తిరుమల శ్రీవారి సేవకు ఉదయాస్తమాన సేవ అని ఒక విశిష్ట ఆర్జిత సేవ ఉంటుంది… అత్యంత గిరాకీ… బోర్డు సభ్యులకు వాటికి సిఫారసు చేయడం మంచి లాభదాయకమట… తాజాగా ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా కల్పించే పనిలో ఉందట టీటీడీ… మొన్నటి ఆర్జిత సేవల మీటింగ్ సందర్భంగా, ఈ బోర్డు సభ్యులు అత్యంత ధార్మిక భావనలతో, మనసంతా పుణ్యాభిలాషతో ఆర్జిత సేవల విషయం బాగా ‘‘డిస్కస్’’ చేసిన వీడియో చూశారు కదా… శ్రీవారి భక్తగణం తరించిపోయింది… వాళ్లను ఎంపిక చేసిన జగనన్న ఎంత ఆనందపడ్డాడో కదా…!!
ఇదంతా ఎందుకు చెప్పుకోవాలీ అంటే… ఒక్కరికీ సగటు భక్తుడి కష్టాలు పట్టవు… అందరి హృదయాలూ ఆ వీఐపీల కోసమే కొట్టుకుంటయ్… సత్రాలు, కాటేజీలు, సేవల రేట్ల నుంచి ప్రతిచోటా వివక్ష, లాభార్జన కాంక్ష… ఈనేపథ్యంలో ఈనాడులో ఒక వార్త వచ్చింది… అది ఈటీవీ స్టోరీ, వీళ్లు రాసేసుకున్నారు… బాగుంది… నిజంగా ఒక రిపోర్టర్ దృక్కోణం తిరుమల దర్శనాలు, కోటాలు, దుకాణాలు, దందాలకన్నా ఈ కోణంలోనే ఉండాలి…
Ads
టీటీడీ పట్టించుకోవాల్సిన కోణమూ అదే… విస్మరించేదీ ఇదే… మనసు నిండా శ్రీవారిని నింపుకుని, ఒక్కసారి దర్శించి, పుణ్యాన్ని పొందుదామని ఎంతో ఆశతో నానా ప్రయాసలకూ గురవుతూ వస్తారు సామాన్య భక్తులు… అలాంటివాళ్లు సంతృప్తిగా తిరిగి వెళ్తేనే స్వామికీ ఆనందం… కానీ టీటీడీ ఏమాత్రం పట్టించుకోని కేటగిరీ కూడా ఇదే పాపం… పిల్లల్ని వెంటేసుకుని ఏ రైలో, ఏ బస్సో దిగి… క్యూలైన్లలో నిలబడి టోకెన్లు తీసుకున్నా సరే, రోజుల తరబడీ జాప్యం…
అదే వీఐపీ భక్తులైతే అలా రయ్యిమంటూ వెళ్తారు… స్వామి వారి దగ్గర నిలబడి దర్శించుకుంటారు… అడిగిన కాటేజీ, ఆశీర్వచనాలు, ప్రసాదాలు… వాట్ నాట్… భక్తులుగా కాదు, ఆ శ్రీవారికి అతిథులుగా గౌరవిస్తారు… కానీ ఓ సగటు భక్తుడు, సామాన్య భక్తుడికి వసతి దొరకదు… తిరుపతిలో ఫుడ్ రేట్లు తెలుసు కదా… జేబుకు చిల్లు… కరోనా కేంద్రాలుగా మారిన వసతి గృహాలు కరోనా మాయమైపోయినా భక్తకేంద్రాలుగా మారలేదు… ఇంకేం చేస్తారు..? వంట పాత్రలు, అవసరమైన కిరాణ సామగ్రి, కట్టెలు పెట్టేసి, పొయ్యి వెలిగించి, కడుపు నింపుకుంటున్న ఫోటో అది…
హోటళ్లలో ఉండలేరు… ఆ టారిఫ్ మండిపోతూ ఉంటుంది… ఇక్కడి నుంచీ మొదలవుతాయి భక్తుల కష్టాలు… తిరిగి ఏ బస్సో, ఏ రైలో ఎక్కేవరకూ అనేకచోట్ల భక్తుల్లా కాదు, పురుగుల్లా చూస్తారు… అదీ కలుక్కుమనిపించేది… కడుపు చించుకుంటే అన్నట్టుగా… ఏ పాత్రికేయుడికీ ఇవి పట్టవు… వేసుకొండి, వేసుకొండి… ఫలానా సెలబ్రిటీ వచ్చాడు, దర్శించాడు, జనాన్ని ఉద్దేశించి ఏదో కూశాడు, రాసి తరించండి, ఆ ఫోటోలు అచ్చేసి పుణ్యలోకాలు చేరుకొండి… బోర్డు సభ్యుల మాటేమిటి..? అధికారులేం చేస్తున్నారు అంటారా..? అవున్లెండి… ఆయనే ఉంటే…!!
Share this Article