మిగతా వార్తల్ని వదిలేయండి కాసేపు… వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే అవి ఉరితాళ్లు అవుతాయట… చంద్రబాబు చెబుతున్నాడు… దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ విషయం చెప్పినా సరే, అది వేరు… చంద్రబాబు చెబితే అంతకుమించిన దరిద్రం మరొకటి లేదు… నిజం… కేంద్రంలో చక్రాలు తిప్పానని, సంస్కరణలకు ఆద్యుడిననీ, ఆధునిక భారత్‌కు ఆదిపురుషుడిననీ ఏవేవో చెప్పుకుంటాడు కదా… ఇప్పుడేం చెబుతున్నాడు..?
రైతులకు ఉరితాళ్లు, గతంలో వ్యవసాయ విద్యుత్తుపై రైతుల్ని ఆదుకున్నది తనేననీ చెబుతున్నాడు… ఒక రాజకీయ నాయకుడికి ఒక అంశంపై ఓ నిర్ణీత ధోరణి ఉండాలి… ఓ దృక్పథం ఉండాలి… నేనిక్కడ మోటార్లకు మీటర్లు అవసరమా కాదా విశ్లేషించడం లేదు… కానీ కొత్త విద్యుత్తు చట్టానికి దారులు వేసింది తనే… ఆ చట్టమే చెబుతోంది వ్యవసాయ విద్యుత్తుకు పక్కాగా లెక్కలు అవసరమని… అంటే, అది ఉచిత విద్యుత్తును కత్తిరించమని కాదు, రైతులకు ఇచ్చే కరెంటు వ్యయాన్ని ప్రభుత్వం సరిగ్గా భరించాలని చెప్పడం, అది లెక్కప్రకారం ఉండాలని చెప్పడం…
ప్రతి కరెంటు చౌర్యాన్ని రైతులు ఖాతాల్లో వేయకుండా… నిజంగా రైతులు వాడుకునే కరెంటు ఖర్చును ప్రభుత్వం సబ్సిడీగా భరించాలని చెప్పడం… దాన్ని ప్రమోట్ చేసిందే చంద్రబాబు… వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లు అనేదే ఓ దుర్మార్గం… 9 గంటల నుంచి 7 గంటలకు కుదించిందీ తనే… ట్రాన్స్‌ఫార్మర్ల వారీగా, ఫీడర్ల వారీగా రైతు కరెంటును లెక్కించిందీ ఆయనే… 7 గంటలు కాగానే వ్యవసాయ కరెంటు ఆగిపోయేలా ప్రత్యేక పరికరాలు బిగించిందీ ఆయనే…
Ads
అంతేనా..? చౌర్యం పేరిట వేల మంది రైతులు మీద దొంగలని ముద్రవేసి జైళ్లకు పంపించిందీ తనే… కోటానుకోట్ల బకాయిల్ని చూపి, కనెక్షన్లను పీకిపారేసిందీ తనే… ఉచిత కరెంటు అనగానే తీగెల మీద బట్టలు ఆరేసుకోవాలని వెక్కిరించిందీ తనే… అంతా ప్రపంచబ్యాంకు ఆంక్షల పుణ్యం… అలాంటి వ్యక్తి ఇప్పుడు మీటర్లు ఉరితాళ్లు అంటున్నాడు… విద్యుత్తు బోర్డును ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కములని చీల్చిందీ తనే… ట్రాన్స్‌ఫార్మర్లవారీగా ఫ్రాంచైజీ పద్ధతికి తెరతీసిందే తను…
నో, నో, ఒపీనియన్స్ మార్చుకోకపోతే పొలిటిషియన్ ఎలా అవుతాడు, చంద్రబాబు కూడా మారాడేమో అనకండి… రాజకీయ అవసరాల కోసం యూటర్నులు తీసుకునేవాడు అసలు నిజమైన రాజకీయవేత్త కానేకాడు… నీ విధానాలను జనం అప్పట్లో సంపూర్ణంగా తిరస్కరించారు… ఐనాసరే, నువ్వు వెళ్తున్న బాట కరెక్టే అనుకునేపక్షంలో దానికి కట్టుబడి ఉండాలి, లేదా నిశ్శబ్దంగా ఉండాలి… అంతేతప్ప… నేను రాంగ్, అప్పట్లో బురదలో పొర్లాను, ఇప్పుడు కళ్లు తెరుచుకున్నయ్, లెంపలేసుకుంటున్నాను అన్నట్టుగా అంటే… ఓ రాజకీయవేత్తగా నీ ఆలోచన విధానంలోనే తప్పు ఉన్నట్టు లెక్క… ఈరోజు మీటర్లు ఉరితాళ్లు అంటున్న గొంతు రేపు కుర్చీ ఒకవేళ ఎక్కితే, వెంటనే మరో యూటర్న్ తీసుకుని, మీటర్లు పెట్టడమే రైట్ అంటే..!! అప్పుడు దాన్నేమనాలి..? చంద్రబాబు అలా అనకూడదని ఏముంది..?!
Share this Article