హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు ఓ చరిత్ర ఉంది… నిష్ణాతులైన హైదరాబాదీ పాత్రికేయులెందరికో అది సాయంకాలం ఆటవిడుపు అడ్డా… స్వల్ప రుసుముతో ప్రజాసంఘాలు, బాధితులు ప్రెస్‌మీట్లు పెట్టుకోగలిగిన వేదిక… తొలిసారి దాని ఇజ్జత్ పోయింది… తెల్లారిలేస్తే ఎన్నికల అక్రమాల మీద మాట్లాడి, అందరినీ ప్రశ్నించి, నిలదీసి, నీతులు చెప్పే పాత్రికేయులు ఇప్పుడు సిగ్గుతో తలదించుకునే దురవస్థ.,. ఎందుకు..?
మునుపెన్నడూ లేనట్టుగా అక్రమాలు… స్వస్తిక్ గుర్తుకు తోడుగా ఇంకేవో గుర్తులు… ఇంటూ మార్కులు… ఐనా అన్నీ కౌంట్ చేశారు… అర్ధరాత్రి దాకా సాగింది వోట్ల లెక్కింపు… అసలు ఈసారి ప్రెస్‌క్లబ్ ఎన్నికలే సాధారణ రాజకీయ పార్టీలు పాల్గొనే ఎన్నికల్లాగా డబ్బులు, ప్రలోభాలు, మందు, పార్టీలతో భ్రష్టుపట్టిపోయాయి… జస్ట్, 1200- 1300 సభ్యులున్న ఓ క్లబ్ ఎన్నికలకు లక్షల రూపాయల ఖర్చు… ఎవరు భరించారు..? ఎందుకు..? ఏం వస్తుందని..? ఇవి కొన్ని ప్రశ్నలు…
ఇక ఈ అక్రమాల మాటేమిటి..? ఇన్నాళ్లూ బయట ఎన్నికల్లో కనిపించిన రిగ్గింగ్ ఇక్కడ కూడా… ఇష్టారాజ్యంగా వేర్వేరు ఎన్నికల గుర్తులతో బ్యాలెట్ల మీద గుద్దేయడం ఏమిటి..? అవి లెక్కింపునకు రావడం ఏమిటి..? అసలు ఎన్నికల నిర్వహణకు వచ్చిన సిబ్బంది శీలం కూడా నిగ్గుదేలాల్సిన దుస్థితి… చివరకు బ్యాలెట్ డబ్బాల్లో నీళ్లు పోశారు… ఆల్‌రెడీ లెక్కించినట్టు చెబుతున్న బ్యాలెట్ల మీద గుర్తులు కూడా కొన్ని చెరిగిపోయాయట… కావాలనే ఆ సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా చేశారా..? అభ్యర్థులకు పడిన వోట్లకూ, పోలైన వోట్లకూ ట్యాలీ కుదరడం లేదట…
Ads
మరో ఘోరం ఏమిటంటే… ఓ పత్రిక ఎవరికి తమ సిబ్బంది వోట్లేశారో పెద్దలకు ఫోటో ఆధారం వోటేసిన వెంటనే తమకు పంపించాలని చెప్పిందట… ఆహా, ఎంత గోప్యత..? గోప్యత మీద ఎంత నిజాయితీ..? అసలు సాయంత్రం 3 నుంచి 4 గంటల నడుమ ఒకసారి 300 వోట్లు పోల్ కావడం నిజమేనా..?
ఎస్, క్లబ్ తన ఇజ్జత్ పోగొట్టుకుంది… ఇప్పటి పరిస్థితి ఏమిటంటే..? రిటర్నింగ్ అధికారి ఫలితాల్ని హోల్డ్‌లో పెట్టాడు… తెల్లవారుజామున మూడు గంటలకు ఓ నోటీస్ అతికించేశాడు… బ్యాలెట్ పేపర్లు, డబ్బాలతో సహా పోలీసులకు స్వాధీనం చేశాడు… అంటే ప్రస్తుతం గెలిచినట్టు భావిస్తున్న వాళ్లు ఇంకా అధికారికంగా గెలిచినట్టు కాదు ఇప్పటికైతే…ఇద్దరు అభ్యర్థులు ఆల్‌రెడీ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు… ఓసారి చదవండి…
దర్యాప్తు చేస్తారట, అవసరమైతే తిరిగి పోలింగ్ నిర్వహిస్తారట… ఒక మిత్రుడు ఈసీ మెంబర్‌గా నిలబడ్డాడు… కౌంటింగ్ సందర్భంగా దిగ్భ్రాంతికి గురయ్యాడు… మూడేళ్లు ఓ టీవీ చానెల్‌లో పనిచేసి, వృత్తినే వదిలేసిన ఓ అభ్యర్థికి యాభైకి యాభై చొప్పున వోట్లు రావడం ఏమిటో బుర్రకెక్కలేదు తనకు… ఏదో అభ్యంతరం చెప్పబోతే మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, రీకౌంటింగ్ అడగండి అవసరమైతే… అని దబాయించారు సదరు కౌంటింగ్ సిబ్బంది…
అంటే… ఏదో గోల్‌మాల్ జరిగింది… ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? ఎలా చేశారు..? టీఆర్ఎస్ అంతర్గతంగా, అనధికారికంగా బలపరిచిన ప్యానెల్ అర్ధరాత్రి ఆందోళనకు దిగింది… జైతెలంగాణ నినాదాలు వినిపించాయి… నాలుగైదు అప్పటి సీన్లు వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్నయ్… గతంలో ఈనాడు పాత్రికేయ సిబ్బంది ఈ క్లబ్బులు, ఈ యూనియన్లకు దూరంగా ఉండేది… ఈసారి నేరుగా అధ్యక్ష ఎన్నికల్లోనే పోటీపడింది… ఈనాడు పెద్దతలకాయలు కూడా వోటింగుకు వచ్చాయి… ఫుల్ యాక్టివ్‌గా ప్రచారం చేసుకున్నారు… ఈనాడులో హఠాత్తుగా ఈ డెమోక్రటిక్ వాతావరణం ఏమిటనేది ఒక ఆశ్చర్యం… చాలామందిలో ఓ సందేహం… ఇంకా ఈ ఎన్నికల గురించి లోతుల్లోకి వెళ్లడం లేదు…
ఇలా తవ్వుతూ పోతే ఇంకా పెంకులు చాలా బయటపడేట్టున్నయ్… ఏదో దుర్వాసన గాఢంగానే వ్యాపిస్తోంది… అక్రమాలకు ఆధారాలు కనిపిస్తున్నయ్… సందేహాలు బలంగానే వినిపిస్తున్నయ్… పరువు మూసీలో కలిసిపోయింది… ఇప్పుడు కేసు దర్యాప్తు పోలీసుల దాకా పోతుందా..? అసలు వాళ్లయినా ఈ అక్రమాల సూత్రధారుల్ని పట్టుకోగలరా..? విజేతల్లో నిజంగా ప్రజాస్వామిక విలువల పట్ల నిజాయితీతో కూడిన నిబద్ధత ఉన్నవారు ఒకరిద్దరు ఉంటే, వాళ్లు రీపోలింగ్ అడిగితే బెటరేమో… కాదు, కాదు… అసలు తేలాల్సింది ఎవరు ఈ అక్రమాలకు సూత్రధారులు..?!
Share this Article