పార్ధసారధి పోట్లూరి…….. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు! అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, జపాన్, ఆస్ట్రేలియాలు రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ దేశాలు రష్యాతో ఎలాంటి వ్యాపార, ఆర్ధిక లావాదేవీలు జరపవు మరియు డాలర్లని చెల్లింపుల రూపంలో చేయవు. అయితే రష్యా 2014 లో క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికా ఆర్ధిక ఆంక్షలు విధించింది. కాగా అప్పుటికే రష్యా దగ్గర దాదాపుగా 558 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయి. 2014 నుండి క్రమంగా తన డాలర్ల నిల్వలని చైనా కరేన్సీ అయిన యువాన్ లలోకి మార్చుకుంటూ వచ్చింది… బదులుగా రష్యాకి కావాల్సిన వాటిని చైనా డాలర్ల రూపంలో చెల్లింపులు చేసి కొని, వాటిని రష్యాకి సరఫరా చేస్తూ వస్తున్నది. చైనా మీద ఆర్ధిక ఆంక్షలు లేవు కనుక ఇది పెద్ద కష్టమయిన పని కాదు.
2014 లో రష్యా క్రిమియా ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి రష్యా ఆర్ధికంగా దివాలా తీస్తుంది అని ఊహించిన అమెరికా 2022 ఉక్రెయిన్ మీద దాడి చేసేవరకు రాదు అని అనుకుంది, కానీ అలా ఏమీ జరగలేదు. రష్యా క్రిమియాని స్వాధీనం చేసుకోవడం చైనాకి కలిసి వచ్చింది. చైనాకు ఎప్పటి నుండో డాలర్ ని వర్తక, వాణిజ్య రూపంలో లావాదేవీల కోసం వాడడం మీద అంత ఆసక్తిగా లేదు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే డాలర్ ని వాడుతూ వచ్చింది. 2017 లో చైనా మొదటిసారిగా యువాన్ ని వర్తక, వాణిజ్య అవసరాల కోసం చిన్న చిన్న దేశాలని ప్రోత్సహిస్తూ వస్తున్నది. అంటే చైనా నుండి ఏ దేశం అన్నా కొనుగోలు చేస్తే డాలర్ కి బదులుగా యువాన్ రూపంలో చెల్లింపులు జరపమని అడుగుతూ వచ్చింది. అంటే చిన్న దేశాలు చైనా నుండి చేసుకున్న దిగుమతులని డాలర్ లో కాకుండా యువాన్ లు కొని, వాటిని చైనాకి చెల్లిస్తూ వస్తున్నాయి.
Ads
అదే సమయంలో చైనా తన దేశానికి చెందిన డిజిటల్ కరెన్సీని కూడా అంతర్జాతీయ లావాదేవీల కోసం ఉపయోగించాలని చూసింది. ఈ సంవత్సరం జనవరి 4 న తన డిజిటల్ కరెన్సీ అయిన digital yuan ని ప్రయోగాత్మకంగా లాంచ్ చేసింది. దీనికోసం e-CNY అనే మొబైల్ APP ని అభివృద్ధి చేసింది. e-CNY అనే APP ఆండ్రాయిడ్, ఆపిల్ ప్లాట్ ఫారాల మీద పనిచేస్తుంది. ప్రస్తుతం BETA వర్షన్ డౌన్ లోడ్ చేసుకొని వాడుకునే సదుపాయం కలిగించింది. ఈ APP ద్వారా ప్రపంచంలో ఎవరయినా సరే డిజిటల్ యువాన్ కరెన్సీని కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో డిజిటల్ యువాన్ ని ఉపయోగించి ఎవరయినా సరే చైనా నుండి వస్తువులు కొనుగోలు చేయవచ్చు. సరిగ్గా రష్యా ఫిబ్రవరి 24 న ఉక్రెయిన్ మీద దాడికి ఆదేశించిన 40 రోజుల ముందే చైనా తన డిజిటల్ యువాన్ కరెన్సీని వాడుకలోకి తెచ్చింది. చాల ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాయి రష్యా, చైనా లు.
ప్రస్తుతానికి e-CNY అనే APP BETA వెర్షన్ లో దొరుకుతున్నది అదీ చైనా పౌరులకి మాత్రమే. ఎందుకంటే దానిలో లోపాలు ఎవన్నా ఉంటే వాటిని యూజర్ల కంప్లైంట్ లు స్వీకరించి వాటిని సరిదిద్ది ఫ్రెష్ గా full వెర్షన్ APP ని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెస్తుంది. దీనివల్ల చైనాకి లాభం ఏమిటీ ? ముందు డాలర్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తుంది. తరువాత పేద దేశాల కరెన్సీ విలువ డాలర్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉండడం వలన ఆయా దేశాలు చైనా నుండి ఏవన్నా దిగుమతులు చేసుకోవాలంటే డాలర్లు కొని దిగుమతి చేసుకొనే అవసరం ఉండదు. నేరుగా యువాన్ రూపంలో చెల్లింపులు చేయవచ్చు.
అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. అది ఏమిటంటే… ఏ దేశం అన్నా యువాన్ లు కొనాలంటే ఆ దేశపు కరెన్సీ విలువ యువాన్ తో ఎలా ఉంటుంది ? దాని మీద పెద్ద కసరత్తే చేస్తున్నది చైనా. అంతిమంగా డాలర్ తో పోలిస్తే తన యువాన్ విలువ తక్కువగా ఉంచి, ఎక్కువ ఎగుమతులు చేస్తూ విదేశాల నుండి ఎక్కువ ఆర్డర్లు తీసుకోవాలనే ప్లాన్ దాగి ఉంది. ఇలా చేస్తే భవిష్యత్తులో అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ తన ఆర్ధిక ఆంక్షలు విధిస్తే అవి ప్రభావం చూపవు. ఎందుకంటే అప్పటికే డిజిటల్ యువాన్ చాల లోతుగా చొచ్చుకొని పోయి ఉంటుంది కనుక… పైగా డాలర్ కంటే విలువ తక్కువ కాబట్టి చిన్న దేశాలకి మంచి అవకాశం.
మళ్ళీ రష్యా విషయానికి వద్దాం ! 2014 నుండి, అంటే అమెరికా ఆంక్షలు విధించినప్పటి నుండి రష్యా యువాన్ లో ట్రేడింగ్ చేస్తూ వచ్చింది. 2018 మార్చి నెలలో రష్యన్ సెంట్రల్ బాంక్ రిజర్వ్ లలో 14% యువాన్ ఉంటే మిగతాది డాలర్ల రూపంలో ఉంది. 2020 మార్చి నెలలో రష్యా ట్రేడింగ్ డాలర్ల రూపంలో చేసింది 46% అయితే అదే యువాన్ 54% కి చేరుకుంది. 2022 ఫిబ్రవరి 27 న అమెరికా, యూరోపు, జపాన్, ఆస్ట్రేలియాలు ఆర్ధిక ఆంక్షలు విధించగానే రష్యన్ ప్రజలు యువాన్ లు కొనడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రష్యన్ సెంట్రల్ బాంక్ లో యువాన్ డిపాజిట్లు అధికంగా ఉన్నాయి.
అమెరికా విధించిన ఆంక్షల వల్ల రష్యన్ కరెన్సీ రూబుల్ విలువ డాలర్ తో పోలిస్తే బాగా పడిపోయింది. ప్రస్తుతం రష్యన్ రూబుల్ విలువ 1 డాలర్ కి 113 రూబుల్స్ గా ఉంది. ఇది ఇంకా పడిపోవచ్చు. మరోవైపు మాస్టర్ కార్డ్, విసా కార్డ్ లు రష్యాలో తమ కార్యకలాపాలని ఆపేశాయి. దాంతో రష్యన్ ప్రజలు ATM ల వద్ద క్యూలు కడుతున్నారు డబ్బులు డ్రా చేసుకోవడానికి… ఇది అతి పెద్ద పరిణామం… అయితే రష్యా ప్రజలకి ఇది మామూలే.
తాజాగా రష్యన్ బాంకులు యువాన్ కరెన్సీని డిపాజిట్ల రూపంలో స్వీకరిస్తున్నాయి. అంతే కాదు, ఇప్పటికే ఆయా బ్యాంకుల్లో ఎకౌంటు ఉన్న వాళ్లకి 100 యువాన్ల [$16] తో మరో ఎకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మూడు నెలల డిపాజిట్ కి 8% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇది డాలర్ డిపాజిట్ కి ఇస్తున్నదానితో సమానం అన్నమాట… అలాగే యూరోలలో డిపాజిట్ చేస్తే 7% అలాగే రష్యన్ రూబుల్ లో డిపాజిట్ చేస్తే ఆరు నెలలకి 21% వడ్డీని ఇస్తున్నాయి. ఇక MASTAR, VISA కార్డులు పనిచేయట్లేదు కాబట్టి చైనాకి చెందిన యూనియన్ పే [Union Pay] ని ఆఫర్ చేస్తున్నాయి బాంకులు. రష్యాకి చెందిన ఫెస్కో లాజిస్టిక్స్ గ్రూప్ [FESCO logistics group] అయితే తమ కస్టమర్లు ఎవరయినా సరే యువాన్ రూపంలో చెల్లింపులు జరపవచ్చు అని ప్రకటించింది. ప్రస్తుతానికి రష్యాకి చైనా అవసరం ఉంది ఆర్ధిక కారణాల రీత్యా ! అయితే ఇవన్నీ చైనా ఉచితంగా ఏమీ చెయ్యట్లేదు…
ఉక్రెయిన్ మీద దాడికి ముందే ఏం జరిగింది ?
1. రష్యా చైనాల మధ్య 30 సంవత్సరాలకి ముడి చమురు, నాచురల్ గ్యాస్ సప్లై చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇది ఇప్పటి ధరల ప్రకారం మాత్రమే… అంటే భవిష్యత్తులో ధరలు పెరిగినా దాని ప్రభావం ఈ ఒప్పందం మీద పడదు… అంటే చైనాకి చాలా చౌకగా ముడి చమురు, గ్యాస్ సరఫరా అవుతుంది అన్నమాట !
2. ఇందుకు గాను రష్యా నుండి దిగుమతి అయ్యే గోధుమల మీద ఉన్న నిషేధాన్ని చైనా ఎత్తివేస్తుంది. దాంతో రష్యా తన గోధుమలని చైనాకి ఎగుమతి చేయగలుగుతుంది.
3. రష్యాకి చెందిన విమాన ఇంధన సరఫరా సంస్థ అయిన గజ్ ప్రోమ్ నేఫ్ట్ [Gazprom Neft] చైనాకి సరఫరా చేసే విమాన ఇంధనాన్ని యువాన్ రూపంలో చెల్లింపులు తీసుకోవడానికి అంగీకరించింది.
4. రష్యా కి చెందిన పారిశ్రామిక సంస్థలు చైనా బ్యాంకుల నుండి $ 151 బిలియన్ డాలర్లు అప్పుగా తీసుకున్నాయి. అవి ఇప్పుడు తిరిగి యువాన్ రూపంలో చెల్లించడానికి చైనా ఒప్పుకుంది. ఇది పెద్ద ఊరట రష్యాకి. ఈ అప్పులు అన్నీ 2000-2017 ల మధ్య తీసుకున్నవే!
5. రష్యా 23% దిగుమతులు చైనా నుండి చేసుకుంటున్నది [టెక్స్టైల్స్ మరియు ఎలేక్త్రానిక్ వస్తువులని ] అదే సమయంలో రష్యా ఎగుమతులు 15% గా ఉన్నాయి అంటే వాణిజ్య లోటు 8 శాతంగా ఉంది రష్యాకి.
6. రష్యాకి అవసరమయ్యే సెమీ కండక్టర్ చిప్స్ 70% చైనా నుండి దిగుమతి అవుతున్నాయి.
అయితే చైనా యువాన్ చెల్లింపులు అంతర్జాతీయంగా ఎంత మొత్తంలో జరగగలవు? కేవలం 2% శాతం మాత్రమే… గ్లోబల్ ట్రేడ్ లో భాగంగా యువాన్ చెల్లింపులు జరగవచ్చు.. అంతకంటే ఎక్కువ జరపడానికి వీలు లేదు. అయితే చైనా ముందు జాగ్రత్తగా అంతర్జాతీయ ద్రవ్య నిధి [IMF ] లో తన యువాన్ ని నమోదు చేసుకుంది 2016 లో IMF SDR గా… SDR అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ [Special drawing rights] అని అర్ధం… IMF సభ్య దేశాలు ఆయా దేశాల కరెన్సీ ని ఇతర దేశాలతో లావాదేవీలు జరపడానికి వెసులుబాటు కలిగించేదే SDR అన్నమాట… మొత్తం గ్లోబల్ ట్రేడ్ శాతంలో 2% కంటే ఎక్కువ లావాదేవీలు జరపడానికి వీలు లేదు. అంటే ఇక్కడ కూడా డాలర్ ఆధిపత్యానికి వీలు కల్పిస్తున్నది SDR నిబంధనలు. అయితే చైనా ఈ నిబంధనని ఎలా అధిగమిస్తుందో చూడాలి. కాకపొతే ఈ 2% లోనే రష్యాకి సంబంధించి లావాదేవీలు జరిపినా పెద్దగా ఆటంకం ఉండబోదు.
రష్యాకి తన దగ్గర ఉన్న డాలర్ నిల్వలతో మరో అయిదేళ్ళు నెగ్గుకురాగలదు… అదే సమయంలో యువాన్ ద్వారా జరిపే వర్తక వాణిజ్య లావాదేవీల ద్వారా తన అవసరాలని తీర్చుకోగలదు. ఇలా అన్నీ సిద్ధం చేసుకొనే ఉక్రెయిన్ మీదకి దాడికి దిగింది…
ఇప్పుడేం జరుగుతున్నది ?
అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల వల్ల రష్యాకి పెద్దగా జరిగే నష్టం లేకపోగా, చైనా మరింత ఎక్కువగా లాభపడుతున్నది. ఒకరకంగా చెప్పాలంటే కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని పరోక్షంగా రష్యా ఆర్ధిక లావాదేవీల ద్వారా తిరిగి మామూలు స్థితికి చేరుకోబోతున్నది. అయితే రష్యాతో లావాదేవీలు జరిపే దేశాల మీద కూడా అమెరికా ఆర్ధిక ఆంక్షలు విధిస్తాను అంటూ హెచ్చరికలు చేస్తున్నది… మరి చైనా మీద ఆంక్షలు విధిస్తుందా ? లేదు… విధించలేదు… అలా చేస్తే సగం అమెరికా, మొత్తం యూరోపు దేశాలు తీవ్రంగా నష్టపోతాయి… కాబట్టి చైనా మీద ఆంక్షలు విధించలేదు అమెరికా. పనిలో పనిగా తైవాన్ ని స్వాధీనం చేసుకుంటుంది చైనా… కానీ అమెరికా మాత్రం తన ఆయుధాలు సరఫరా చేసి చేతులు దులుపుకుంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి చివరకి చైనా లాభపడుతున్నది అన్నమాట !
Share this Article