మొన్న నిశ్శబ్దంగా యాదాద్రిలో విశేష పూజలు మొదలైపోయాయ్… అవేమిటయ్యా అంటే… ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణం సాగుతోంది కదా… అందుకని మూలవిరాట్టులను తీసుకొచ్చి బాలాలయంలో పెట్టారు కదా… ఇప్పుడు సంప్రోక్షణతో, యంత్ర పూజలతో ప్రత్యేక పూజలు స్టార్టయ్యాయి… అంటే తిరిగి గర్భగుడిలోకి వాటిని తరలించే పని మొదలైంది… ఇక హఠాత్తుగా ఎప్పుడో ఓసారి పునర్నిర్మిత గర్భగుడిలో దర్శనాలకు తలుపులు తెరుచుకోవచ్చు…
అదేమిటి..? వెయ్యి పైచిలుకు హోమకుండాలతో నభూతో నభవిష్యతి అనే తరహాలో భారీగా సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తామని కేసీయార్ అప్పట్లో ప్రకటించినట్టు గుర్తు కదా… కేసీయార్‌కు సంబంధించిన ఏ చిన్న కార్యక్రమానికైనా భారీగా ప్రచారం, ఇతరత్రా హంగామా ఉంటుంది కదా… మరి వందల కోట్లు ఖర్చు చేసి, ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదాద్రిని అంత అనామకంగా ఎందుకు ప్రారంభిస్తారు..? ఇదీ ప్రశ్న…
అధికారులు, అర్చకులకు కూడా క్లారిటీ లేదు… అసలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందా లేదా తెలియదు… మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి అనేవే పైనుంచి ఆదేశాలు… అంటే… ఓ డైలమా… ఇదెక్కడ స్టార్టయ్యిందీ అంటే… ముచ్చింతల్ రామానుజ ప్రాజెక్టు ప్రారంభోత్సవం దగ్గర స్టార్టయింది…
Ads
మోడీని ఆహ్వానించడం, ఆయన వస్తున్నాడని కేసీయార్ ఎగ్గొట్టడం, శిలాఫలకంపై పేరు మాయం కావడం వంటి వివాదాల సంగతి తెలుసు కదా… తరువాత రాష్ట్రపతి వచ్చినా సరే, ఆయన వెంట కూడా కేసీయార్ ముచ్చింతల్ వెళ్లలేదు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ప్రోగ్రాంను టీఆర్ఎస్ నుంచి బీజేపీ హైజాక్ చేసేసింది… కేసీయార్‌కు సహజంగానే మండిపోతోంది…
అప్పటికే చిన్న జియ్యర్ యాదాద్రి వైపు వెళ్లడం మానేశాడు… మొదట్లో బాగా కాన్సంట్రేట్ చేసినా సరే, తరువాత ఈ రామానుజ ప్రాజెక్టు మీదే దృష్టి పెట్టాడు… కేసీయారే పలుసార్లు స్వయంగా వెళ్లి పనులను సమీక్షించాడు… పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి… ఇక ఆరంభించడమే తరువాయి… కానీ ఈలోపు ఈ వివాదాలు… తను చిన్న జియ్యర్‌కు ఈ యాదాద్రి ప్రారంభోత్సవ కార్యక్రమ పగ్గాలు ఇచ్చే మూడ్‌లో అస్సలు లేడు… అసలు పిలుస్తాడా అనేది కూడా డౌటే… (అన్నట్టు మొన్న సుదర్శన నారసింహ హోమం కూడా నిర్వహించినట్టు నమస్తే తెలంగాణ వార్త చెబుతోంది… బహుశా ఓ చిన్న స్థాయి హోమం అయి ఉంటుంది)…
ఇంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన గుడి ప్రారంభోత్సవం ఏ హడావుడి లేకుండా నిర్వహించలేరు… అలాగని మోడీని, ఇతర దేశ ప్రముఖుల్ని పిలవలేడు… ఇప్పుడంతా మోడీతో డిష్యూం డిష్యూం సీజన్ కదా… పోనీ, విపక్ష ప్రముఖుల్ని పిలుద్దామా అంటే… స్టాలిన్ వీరనాస్తికుడు, మమతకు ఇవేమీ పెద్దగా పట్టవు… పైగా ఇప్పుడు చేసేది బీజేపీ మీద పోరు కదా, కాస్త సెక్యులర్ లుక్ అవసరం… వెరసి ఓ పే-ద్ద సంధిగ్ధం… కాస్త ఏదో ఒకటి తేల్చి, త్వరగా ఆ కొత్త తలుపులు తెరవండి స్వామీ… చూడాలి… ఆమధ్య ఆంధ్రజ్యోతి రాసింది కదా… ఉగ్రనరసింహుడిని కాస్తా శాంతనరసింహుడిని చేశారని… ఓసారి దర్శించుకోవాలి…!!
Share this Article