అవును… ముచ్చింతల్ రామానుజ క్షేత్రం, చిన జియ్యర్ వ్యవహారాలపై ఆసక్తితో గమనిస్తున్న సెక్షన్లలో ఓ చర్చ… ఓ ప్రశ్న… చిన జియ్యర్ తన కర్తవ్యాన్ని మరిచి, ఓ కమర్షియల్ రియల్ ఎస్టేట్ దందాకు మద్దతుగా నిలిచి, రాజకీయ పంకిలాన్ని అంటించుకుని, ఆధ్యాత్మికతకన్నా ఇంకేదో మార్గంవైపు తరలిపోతూ… చివరకు ఇప్పుడు తలపట్టుకున్నాడా..? అవమానానికి, మోసానికి గురయ్యానని బాధపడుతున్నాడా..? ఒక సన్యాసి వగపు వెనుక తాజా కారణాలేమిటి..?
ఈ జియ్యర్ బాట వేరు… ఆధ్యాత్మిక ప్రచారం, ప్రజల్లో ధార్మిక స్పృహ పెంపుకన్నా ఇతరత్రా అంశాలపై ప్రేమ… తద్వారా వివాదాలు… గతంలో పలుసార్లు తనపై విమర్శల అస్త్రాలు… ఇక తను తలపెట్టిన రామానుజ ప్రాజెక్టు నిజానికి పూర్తయినట్టేనా..? కాదు… మూడు దశల్లో 1200 కోట్ల పైచిలుకు ప్రాజెక్టట అది… ఇప్పటికి దాదాపు 300 కోట్ల దాకా ఖర్చుపెట్టారు… ఇక మిగతా దశలు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు… డబ్బుల్లేవ్…
ఒక దశలో విగ్రహం ఏర్పాటు కోసం చైనా నుంచి వచ్చిన నిపుణులకు డబ్బులు అడ్జస్ట్ చేయలేని దుస్థితి తలెత్తితే… నోవాటెల్ హోటల్‌లో రోజుల తరబడీ వాళ్లను ఉంచేసి, హోటల్‌కే పదీఇరవై కోట్లు చెల్లించారనేది విస్తుపోయే సమాచారం… చివరకు తన ఆస్పత్రిని కుదువపెట్టి, డబ్బు తెచ్చి, వాళ్ల డబ్బులు ఇచ్చేసి, పంపించేశాడు జియ్యర్… డబ్బు కోసం (ప్రాజెక్టు కోసమే) ఎవరడిగినా వాళ్ల ఇళ్లకు వెళ్లాడు జియ్యర్… ఎంత ఇచ్చినా తీసుకున్నాడు…
Ads
తన స్థాయిని తగ్గించుకుని మరీ… పంచెలు, ధోవతుల ఫంక్షన్లకు కూడా వెళ్లి ఆశీస్సులు ఇచ్చాడు… గుడివాడ కేసినో నిందితుడి కూతురికి చీర కట్టించే ఫంక్షన్ వెళ్లి 5 లక్షలు తీసుకున్నాడనే వార్త కూడా విస్మయకరమే… సదరు నిందితుడు, స్వామి ఇద్దరూ ఒకే కారులో ఉన్న ఫోటో ఒకటి ఆమధ్య సోషల్ మీడియాలో రచ్చ రేపింది… ఇక్కడ ప్రశ్న, జియ్యర్‌గా తన రేంజ్‌ను, సదరు పీఠం విశిష్టతను ఎందుకంతగా తగ్గించాలి..? అంతేకాదు, అంత పెద్ద ప్రాజెక్టు చేపడితే దానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏది..? అసలు ఆధ్యాత్మిక బోధనలు వేరు, ఈ భారీకట్టడాల టూరిజం ఆకర్షణలు వేరు… ఏది అనుసరణీయం..?
సరే, మైహోం అధినేత 57 ఎకరాలు ఇచ్చాడట… ఈ ప్రాజెక్టు పూర్తయితే తనకు దక్కే రియల్ ఎస్టేట్ లబ్ధి కారణం కావచ్చు… ఆ ఏరియాలో యాక్టివిటీ పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు కావచ్చు… తీరా మొదటి దశ పూర్తి చేయడానికే డబ్బులకు కటకట రావడంతో తనే ముందుకొచ్చి డబ్బు ఖర్చుపెట్టుకున్నాడు… భారీగా ఆర్థికసాయం ప్రామిస్ చేసిన కేసీయార్ ప్రారంభోత్సవపు వివాదాలతో అకస్మాత్తుగా దూరం అయిపోయాడు… చివరకు ప్రారంభోత్సవ యజ్ఞాల కోసం వచ్చిన రిత్విక్కులకు కూడా సరైన ఏర్పాట్లు చేయలేకపోయారుట…
అసలు పంచాయితీ మరొకటి ఉందట… ఆ క్షేత్రం ఓనర్ ఎవరు..? ఆ భూముల్ని జియ్యర్ ట్రస్టుకు గానీ, జియ్యర్ సూచించిన పేర్లకు గానీ మైహోం అధినేత రిజిస్ట్రేషన్ చేయలేదని మరో సమాచారం… ఇదే అడిగితే ‘‘ఎవరి పేరు మీద ఉంటే ఏమిటి’’ అనే సమాధానం పొందిన జియ్యర్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు… అంతేకాదు, మైహోం తన వారసుల పేరిట ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయబోతున్నాడనే సమాచారం తెలిసి జియ్యర్ స్వామి కలవరపడుతున్నాడు… (కాదు, రెండు ట్రస్టుల పేరిట రిజిస్టర్ చేశారని మరో సమాచారం…)
మొన్నటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా మైహోం పర్యవేక్షణ, పెత్తనం కింద… తన పేరుతోనే సాగాయి… మరిక ఆ క్షేత్రం మీద జియ్యర్ విచక్షణాధికారం, యాజమాన్యం ఏమున్నట్టు..? ఏం ఉండబోతున్నట్టు..? ఎవరు పిలిస్తే వాళ్ల ఇళ్లకు వెళ్లి, ఇచ్చిన కాడికి తీసుకుని, అంత డబ్బు సంపాదించి, ఆ క్షేత్రం మీద ధారబోస్తే, అంతిమంగా తనకు దక్కిందేమిటి..? ఈ మొత్తం వ్యవహరంలో రామానుజ భక్తులకు ఇస్తున్న సంకేతం ఏమిటి..? రుజుమార్గంలో నడవాలని చెబుతూ, ఆదర్శంగా నడవాల్సిన అడుగులే ఇలా దారితప్పితే ఎలా..? ఇదీ ఇప్పుడు చర్చనీయాంశం..!!
Share this Article