ఈ వార్త చదివి మూడునాలుగు రోజులవుతున్నట్టుంది… సీపీఎం పత్రిక ప్రజాశక్తిలో వచ్చింది… మెయిన్ పేజీలోనే కనిపించింది… నో డౌట్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అనగా ఐద్వా అనగా ఆ పార్టీ అనుబంధ సంఘం మహిళల సమస్యలపై పోరాడుతుంది, ఆ స్పిరిట్ కనిపిస్తుంది… అది వోకే… కానీ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ కేసు పెట్టింది… ఎవరి మీద..? స్వాతి వారపత్రిక మీద..!! ఏమని..? మహిళల అసభ్య చిత్రాలను, పంచరంగుల బ్లోఅప్ ఫోటోలను, లైంగిక సంబంధ కథలను, నీతిబాహ్య సంబంధాలు, ప్రశ్నోత్తరాలను ప్రచురిస్తున్నారని ఫిర్యాదు..!!
ఇవి ప్రధానంగా 13 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న టీనేజర్లను పెడదోవ పట్టిస్తాయట… సదరు పత్రిక యజమానితోపాటు అలాంటి వివాదాస్పద శీర్షికల రచయితలను కూడా నిందితులుగా చేర్చారట… సరే, ఆ క్రిమినల్ కేసు మీద పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియాలి… అసలు స్వాతి మీద కేసెందుకు పెట్టారో, అసలు లోగుట్టు ఏమిటో ఐద్వా నేతలకే తెలియాలి… అంటే, స్వాతి పత్రిక శుద్ధపూస అని కాదు… దానిపై కేసు పెట్టకూడదనేంత పత్తిత్తు ఏమీ కాదు అది… అయితే..?
పోరాటం ఎప్పుడూ చిన్న చిన్న చిల్లర అంశాలపై కేంద్రీకరిస్తే… పెద్ద సమస్యలపై పోరాటం బలహీనమవుతుంది… పోరాటాలు చేసేవాళ్లు పెద్ద భూతాల్ని టార్గెట్ చేయాలి… ఆఫ్టరాల్ స్వాతి… అదొక టార్గెటా..? ఈమధ్య తనేం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని సీపీఐ నారాయణ కూడా కాస్త నయం, బిగ్‌బాస్ వంటి లక్షల మంది చూసే ఓ రియాలిటీ షోను బ్రోతల్ హౌజ్ అని విమర్శిస్తున్నాడు… నిజానికి ఆ విమర్శ కూడా అనవసర ప్రయాస… దాన్నే టార్గెట్ చేయడం వెనుక ఏముందో మనకు తెలియదు… అది వదిలేద్దాం…
Ads
స్వాతిలో సరసమైన కథలు ఇప్పుడు కొత్త కాదు… అదేమీ బూతు పత్రిక కాదు… దానికి అంత సీనూ లేదు… లైంగిక సంబంధ ప్రశ్నోత్తరాల్ని సమరం ఏనాడో స్టార్ట్ చేశాడు, ఈనాడులో కూడా వచ్చేవి అప్పట్లో… నీతిబాహ్య సంబంధాలు, అసభ్య చిత్రాలు వంటి అంశాలకు వెళ్తే… ఈటీవీ జబర్దస్త్ దగ్గర నుంచి… తెలుగు సినిమాల దాకా… మొత్తం అశ్లీలం, అసభ్యమే కదా… అంతెందుకు..? ఒక్కసారి ఓటీటీల్లో వెబ్ సీరీస్‌లకు వెళ్లి చూడండి… అరాచకం… అసలు సెన్సార్ లేదు, అడ్డు లేదు, అదుపు లేదు… నీచాభిరుచితో ఎన్నెన్ని విశృంఖల సీన్లో కదా…
రిలయెన్స్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చాక, మొబైల్ పిల్లల చేతుల్లోకి వచ్చాక నెట్‌లో ఏదంటే అది చూసేస్తున్నారు పిల్లలు… మన చుట్టూ ప్రస్తుతం ఆమ్లజనికన్నా అశ్లీలమే ఎక్కువ వ్యాపించి ఉంది… ఈ కాలుష్య తీవ్రతలో స్వాతి అనేది జస్ట్, నథింగ్… మరి ఇలాంటి పోరాటాలతో ఏం సాధించాలని..? మహిళలకు ఇంకా ఏ సమస్యలూ లేవా..? దిశ చట్టం దగ్గర నుంచి పోక్సో చట్టంలో అవసరమైన మార్పుల దాకా… లైంగిక వేధింపుల నుంచి అత్యాచారాల దాకా… గృహహింస నుంచి కట్నపుహత్యల దాకా… సమానవేతనాల నుంచి లింగవివక్ష దాకా… ఎటుచూసినా స్త్రీ చుట్టూ అవస్థలే కదా..! మరి ఆఫ్టరాల్ ఆ స్వాతే పోరాటలక్ష్యం ఎలా అయ్యింది..? అందుకే ఆ వార్త ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది…!!
Share this Article