స్ట్రెయిట్ కామెంట్… డిస్‌క్లెయిమర్… ప్రతి టీవీ సీరియల్ ఓ చెత్త… కానీ ఎక్కువ వీక్షణలు దక్కేవి టీవీ సీరియళ్లకే… కారణం :: నాసిరకం సినిమాలు, వేరే వినోదం లేకపోవడం, టీవీ సీరియల్ అందుబాటులో ఉన్న ఏకైక వినోదం కావడం… వాటి గురించి చెబుతూ పోతే ఒడవదు, తెగదు… కానీ ఒక సీరియల్ గురించి నెట్లో ఈ రేంజ్ చర్చ జరగడం తొలిసారి… అదే కార్తీకదీపం సీరియల్ ముగింపు గురించి..!
యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లయితే కథనాలు కుమ్మేస్తున్నయ్… రకరకాల కొత్త ఊహాగానాలకు పదును పెడుతున్నయ్… సహజమే… ఎందుకంటే..? నాలుగైదేళ్లుగా ఎప్పుడూ రేటింగ్స్‌లో కార్తీకదీపమే టాప్… చివరకు స్టార్ హీరోల కొత్త సినిమాల రేటింగ్స్ కూడా ఈ సీరియల్‌ను అందుకోలేకపోయిన తీరు చూశాం… సీరియల్ బలం ప్రధానంగా ప్రేమీ విశ్వనాథ్… ప్లజెంట్ అప్పియరెన్స్… దాదాపుగా ప్రతి తెలుగు ఇంటికీ కనెక్టయిన నటి…
యాక్సిడెంట్ జరిగింది… కార్తీక్, దీప, హిమ ఫోటోలకు దండలు వేశారు… ఇంకేముంది..? అయిపోయింది అని అందరూ తెగ రాసేస్తున్నారు… సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు… కానీ నెవ్వర్… విపరీతమైన ఆదాయం, యాడ్స్, రేటింగ్స్ ఉన్న ఓ సీరియల్‌ను ఎవడూ అర్థంతరంగా ఆపేయడు… వాళ్లేమైనా పిచ్చోళ్లా..? కార్తీకదీపం ఆగిపోదు… అదీ గ్యారంటీ… అఫ్కోర్స్, పిచ్చి పిచ్చి పాత్రల్ని తీసుకొచ్చి, అడ్డమైన ట్విస్టులతో కథను ఎడాపెడా ఇష్టారాజ్యంగా నడిపిస్తున్న తీరుతో ఈమధ్య రేటింగ్స్ తగ్గినయ్…
Ads
నిజం చెప్పాలంటే… సీరియల్ మీద అసంతృప్తి స్టార్టయింది… అది ఇంకా పెరగకముందే దర్శకనిర్మాతలు మళ్లీ ఓ ఎత్తుగడ వేశారు… ఎలాగూ దీని మాతృక మలయాళ సీరియల్ కథ నుంచి ఎప్పుడో దూరం వచ్చేశారు… సో, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే… ఇప్పుడున్న జనరేషన్‌కు ముగింపు పలుకుతారు… పలికారు… అంటే… కార్తీక్ తండ్రి, దీప తండ్రి, హిమ, మోనిత, కార్తీక్, దీప ఎట్సెట్రా పాత్రలు ఉండవ్… నేరుగా కొత్త జనరేషన్‌కు తీసుకుపోతారు…
ఇదే సౌందర్య పాత్ర కంటిన్యూ అవుతుంది… ఇక పాపులారిటీని బట్టి, అవసరాన్ని బట్టి, కథను తమకు ఇష్టమొచ్చినట్టు మారుస్తారు… ఏమో, చెప్పలేం… ప్రేమి లేని కార్తీకదీపం ఏమిట్రా అని గనుక ట్రోలింగ్ జరిగితే… హిమ బతికినట్టు చూపించి, ప్రేమిని మళ్లీ ప్రవేశపెట్టొచ్చు కూడా… సౌర్య, హిమల నడుమ వైరాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు కూడా… వాళ్ల దయ, ప్రేక్షకుడి ప్రాప్తం… సో, కార్తీకదీపం అప్పుడే అయిపోలేదు… అయిపోదు…
అసలు ఇంకా 1000 ఎపిసోడ్లే కదా… ఇంకా చాలాదూరం తీసుకెళ్తారు… ప్రేక్షకుడు ఇక తెగ విసిగిపోయి, ఆపండ్రోయ్ అని బ్రహ్మానందం రేంజులో ట్రోల్ అరుపులకు దిగితే, మెల్లిగా రేటింగ్స్ పడిపోయేదాకా సీరియల్ మాత్రం ఆగదు… ఆపరు… కానీ ఏమాటకామాట… సీరియల్లో ప్రేమికి దీటైన పాత్ర శోభాశెట్టి… అనగా దీప వర్సెస్ మోనిత… ఆమె పాత్ర చిత్రణ సరిగ్గా లేకపోవడం దర్శకుడి పైత్యం, కానీ ఆమె మాత్రం భలే నటించింది… నిజం చెప్పాలంటే పలుసార్లు ప్రేమిని డామినేట్ చేసింది… ఆమె మాత్రం సీరియల్లో ఇక కనిపించదు… అది క్లియర్… మరి ప్రేమి, నిరుపమ్… ఏమో, వాళ్లూ కొత్త రూపాలతో వస్తారేమో… చెప్పలేం..!!
Share this Article