ఈమధ్య కోర్టుల్లో వచ్చే పలు తీర్పులు భిన్న చర్చలకు తావిస్తున్నయ్… అలాంటిదే ఈ కేసు కూడా… కేరళ… ఓ భర్త ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాడు… నా భార్య మానసిక రుగ్మతతో బాధపడుతోంది, చికిత్స చేయించుకొమ్మంటే ఒప్పుకోవడం లేదు, సో, మాకు విడాకులు ఇచ్చేయండి అనేది కేసు… నాకు ఎలాంటి రోగమూ లేదు, నా పిల్లల్ని చూసుకుంటున్నాను, నర్సుగా కొలువు చేస్తున్నాను, ఇరుగూపొరుగూ సహా అందరితో బాగానే ఉంటున్నాను, నాకెందుకు చికిత్స, నాకు మానసిక రుగ్మత ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ భర్త, తన బంధువులు వేధిస్తున్నారని భార్య వాదన…
ఇంట్రస్టింగు కదా… సాధారణంగా ఫ్యామిలీ కోర్టులు మహిళల కోణానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటయ్… ఇక్కడ ఏం జరిగిందంటూ విడాకులు మంజూరు అయిపోయాయ్… దానికి ఆధారంగా భర్త వాదనను తీసుకుంది… విడాకుల చట్టంలోని క్రూరత్వ నిబంధన… 1869 నాటి ఈ చట్టంలోని అంశాల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ లుక్కేయాల్సి ఉందేమో… భార్య తన మానసిక రుగ్మతకు చికిత్స చేయించుకోకపోవడాన్ని క్రూరత్వంగా పరిగణించవచ్చా..? అనేదే పెద్ద ప్రశ్న… ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది…
దీంతో ఆ భార్య హైకోర్టుకు వెళ్లింది… ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్నే హైకోర్టు కూడా మొన్నటి అక్టోబరులో బలపరిచింది… ఆమె కేసును అక్కడే వదిలేయలేదు… సుప్రీం కోర్టు తలుపుతట్టింది… తాజాగా సుప్రీం ధర్మాసనం ఆ కేసును విచారణకు స్వీకరించింది… సదరు చట్టంలోని క్రూరత్వం నిబంధనను పరిశీలించాల్సిందేనని అంగీకరించింది…
Ads
ఇది చదువుతుంటే 2013 నాటి ఓ కేసు గుర్తొచ్చింది… మహారాష్ట్రకు సంబంధించిన కేసు… ఫ్యామిలీ కోర్టులో ఓ భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు… నా భార్య సరిగ్గా పళ్లు తోముకోదు, సరిగ్గా స్నానం చేయదు, దాంతో ఆమె దేహం నుంచి దుర్వాసన, చర్మసమస్యలు… ఇది నాకు మెంటల్ టార్చర్ అయిపోయింది, స్ట్రెస్ పెరుగుతోంది, నేను కాపురం చేయలేను, విడాకులు కావాలి… ఇదీ కేసు… ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది… అదే కేసులో మరో రెండు అంశాలున్నయ్… పెళ్లికి ముందు తన భార్య విద్యార్హతల్ని తప్పుగా చెప్పారనీ, వాళ్లు చెప్పినట్టుగా ఆమెకు ఇంగ్లిష్ సరిగ్గా రాదనీ ఫిర్యాదు…
మళ్లీ కేరళ కేసుకొస్తే… నిజంగా ఆమె మానసిక రుగ్మతతో బాధపడుతోందా..? ఆమె కాదంటోంది… ఇది ఒక పాయింట్… భార్య మానసిక రుగ్మత, చికిత్సకు మొరాయింపు అనేది నిజంగా క్రూరత్వం కిందకు వస్తుందా..? ఇది రెండో పాయింట్… సరిగ్గా ఇలాంటిదే మరో కేసు… మానసిక రుగ్మతకు చికిత్స తీసుకోకపోవడం… ఆ కేసులోనూ ఇదే హైకోర్టు ఇదే ధోరణితో విడాకులను సమర్థించింది… సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలిక..! చట్టాన్ని కాసేపు వదిలేయండి… ఇక్కడ భర్త తన నైతిక బాధ్యతగా, వైవాహిక జీవన కర్తవ్యం కోణంలో ఏం చేసి ఉండాలి..? ఆలోచించండి…!!
Share this Article