రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఇంకా కాంగ్రెస్ గూటిలోనే ఉన్న గులాం నబీ ఆజాద్‌ను నిలబెట్టబోతోంది… ఇదీ వార్త..! ఒకవేళ ఈ వార్త నిజమే అయితే మాత్రం బీజేపీది రాజకీయంగా తెలివైన అడుగు అవుతుంది… కాకపోతే ఈ వార్త ఆంధ్రజ్యోతిలో రావడంతో ఎవరూ పెద్దగా నమ్మడం లేదు గానీ… ఒకవేళ మోడీ మనస్సులో ఈ ఆలోచన ఉండటం వాస్తవమైతే అది బహుముఖంగా బీజేపీకి మేలు… అప్పట్లో ఎన్‌డీఏ కలాంను రాష్ట్రపతిని చేసిన తీరుతో పూర్తిగా పోల్చలేమేమో గానీ, ఇప్పటి స్థితిలో సరైన నిర్ణయమే అవుతుంది…
72 ఏళ్ల ఆజాద్ మొదటి నుంచీ గాంధీ కుటుంబానికి విధేయుడే… కానీ చాలామంది పార్టీ సీనియర్లలో ఉన్నట్టుగానే రాహుల్ నాయకత్వం మీద అసంతృప్తి, అసహనం ఉన్నయ్… అందుకే అంతర్గతంగా తిరగబడుతున్న జీ-23 నాయకుల్లో ఆజాద్ ప్రముఖుడు… అధికారికంగా ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్న పెద్ద లీడర్‌ను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా బీజేపీ గనుక ప్రతిపాదిస్తే, కాంగ్రెస్ కక్కలేదు, మింగలేదు… తను మైనారిటీ… ఇతర విపక్షాల మీద మోడీ చాణక్యాస్త్రాన్ని ప్రయోగించినట్టే…
పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్యనేతల్లాగా ఆజాద్ ఎప్పుడూ ఉగ్రవాద మద్దతు వ్యాఖ్యలు చేసేవాడు కాదు, జాగ్రత్తగా మాట్లాడతాడు… కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్, మాజీ కేంద్ర మంత్రి, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఈ దేశ రాజకీయాల తీరు మీద సంపూర్ణ అవగాహన ఉంది… అంటే ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడు కాదు… ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా కూడా వ్యవహరించాడు కొన్నాళ్లు… తను ఎప్పుడూ ఛాందసవాద ధోరణులతో కూడా లేడు… లిబరల్…
Ads
ఓసారి చెప్పినట్టు గుర్తు… కశ్మీరీలోని అనేకమంది బ్రాహ్మణులు, గుజ్జార్లు అప్పట్లో ముస్లిం మతంలోకి మారారనీ,, మేమూ అలా మారిన ఒకప్పటి పండిట్లమే అని చెప్పుకున్నాడని… లండన్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన ఆయన ఇద్దరు పిల్లలు సోఫియా, సద్దాం కూడా గ్లోబల్ విలేజీ అనే కాన్సెప్టులో పెరిగినవాళ్లే… తనది కశ్మీరీ సింగర్ షమీమ్‌తో ప్రేమవివాహం… కొడుక్కి కూడా హైదరాబాదీ అమ్మాయితో పెళ్లి జరిగింది… ఆజాద్ మన హైదరాబాదీ చుట్టమే అన్నమాట…
మోడీకి ఆజాద్ నడుమ చాన్నాళ్లుగా దోస్తీ ఉంది… ఈ కారణంతోపాటు కాంగ్రెస్‌ను కాస్త గిచ్చడానికి ఆజాద్‌కు పద్మభూషణ్ కూడా ఇచ్చాడు ఆమధ్య మోడీ… తమపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను తగ్గించుకోవడానికి, ప్రత్యేకించి కాశ్మీర్ ప్రజల్లో ఉన్న కోపాన్ని తగ్గించడానికి ఈ ఆజాద్ ఎంపిక బీజేపీకి కొంతైనా ఉపయోగపడొచ్చు కూడా… ఒకవేళ ఆజాద్‌ను గనుక బీజేపీ ‘అందరివాడు’ పేరిట నిలబెడితే, విధిలేక కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తే, ఇక మిగతా చిన్న చిన్న రాజకీయ పక్షాల నిర్ణయాలు, రాజకీయాలు పెద్దగా పరిగణనలోకి రావు… ప్రత్యేకించి శరద్ పవార్‌ను నిలబెట్టి, బీజేపీని చికాకు పెట్టాలనుకునే ‘ప్రత్యామ్నాయ వ్యూహాలు’ కొట్టుకుపోతాయి…!
Share this Article