పార్ధసారధి పోట్లూరి …….. ఉక్రెయిన్ కి యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం ఇవ్వడానికి యూరోపియన్ పార్లమెంట్ సూత్రప్రాయంగా అంగీకరించింది…! ఒక ప్రీ ప్లాన్డ్ డ్రామాని తాము అనుకున్నట్లుగా ఆడించి, ప్రేక్షకుల చేత బలవంతంగా చప్పట్లు కొట్టించుకున్నాయ్ అమెరికా , EU లు…. ఎప్పుడయితే రష్యా పూర్తి స్థాయి యుద్ధానికి తెర తీసిందో, వెంటనే తాము ముందే అనుకున్న వ్యూహం ప్రకారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలేన్ స్కీ చేత తమ స్క్రిప్ట్ ని చదివించాయి.
నిన్న యూరోపియన్ పార్లమెంట్ ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వోలోదోమిర్ జేలేన్ స్కీ దాదాపుగా 10 నిముషాలు ప్రసగించాడు. ముందు తమ దేశ పరిస్థితిని చాలా దయనీయమయిన గొంతుతో చెపుతూ ఉక్రెయిన్ పోరాడుతున్నది ఒక నియంతకి వ్యతిరేకంగా కానీ యూరోపియన్ యూనియన్ మాతో ఉందా ? అంటూ గద్గద స్వరంతో అడిగేసరికి EU పార్లమెంట్ సభ్యులు తమ కుర్చీల నుండి లేచి చప్పట్లతో అభినందించారు ! సూత్రప్రాయంగా ఉక్రెయిన్ కి EU సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు EU పార్లమెంట్ అంగీకరిస్తున్నట్లు తెలిపింది, విశేషం ఏమిటంటే అమెరికా, యూరోపు మీడియా ఈ మొత్తం డ్రామాని లైవ్ లో ప్రసారం చేసాయి !
ఇప్పుడేం జరగబోతున్నది ? అధికారికంగా యూరోపుతో పాటు అమెరికా తమ సైన్యాన్ని ఉక్రెయిన్ లో దించుతాయి. ఉన్న సమయం కొద్ది గంటలు మాత్రమే! ఈ లోపు రష్యా ఉక్రెయిన్ ని తన ఆధీనంలోకి తీసుకుందా సరే, లేకపోతే హోరా హోరీ పోరు తప్పదు. కాకపొతే ఉక్రెయిన్ పూర్తిగా నాశనం అవుతుంది ఈ పోరులో ! ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం… అమెరికన్ స్పెషల్ ఫోర్సు ఉక్రెయిన్ లో ఉంది. ఉక్రెయిన్ సైన్యాన్ని వెనుక ఉండి నడిపిస్తున్నది వీళ్ళే ! ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ లలో తమకి దొరికిన అనుభవంతో, దాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ లో అమలు చేస్తున్నారు. పదాతి దళం మీద ఆధిక్యం సంపాదించారు, అయితే ఇప్పటి వరకు రష్యా చాలా తక్కువ సైన్యంతో దాడులు చేస్తూ వచ్చింది, ఇక నిన్నటి నుండి పూర్తి స్థాయి యుద్ధానికి తెర తీసింది.
Ads
రాబోయే రెండు రోజులు చాలా కీలకం. ఇటు రష్యాకి కానీ అటు అమరికాకి కానీ ! రష్యా తన S-400 ఎయిర్ డిఫెన్స్ ని ఉక్రెయిన్ లో నెలకొల్పితే మాత్రం అది EU,అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కి కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఏ మాత్రం తేడా వచ్చినా పుతిన్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ని ప్రయోగిస్తాడు. ఇది చాలా ప్రమాదకరమయిన పరిస్థితి.
ఉక్రెయిన్ ని సమర్ధించేవారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే… వీళ్ళు ఏక ధ్రువ ప్రపంచానికి వత్తాసు పలుకుతున్నాము అని… ఇది చాలా ప్రమాదకరమయినది. ఇప్పటికే ప్రపంచం ఏం చేయాలో, ఎట్లా ఉండాలో శాసిస్తున్నది అమెరికా. ఇక రష్యా పోటీలో లేకపోతే మనం తినే తిండి దగ్గర నుండి మనం వాడే మందుల వరకు అమెరికా ఆధిపత్యం వహిస్తుంది. దీనికి EU వత్తాసు పలుకుతుంది. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల నుండి వీళ్ళకి కావాల్సిన ఉత్పత్తులు చౌకగా దిగుమతి చేసుకొని పబ్బం గడుపుతున్నారు. హానికర రసాయనాలు వెలువడే పరిశ్రమలు వాళ్ళ దేశాలలో స్థాపించరు. మనలాంటి దేశాలలో అవి పెట్టడానికి సహకరించి వాటిని చౌకగా కొంటున్నారు.
నేను రష్యా కి మద్దతుగా ఉంటున్నాను అనే వాళ్లకి నా సలహా ఏమిటంటే కారణాలు చాలా లోతుగా ఉంటాయి, వాటిని అర కొర జ్ఞానంతో తెలుసుకోలేరు. బయటికి కనపడుతున్న వాటిని చూసి రష్యాని శత్రువుగా భావించే వారు ఇప్పుడు ఉక్రెయిన్ కి యూరోపులో సభ్యత్యం ఇవ్వడం ఉన్న వెనకాల కుట్ర అర్ధం చేసుకుంటే సరి.
నాకు నా దేశం ముఖ్యం, తరువాతే ఏదయినా ! ముఖ్యంగా ఆయుధాల విషయంలో మనం గత 70 ఏళ్లుగా రష్యా మీద ఆధారపడుతున్నాం ! ఇప్పటికిప్పుడు మన ఆయుధాలని మార్చలేము కనుక రష్యాని సమర్థించాల్సిందే. పోనీ అమెరికా నుండి కొంటే ? వాటిని ఎక్కువ ధర పెట్టి కొన్నా వాటిని వాడాలంటే అమెరికా అనుమతి కావాలి ! ఇది అవసరమా ?
2028 వరకు మనం రష్యాకి వివిధ స్పేర్ పార్టుల కోసం ఆర్డర్ ఇచ్చి ఉన్నాం. ఇప్పుడు రష్యా నష్టపోతే మనం కూడా దాదాపుగా 58 బిలియన్ డాలర్లు నష్టపోతాం ! అంతేనా ? స్పేర్ పార్టులు లేని ఆయుధాలని మనం వాడలేము. కాలం గడిచే కొద్దీ అవి పనికి రాకుండా పోతాయి. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మనం 50% శక్తితో పోరాడాలి !
ఇలా చెప్పుకుంటూ పొతే ఒక పుస్తకం వ్రాసే అంత ఉంటుంది. కానీ ఇదంతా ఎవరు చేసారు ? గత పాలకులు విచక్షణరహితంగా కమీషన్లకి ఆశపడి ఒకదాని తరువాత ఇంకోటి కొంటూ పోయారు. వాటిని ఇష్టం ఉన్నా లేకపోయినా మనం వాడాల్సిందే, అలాగే వాటి నిర్వహణ కోసం స్పేర్ పార్టులు రష్యా నుండి రావాల్సిందే !
2030 నాటికి అంటే… మరో 8 ఏళ్ళకి మనం మన స్వంత యుద్ధ విమానాలని పూర్తి స్థాయిలోకి తెచ్చుకుంటాము. తేజస్ mK2, AMCA లు వచ్చిన తరువాతే మనం రష్యన్ యుద్ధ విమానాలని పక్కన పెట్టగలం. నేను రెండేళ్ళ క్రితమే Su-30 MKI విమానాల మీద సమగ్రంగా పోస్ట్ పెట్టాను. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లారీ చాసిస్ లు కొన్నట్లు 450 Su-30 MKI లు రష్యా నుండి కొన్నది. వాటికి మళ్ళీ ఇజ్రాయెల్, ఫ్రాన్స్ ల నుండి ఎవియానిక్స్, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ లు కొని, బిగించిన తరువాతే అవి ఇప్పుడున్న స్థితిలో ఉన్నాయి. అంటే ఒక్కో విమానం ఖరీదు వాటికి అమర్చిన ఇతర పరికరాల ఖరీదుని కలిపితే రెట్టింపు ఖర్చు అయ్యింది.
మనకి నిజమయిన మిత్రుడు ఫ్రాన్స్ మాత్రమే ! ఇజ్రాయెల్ కానీ, రష్యా కానీ అవసరాల కోసమే మనతో బాగుంటాయి కానీ ఫ్రాన్స్ కి మనతో ఎలాంటి అవసరం లేదు. అయినా మనకి బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తున్నది అన్నది గుర్తు పెట్టుకోండి. మనకి మన దేశ ప్రయోజనాలే ముఖ్యం ! అనవసరంగా జాలి చూపెడితే మనకే నష్టం ! ముందు మనం బాగున్న తరువాతే ఎవరి మీద అయిన జాలి చూపెడదాం !
Share this Article