ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించడమే కాదు ముఖ్యం… ఎక్కువ మెజారిటీ నెగ్గడమూ ఓ తృప్తి… కానీ కేరళలో జరిగిన ఓ ఎన్నికల వింతగా ఉంది… ప్రత్యర్థి కాని ప్రత్యర్థికి ఒక్క వోటు పడకుండా చేయడం…! కొడువళ్లిలో కరాట్ ఫైసల్ అంటే ఓ ఊరమాస్ లీడర్… సీపీఎం… అక్కడ తనకు ఓ గ్యాంగు, ఓ క్రేజ్… అక్కడ ఫైసల్ చెప్పిందే శాసనం… పినరై విజయన్ కాదు కదా, సీతారాం ఏచూరి వచ్చినా సరే, ఫైసల్ చెప్పిందే జరుగుతుంది అక్కడ… తన అడ్డా ఏమిటంటే 15వ వార్డు…
ఈ అమ్మగారు గుర్తున్నారు కదా… స్వప్నా సురేష్… ఈమధ్య జాతీయ స్థాయిలో చర్చను రేకెత్తించి, ఈరోజుకూ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్న గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక సూత్రధారి… ఈ అమ్మగారు ఏకంగా కేరళ సీఎం కుర్చీ కిందకే నీళ్లు తెచ్చే స్థాయిలో వ్యవహరించింది… ఇక్కడ విషయం ఏమిటంటే..? ఈ కొడువళ్లి ఫైసల్కూ ఈ స్వప్నకు మంచి సంబంధాలున్నయ్…
Ads
ఫైసల్ పేరు కూడా ఈ గోల్డ్ స్మగ్లింగ్ రాణి స్వప్న లింకుల్లో బయటపడటంతో ఇరుకునపడ్డాడు… స్థానిక ఎన్నికల్లో నిజానికి ఫైసల్ నిలబడతాను అని అంటే ఇంకెవరూ ఆవైపు కన్నెత్తి చూడరు… కానీ ఈ గోల్డ్ స్మగ్లింగ్ మరక కారణంగా ఎల్డీఎఫ్ ఫైసల్ అధికారిక అభ్యర్థిగా పోటీచేయడానికి నో అనేసింది… అబ్దుల్ రషీద్ అని వేరే అభ్యర్థిని నిలబెట్టింది…
మరి ఫైసల్ ఊరుకోడు కదా… అక్కడున్న పార్టీ వాళ్లంతా చెప్పడంతో ఇండిపెండెంటుగా నిలబడ్డాడు… అక్కడ ప్రత్యర్థి నిజానికి ముస్లిం లీగ్ నుంచి నిలబడిన ఖాదర్… తనను ఓడించడంకన్నా ఫైసల్ తనకు బదులుగా ఎల్డీఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగిన రషీద్ పైనే కాన్సంట్రేట్ చేశాడు… చివరకు ఫలితం ఏమిటో తెలుసా..?
ఫైసల్‌కు 568 వోట్లు వచ్చాయి… గెలిచాడు… తన రాజకీయ ప్రత్యర్థి ఖాదర్‌కు 495 వోట్లు… పర్లేదు, గౌరవప్రదమైన ఓటమే… కానీ ఫైసల్ దెబ్బకు ఎల్డీఎఫ్ అభ్యర్థి రషీద్‌కు ఒక్కటంటే ఒక్క వోటూ రాలేదు… నిఝం… జీరో… హబ్బ, కొడితే అలా కొట్టాలీ అంటారా..? ఓ చిన్న ట్విస్ట్ ఉంది…
కనీసం ఆ రషీద్ వోటయినా పడి ఉండాలి కదా… పడలేదు… అంటే పార్టీ హోల్ మొత్తంగా ఫైసల్కే సపోర్టు చేసిందని లెక్క… పేరుకు రషీద్ నిలబడ్డాడే తప్ప తన వోటు కూడా వేసుకోలేదు అన్నట్టే కదా…
ఇక్కడ బీజేపీకి 50 వోట్లు వచ్చాయి… అది వేరే కథ… ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవల్సింది ఏమిటంటే..? పార్టీ నిజంగానే సీరియస్‌గా తీసుకుని ఉంటే… ఈ ఫైసల్‌కు ఇన్ని వోట్లు వచ్చేవా..? పార్టీకన్నా వ్యక్తే ముఖ్యమని గుర్తించి, సాగిలబడి, తన పార్టీ వోట్లన్నీ అనధికారికంగా ఫైసల్‌కు వేయించిందా..? మరిక ఈ పార్టీ బహిష్కరణలు, టికెట్లు నిరాకరణలు, వేరే అభ్యర్థి ఎంపికలూ జనం కళ్లకు గంతలు కట్టడానికేనా..? ఓహ్… సీపీఎం కూడా ఇలాంటి పనులు చేస్తుందా..? వారెవ్వా…!!
Share this Article