Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జెండా రంగులు కాదు… యూపీ రాజకీయాల్లో టోపీ రంగుల లొల్లి…

February 27, 2022 by M S R

యూపీలో టోపీ రాజకీయం….. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరఖండ్‌, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన వాటి సంగతి ఏమైనా గానీ, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలే ఇప్పుడు కీలకం. 80 లోక్‌సభ సీట్లు ఉండే ఉత్తరప్రదేశ్‌ ఎప్పుడూ దేశ రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు యూపీ ఫలితాలే తొలి మెట్టు అవుతాయి. ఇక్కడ అధికారంలో ఉంటే బీజేపీకి ఢిల్లీ గద్దె సులువుగా దక్కుతుంది. బీజేపీని గద్దె దించాలనే తపనతో ఉన్న మిగిలిన పార్టీలు యూపీ ఫలితాలతోనే ఫ్యూచర్‌ ప్లాన్లు సిద్ధం చేసుకుంటాయి.

అందుకే ఏ రాష్ట్రానికి లేనంత రాజకీయ ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్‌కు ఉంటుంది. 403 అసెంబ్లీ సీట్లు ఉన్న యూపీలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ సాగుతున్నది. రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా గెలుపు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఉగ్రవాదం, మతం, కులం, రౌడీయిజం, సాగు చట్టాలు, సైకిళ్లు, బుల్డోజర్లు… అన్ని ఇక్కడ ప్రచారమే అవుతున్నాయి. ఇవన్నింటికీ తోడుగా ‘టోపీ’ల రాజకీయం యూపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఎర్ర టోపీ, నల్ల టోపీ ధారణపై సరికొత్త రాజకీయం నడుస్తోంది.

ఎర్ర పార్టీలకు కోటగా ఉన్న త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2018లోనే యూపీలో టోపీల రాజకీయం మొదలైంది. ‘ఈశాన్య భారతంలో ఎర్ర జెండా కిందికి దిగింది. యూపీలో ఎర్ర టోపీని బీజేపీ ఇలాగే చేస్తుంది. ఎర్ర టోపీలు ఇక్కడ పని చేయవు. ఇక్కడ కాషాయానికి టైం వచ్చింది. అభివృద్ధికి, ఉదారతకు చిహ్నం కాషాయం’ అని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ అప్పుడే అన్నాడు. యూపీకి ఎర్ర టోపికి సంబంధం ఏంటనే డౌటు మిగిలిన వారికి వస్తుందిగానీ ఆ రాష్ట్రంలోని వారికి ఇది పాత ముచ్చటే. అఖిలేష్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పగ్గాలను తీసుకున్నప్పటి నుంచే యూపీలో ఎర్ర టోపీ రాజకీయ అంశం అయ్యింది.

Ads

బీజేపీని అన్ని విషయాల్లో వ్యతిరేకించే వామపక్ష పార్టీలు చెప్పుకునే సోషలిజం, సామాజిక న్యాయం సిద్ధాంతాలను తాము ఆచరిస్తున్నామని చెప్పేందుకు అఖిలేష్‌యాదవ్‌ ఎస్పీలోకి ఎర్ర టోపీ ధారణను తెచ్చాడు. 2017 నుంచి ఎర్ర టోపీని కచ్చితంగా ధరిస్తున్నాడు. ఎస్పీలోని అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలతో ఇలాగే చేయిస్తున్నాడు. ప్రతి ఎస్పీ కార్యకర్త ఎర్ర టోపీ పెట్టుకునేలా అఖిలేష్‌ ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాడు. దీని కోసం ఎస్పీ ప్రతి కార్యక్రమంలోనూ అఖిలేష్‌ తప్పనిసరిగా ఎర టోపీని పెట్టుకుంటున్నాడు. సోషలిస్టు సిద్ధాంతాల నేతలు జయ్‌ప్రకాశ్‌ నారాయణ్‌, రాంమనోహర్‌ లోహియాల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌యాదవ్‌ ఎర్ర టోపీని ఇష్టంగా ధరిస్తున్నాడు. ఎస్పీలోని పాత తరం నేతలంతా ఎర్ర టోపీ విధానాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. ఎర్ర టోపీ ఇప్పుడు ఎస్పీలో తప్పనిసరి అయ్యిందని చెప్పొచ్చు.

నిత్యం కాషాయ వస్త్రాలతో ఉండే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్‌ ఎరుపుపై తన వ్యతిరేకతను అస్సలు దాచుకోవడంలేదు. పార్టీ కార్యక్రమం, అసెంబ్లీ ఎక్కడైనా ఎర్ర టోపీలపై కామెంట్లు చేస్తున్నాడు. ఎస్పీ ఎమ్మెల్యే ఒకరు ఎర్ర టోపీతో అసెంబ్లీలోకి వస్తే… ‘ఎరుపు రక్తానికి చిహ్నం, అది ధరించేది గుండాలే’ అని అన్నాడు. పనిలో పనిగా ఎస్పీ పాలనలో గుండాయిజంతో జనాలు ఇబ్బందులు పడ్డ విషయాలను గుర్తు చేస్తున్నాడు. సీఎం యోగీ మాటలకు ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ‘ఎరుపు రంగు క్రాంతికి గుర్తు. అది మా రక్తంలోనే ఉంది’ అని గట్టిగానే కౌంటర్‌ ఇస్తున్నాడు. ఎర్ర టోపీపై మాటల యుద్ధం… బీజేపీ సీఎం యోగీ, ఎస్పీ అధినేత అఖిలేష్‌ మధ్యకే పరిమితం కాకుండా, రెండు పార్టీల నేతల వరకు వెళ్లింది.

ఎరుపు రంగుతో ఎస్పీకి అసలు ఏమిటి సంబంధం అని బీజేపీ నేతలు అడుగుతున్నారు. ఎరుపు రంగును ఎందుకు వాడుకుంటున్నారో ఎస్పీ ప్రజలకు వివరించాలని అంటున్నారు. ఎర్ర టోపీ ఎస్పీ విధానాలను చెబుతోందని… ఇది మత పార్టీలకు ఇబ్బందులు కలిగిస్తోందని ఎస్పీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. ఎర్ర టోపీ, కాషాయం రంగుల నుంచి రాజకీయం నల్ల టోపీల వరకు వెళ్లింది. బీజేపీ మాతృసంస్థగా భావించే ఆర్‌ఎస్ఎస్ లో ప్రతి ఒక్కరికీ నల్ల టోపీ ధారణ తప్పనిసరి.

ఎస్పీ ఎమ్మెల్సీ ఉదయ్‌వీర్‌సింగ్‌ ఇంకొంచెం వెనక్కి వెళ్లి ఆర్‌ఎస్ఎస్ ను టోపీల రాజకీయంలోకి తీసుకొచ్చాడు. యూపీలో ఇప్పుడు పోరాటం అంతా ఎర్రటోపీ, నల్ల టోపీ మధ్య అని… ఆర్‌ఎస్ఎస్ వాళ్లు నల్ల టోపీ ఎందుకు ధరిస్తారో చెప్పాలని ఉదయ్‌వీర్‌ అన్నాడు. అన్నట్లు రాజకీయ పార్టీల్లో టోపీలు ధరించడం మన దేశంలో మొదటి నుంచి ఉన్నదే. కాంగ్రెస్ లో తెల్ల టోపీ ధారణ ఓ సంప్రదాయంగా మారింది. టోపీ ధారణకు రాజకీయాలకు సంబంధం ఏమీ లేకపోవచ్చు. మన దేశ వాతావరణ (ఎండ) పరిస్థితుల కారణంగానే తలపాగా నుంచి టోపీలు వచ్చి ఉండవచ్చు బహూశా! …. By–– ప్రహ్లాద్‌ అజ్ఞాతి.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions