ప్చ్… ఉక్రెయిన్, యూపీ ఎన్నికల గొడవల్లో మునిగిపోయి… ఓ సీరియస్ సరదా వార్త మిస్సయిపోయారు చాలామంది… వాణివిశ్వనాథ్ తెలుసు కదా… సినిమా నటి… ఆమె పేరు వినగానే అప్పట్లో చిరంజీవితో రెచ్చిపోయి చేసిన ఓ వానపాట గుర్తొస్తుంది… సామ్రాట్ అశోకలో ఎన్టీయార్ భార్యగా కూడా చేసినట్టుంది… ఆమె ఈమధ్య నగరికి వచ్చింది… అదేనండీ జబర్దస్త్ రోజా నియోజకవర్గ కేంద్రం… అందులో ఒకటో వార్డు… శామాలమ్మ గుడికి వెళ్లింది వాణి… మొక్కులు తీర్చుకుంది, కొందరు జనం ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలికారు…
ఏం మొక్కు అంటే..? ఎలాగైనా ఈసారి నగరిలో ఎమ్మెల్యేగా పోటీచేయాలి… అంతే… ఆ సంకల్పంతో మొదట నగరి ఒకటో వార్డు శామాలమ్మ పూజలతో తన ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది… రోజాపై పోటీచేయడం తప్పనిసరి అట… అయితే ఏ పార్టీ నుంచి చేయాలనేది తరువాత నిర్ణయం తీసుకుంటుందట… సరే, బాగుంది, ఎవరైనా పోటీచేయొచ్చు… పైగా రోజా వర్సెస్ వాణివిశ్వనాథ్ అంటే… ఆ పోటీ మజాయే వేరు ఉంటుంది…
అవునుగానీ, నగరిలోనే పోటీ ఎందుకు..? ఈ ప్రజలపైనే అంత ప్రేమ ఏల..? అనడిగితే… కొన్ని వింతకారణాలు చెప్పింది… చదువుతుంటే నవ్వొచ్చింది… చాలామంది సినిమా సెలబ్రిటీల్లాగే ఈమె కూడా తామేం మాట్లాడుతున్నారో తమకే సమజ్ గాని ఓ రకమైన మానసిక స్థితిలోకి వెళ్లిపోతున్నదా అనిపించేలా… రామానుజం చలపతికి రాజకీయంగా అన్యాయం జరిగింది, సహించలేకపోతున్నాను, అందుకే ఎన్నికల బరిలోకి దిగుతాను అంటోంది…
Ads
అసలు ఆ చలపతి ఎవరు..? ఏమన్యాయం జరిగింది..? జరిగితే ఈమె ఎన్నికల బరిలోకి దిగడం దేనికి..? విషయం ఏమిటట అంటే..? ఈమెకు రామానుజం చలపతి అనే వ్యక్తి మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడట… ఆయన నగరిలోని ఒకటోవార్డు నాయకుడట… టీడీపీ… చంద్రబాబుకు, లోకేష్‌బాబుకు వీరాభిమాని… కానీ అదో తరహా… అక్కడ టీడీపీ ఇన్చార్జి గాలి భానుప్రకాష్ మీద ఎడాపెడా వాట్సప్ మెసేజులు పెడుతూ చెవిలో జోరీగ మాదిరి తయారయ్యాడు… దాంతో పార్టీ ఈ చలపతిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది…
అక్కడ భాను టీడీపీకి నమ్మకస్తుడు… మొన్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బాగా వర్క్ చేశాడు… వచ్చే ఎన్నికల్లో తనే నగరి అభ్యర్థి… పైగా ఇన్చార్జి… తన మీద వెక్కిరింపులతో కార్యకర్తల్లో ప్రచారం చేస్తుంటే ఎలా సహించగలడు..? సో, సస్పెన్షన్ దెబ్బపడింది… చలపతి ఇంకా రెచ్చిపోతున్నాడుట… ఆ చలపతికి అన్యాయం జరిగిందని ఈ వాణీవిశ్వనాథ్ ఎన్నికల బరిలో దిగి ఒక్కొక్కరికి పాఠం చెబుతుందన్నమాట…
సరేగానీ, రాజకీయాల్లో పాతుకుపోయిన వాళ్లే దిక్కులు చూస్తుంటే, నీకెవరు వోట్లేస్తారు అనడిగాం అనుకొండి… ‘‘మా అమ్మమ్మ నగరిలో నర్సుగా పనిచేసింది… ఇక్కడ అంతా తమిళ సంస్కృతే ఎక్కువ, పైగా నాకు వేలాది మంది అభిమానులున్నారు… అవసరమైతే ఇండిపెండెంటుగా పోటీ చేస్తాను’’ అంటోంది… ఓహ్, అమ్మమ్మ అప్పుడెప్పుడో పూర్వకాలంలో నర్సుగా చేసింది కాబట్టి, తమిళ సంస్కృతి ఎక్కువ కాబట్టి ఈమెకు వోట్లేస్తారట… బాగుంది యవ్వారం…
నిజానికి ఈమె ఆమధ్య ఓ తెలుగు సినిమాలో నటించినప్పుడు, విలేకరులు ఏదో అడిగితే… ఒకవేళ టీడీపీ నుంచి చాన్స్ వస్తే రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పింది… అంటే ఓ సంకేతం పంపించిందన్నమాట… చంద్రబాబు వోకే అని ఉంటే మొన్నటి ఎన్నికల్లోనే రోజాతో పోటీకి సై అని, నిలబడి ఉండేది… ఈమె పోటీ సరే, మరి ప్రత్యర్థి రోజా పరిస్థితి ఏమిటట..?
అక్కడ రోజాకు రాజకీయ పరిస్థితులు ఏమీ బాగా లేవు… ఆమెకు బోలెడుమంది అసమ్మతి నేతలు… శ్రీశైలం ట్రస్ట్ బోర్డు అధ్యక్ష పదవి, కార్పొరేషన్ పదవులు సహా వాళ్లకు మంచి పదవులు కట్టబెడుతూ జగన్ రోజా ప్రాధాన్యానికి కత్తెర వేస్తున్నాడు… చివరకు చెవిరెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు కొత్త జిల్లాలకు సంబంధించి తమ నియోజకవర్గాలను తాము కోరుకున్న జిల్లాల్లో చేర్పించుకుని నోటీఫికేషన్లు వేయించుకోగా… రోజా జిల్లా మార్పు కోరికను పట్టించుకున్నవారే లేకుండా పోయారు… ఈమె కేరాఫ్ హైదరాబాద్, ఆమె కేరాఫ్ చెన్నై… వోట్ల వేళకు వెళ్లి పోటీపడతారట… సూపర్.., రెడీ అయిపొండమ్మా..!!
Share this Article