప్రయత్నంగా చెప్తున్నారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. తాలిబన్లు పానిపట్ పేరు పెట్టడం అనేది పిచ్చితనం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కులకర్ణి గారు మరాఠా చరిత్రని కూలంకషంగా పరిశోధన చేసిన చరిత్రకారుడు. 18వ శతాబ్దపు మరాఠా చరిత్ర మీద 6 పుస్తకాలు రచించారు.
అహ్మద్ షా అబ్దిల్ ని ఆఫ్ఘనిస్తాన్ నిర్మాతగా వాళ్ళు చెప్పుకోవడం తప్పు కాదు, కానీ అదే సమయంలో మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం గోధుమలు, మందులు ఉచితంగా ఇవ్వడం మీద పునరాలోచించాల్సిన సమయం ఇది. తాలిబన్లు తమ కొత్త మిలటరీ యూనిట్ కి పానిపట్ పేరు పెట్టడం వెనుక దురాలోచన ఉందనేది స్పష్టం. భారత్ మీద దురాక్రమణకి దిగిన అహ్మద్ షా అబ్దిల్ పేరుతో పాకిస్తాన్ తన మిసైల్ కి పేరు పెట్టడం వెనుక కూడా అదే దురాలోచన ఉంది.
అయితే మన సైన్యం యొక్క విధానం మాత్రం ‘’సర్వ ధర్మ సమ భావమ్‘’ అంటే అన్ని ధర్మములని సమభావంతో చూడడం అన్నమాట ! మన సైన్యం ప్రతిభా పాటవాలు ఇప్పుడున్న అన్ని సైన్యాలలో కన్నా అతి ఉతృష్టమయినవి. ముఖాముఖి తలపడినప్పుడు ఎవరు ఏమిటో తేలిపోతుంది.
మొదటి పానిపట్ యుద్ధం ఏప్రిల్ 1526 లో బాబర్ మొదటిసారిగా అప్పటి రాజు అయిన ‘’లోడీ‘’ మీద పోరాడి అతి కష్టంమీద గెలిచాడు. రెండవ పానిపట్ యుద్ధం November 5, 1556లో రాజు ‘హేము‘ అక్బర్ మధ్య జరిగింది ఇందులో కూడా అక్బర్ కి అంత తేలికగా విజయం లభించలేదు. మూడవ పానిపట్ యుద్ధం గెలిచిన తరువాత అహ్మద్ షా అబ్దిల్ ఆఫ్హనిస్తాన్ వెళ్ళిపోయాడు కానీ అబ్దిల్ కి మాత్రం పంజాబ్ ని గెలవాలని బలమయిన కోరిక ఉండేది, కానీ అటు వైపు కన్నెత్తి చూడడానికి భయపడి, మళ్ళీ భారత్ రాలేదు.
ప్రముఖ మరాఠీ నవలా రచయిత అయిన విశ్వాస్ పాటిల్ వ్రాసిన పానిపట్ నవల ఇప్పటికీ మరాఠీ నవలలో బెస్ట్ సెల్లర్. విశ్వాస్ పాటిల్ చెప్తున్న ప్రకారం అబ్దిల్ కనుక ఇప్పటి సింధు నది [పాకిస్తాన్ లో ఉంది ఇప్పుడు] ప్రాంతంలో కనుక తలపడి ఉంటే, ఆ సింధు నది ఆఫ్ఘన్ సేనల రక్తంతో నిండి పోయి ఉండేది యమునా నదికి బదులుగా… ఇప్పటికీ ప్రతి సంవత్సరం జనవరి 14 న హర్యానాలోని పానిపట్ లో ప్రజలు లక్షల సంఖ్యలో చేరుకొని, అప్పట్లో పానిపట్ యుద్ధంలో మరణించిన మరాఠా యోధులకి నివాళులు అర్పిస్తుంటారు.
2019 లో హిందీ దర్శకుడు అశుతోష్ గోవారికర్ నిర్మించిన పానిపట్ హిందీ చిత్రంలో అబ్దిల్ ని విలన్ గా చిత్రీకరించిందుకు అప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నిరసన తెలిపింది మన ప్రభుత్వానికి. ఆఫ్ఘనిస్తాన్ జాతిపితగా పిలుచుకునే అహ్మద్ షా అబ్దిల్ ని పానిపట్ చిత్రంలో విలన్ గా చూపించినందుకు మేము బాధని వ్యక్తం చేస్తున్నాము అంటూ లెటర్ వ్రాసింది ఆఫ్ఘన్ ప్రభుత్వం. దానికి ప్రతిగా నేటి తాలిబన్ ప్రభుత్వం తమ కొత్త మిలటరీ యూనిట్ కి పానిపట్ పేరు పెట్టి ఉండవచ్చు. మరి ఇప్పుడు మనం మానవతా దృక్పథంతో ఇస్తున్న గోధుమలు, ప్రాణాధార మందులని ఆపేయాలా ? మనం కూడా నిరసన తెలపాలి కదా ?
Share this Article