ఏరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశమో గానీ… ఓ వీడియో బిట్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది… సుబ్బారెడ్డి దేవుడిని అమ్మకానికి పెట్టాడనీ, ఆదాయం తప్ప వేరే లోకమే లేదనీ, భక్తులను నిలువుదోపిడీ చేసేలా ఆర్జిత సేవల రేట్లు పెంచేశాడనీ సోషల్ యాక్టివిస్టులు తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… ఆ వీడియో చూస్తే అలా అనిపించడంలో, అలా కోపాన్ని వ్యక్తీకరించడంలో తప్పు లేదనిపిస్తుంది… కానీ ఇక్కడ జరుగుతున్నది అనవసర ట్రోలింగే…
టీటీడీ ట్రస్ట్ బోర్డు ఉనికి మీద, అందులోకి రాజకీయ నియామకాల మీద, వాళ్ల పెత్తనాల మీద, తిరుమలను వ్యాపారక్షేత్రం చేసే బోర్డు ధోరణి మీద, వీఐపీల దేవుడిగా మార్చిన తీరు మీద… ఇంకా చాలా అంశాల మీద సగటు భక్తుడిలో విపరీతమైన అసంతృప్తి ఉంది… అది సహేతుకం… అయితే ఇప్పుడు ఆర్జిత సేవల రేట్లు పెంచడాన్ని విమర్శించే పనిలేదు, పైగా ఆహ్వానించాలి కూడా… ఎందుకంటే..?
ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు, అంతిమ నిర్ణయాలు ఏమిటో తెలియదు గానీ… సదరు వీడియోలో కనిపిస్తున్న సంభాషణల్ని, ప్రతిపాదనల్ని బట్టి, అనధికార సమాచారాన్ని బట్టి… సుప్రభాత సేవ రేటును 240 నుంచి 2000 కు, తోమాల సేవ 440 నుంచి 5000 కు, కల్యాణోత్సవం 1000 నుంచి 2500 కు, వేదాశీర్వచనం 3000 నుంచి 10500 కు, వస్త్రాలంకరణ సేవ 50 వేల నుంచి లక్ష రూపాయలకు, శ్రీవాణి సేవ 10500 కు పెంచారట…
Ads
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… ఈ రేట్లు పెంపుదల పూర్తిగా సిఫారసు లేఖల ఆధారంగా ఈ ఆర్జిత సేవల్ని పొందే భక్తులకు మాత్రమే వర్తిస్తుంది… ఇంత నెగెటివ్ ప్రచారం సాగుతుంటే టీటీడీ క్లారిటీ ఇచ్చినట్టు మాత్రం ఎక్కడా కనిపించలేదు… (రోజూ గుండు గీకబడిన భక్తుల సంఖ్య, హుండీ ఆదాయ సమాచారం మాత్రం రెగ్యులర్‌గా ఇస్తారు…) నిజానికి సిఫారసు భక్తులకు సేవల రేట్లు పెంచితే తప్పేముంది..? టీటీడీ మంచి పనిచేస్తోంది… ఆర్జిత సేవలంటేనే స్వామివారికి ఆర్జన తెచ్చిపెట్టేవి కదా… ఎన్నో ఏళ్లయింది ఈ రేట్లను పెంచక… అసలు ఈ సేవల రోజువారీ సంఖ్యను కూడా అర్జెంటుగా సగానికి తగ్గిస్తే ఇంకా మేలు…
నిజంగా సుబ్బారెడ్డి గనుక తనకు దక్కిన అవకాశాన్ని సార్థకం చేసుకోదలిస్తే సిఫారసు లేఖల ద్వారా విశేష దర్శనాలు చేసుకునే భక్తుల నుంచి కూడా మూడు నాలుగు రెట్ల మేరకు ఎక్కువ వసూలు చేసినా తప్పులేదు… సిఫారసుల యవ్వారాల్ని ఎంత డిస్కరేజ్ చేస్తే అంత బెటర్… తద్వారా ఆదా అయ్యే స్వామివారి సమయాన్ని సామాన్య భక్తుల సర్వదర్శనాలకు అడ్జస్ట్ చేయాలి… మరీ సుబ్బారెడ్డి ఇంకొంత పుణ్యాన్ని మూటగట్టుకోవాలనుకుంటే ప్రసాదాల్లో నాణ్యత పెంచడమే కాదు, బోర్డు సభ్యులకు కల్పించే అన్నిరకాల కోటాల్ని పూర్తిగా రద్దు చేయాలి… పోతేపోనీ, బోర్డుకు రాజీనామా చేస్తామంటారా..? నిక్షేపంగా చేసుకొమ్మనండి, ఎవడి కోసం ఈ కోటాల దందాలు..?
నిర్లక్ష్యానికి నిలువెత్తు నమూనాలుగా వ్యవహరించే టీటీడీ సిబ్బందిలో సేవాభావాన్ని, ధార్మిక భావనల్ని తీసుకురావడం, సగటు భక్తుడి పట్ల మర్యాదగా ప్రవర్తించడాన్ని సుబ్బారెడ్డికే కాదు, సాక్షాత్తూ ఆ స్వామి వారికి కూడా సాధ్యమయ్యే స్థితి లేదు… అతి పెద్ద హిందూ ఆలయక్షేత్రాన్ని తమ క్షుద్ర రాజకీయాలతో ఇప్పటికే పంకిలం చేశారు… (అసాధారణంగా 52 మందిని బోర్డులోకి ఎక్కించిన ప్రభుత్వ తీరు మీద కోర్టులో విచారణ కూడా జరుగుతోంది, చూస్తున్నాం కదా…) సో, ప్రభుత్వ పెత్తనం నుంచి బోర్డును తప్పిస్తే తప్ప మోక్షం లేదు… జిలేబీ రేటు, లడ్డూ రేటు మీద ఆందోళనలు, సోషల్ మీడియా పోరాటాలు కాదు చేయాల్సింది… తిరుమల విముక్తి గురించి చేస్తే పుణ్యం, స్వామికి తృప్తి…!!
Share this Article