హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికల యవ్వారం ఓ ఇంట్రస్టింగు మలుపు తిరిగింది… ఈ ఎన్నికల్లో అక్రమాలపై అభ్యంతరాలు వస్తున్నందున ఫలితాల్ని హోల్డ్‌లో పెడుతున్నామంటూ ఓ లిఖిత నోటీసును అతికించిన రిటర్నింగ్ అధికారి ఎం.హేమసుందర్‌రావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తాజాగా ఓ ఫిర్యాదు దాఖలు చేశాడు… అది పూర్తిగా అధ్యక్ష పదవికి పోటీపడి, రెండోస్థానంలో నిలిచిన సూరజ్ అనే అభ్యర్థి గురించి… మొత్తానికి ఈ వ్యవహారం పోలీసులు, కోర్టుల వరకే కాదు, ఇంకా ముదిరేట్టుంది…
సదరు రిటర్నింగ్ అధికారి ఏమని ఫిర్యాదు చేశాడో మీరే చదవండి… అందులో పూర్తిగా సూరజ్‌ను ఈ గొడవలకు కారకుడిగా చూపిస్తున్నాడు… అంతేకాదు, బ్యాలెట్ బాక్సుల్ని ధ్వంసం చేశారు, అందులో నీళ్లు పోశారు, మమ్మల్ని తిడుతూ శారీరకంగా, మానసికంగా ఆందోళనకు గురిచేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నాడు… మూడుసార్లు ప్రెస్‌క్లబ్ ఎన్నికల్ని నిర్వహించాం, ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి అన్నాడు… సో, ఇప్పుడు దర్యాప్తు బాధ్యత పోలీసులపై పడింది… అయితే దీనిమీద నిజంగానే పోలీసులు తీసుకోదగిన యాక్షన్ ఏముంటుంది..? ఏం సెక్షన్లు పెడతారు..? ఇంట్రస్టింగు ప్రశ్నలే…
Ads
సూరజ్ కోసం అసలు ప్రెస్‌క్లబ్ సభ్యత్వమే లేని వ్యక్తులు వచ్చారని చెబుతూ, ఆ రాత్రి తీసిన కొన్ని వీడియోల్ని, సీసీ టీవీ ఫుటేజీని కూడా పోలీసులకు ఇచ్చారట… నిజానికి ఇక్కడ సమస్య ఏమిటంటే..? స్వస్తిక్ గుర్తుతోపాటు రౌండ్ మార్క్ ఉన్నవీ అధికారికంగానే ఆ రిటైర్డ్ సహకారశాఖ సిబ్బంది తెచ్చారు… అది ఎప్పుడూ చేసేదే అంటారు వాళ్లు… అది వోటు చేసే సభ్యులకు కూడా తెలియదు కదా… కానీ ఎన్నికల సిబ్బంది స్వయంగా చెప్పినప్పుడు, ఇక అక్కడ దొంగ వోట్లు అనే ప్రస్తావన రాదు, అందుకని అక్కడే వదిలేయాల్సింది… (స్వస్తిక్ గుర్తుతో పాటు మరో గుర్తు అనేది ఎన్నికల సిబ్బంది తప్పిదమే… వాళ్లకు సహజమే అయితే ఆ విషయం సభ్యులకు, అభ్యర్థులకు ముందే చెప్పాల్సింది…)
ఇది కాస్త ముదిరి… సూరజ్ ప్యానెల్ ఎడాపెడా టీఆర్ఎస్ పేరును వాడుకుందంటూ… గెలిచిన ప్యానెల్ ముఖ్యులు ఏకంగా కేటీయార్ దృష్టికి తీసుకుపోయారు… ఆయనతో ఈ ప్యానెల్ సభ్యులకు మంచి సంబంధాలే ఉన్నాయి కూడా… ఓడిన ప్యానెల్ వెనుక ఎంపీ సంతోష్ ఉన్నాడని మరో ప్రచారం… ఈనాడు నిలబెట్టిన అధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా… ఎన్నికల సిబ్బంది ఆంధ్రా… దాంతో కాసేపు ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్ తెరమీదకు వచ్చింది… సూరజ్ కేసీయార్ సొంత చానెల్ టీన్యూస్‌కు చెందిన జర్నలిస్టు… (నిజానికి హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జర్నలిస్టుల కోసం, ఇక్కడ ఆంధ్రా-తెలంగాణ అనే భేదం ఉండదు…)
సో, ఇది కేటీయార్‌కు కూడా కాస్త సున్నితమైన వ్యవహారంగా మారింది… తనేమో ఇందులో ఇప్పుడు నేరుగా ఇన్వాల్వ్ కాలేడు… సో, ఇక పోలీసులు ఏం చేయాలి..? ఎన్నికల సిబ్బంది చెప్పింది విని, ఆ వీడియోలు చూసి, గొడవకు కారకులు అంటూ కొందరిని గుర్తిస్తారేమో… అయితే మళ్లీ మన ఎదుట నిలబడే ప్రశ్న… అవి శిక్షించదగిన పెద్ద నేరాలా..? ఏ సెక్షన్ల కింద..!?
కొన్ని ప్రశ్నలు… సమాధానాల్లేవు… 1) ఎన్నికల సిబ్బంది రిటైర్డ్ సహకార శాఖ ఉద్యోగులు… వాళ్లకు పేమెంట్ ఇస్తున్నారు… 2) నిజానికి ఇలాంటి సంఘాలకు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎన్నికలు నిర్వహించాలి కదా… మరి రిటైర్డ్ ఉద్యోగులు దేనికి..? 3) అసలు ఆర్వోసీ గుర్తింపు కొనసాగుతోందా..? ఏమైంది..? 4) విజయవాడ నుంచి బస్సుల్లో ఆంధ్రా జర్నలిస్టులను తీసుకొచ్చారా..? ఎవరు..? 5) సాయంత్రం ఒకే గంట సేపట్లో రెండొందలకు పైగా వోట్లు పడ్డాయట… ఎలా సాధ్యం..? 6) ఓ ప్రైవేటు ఎన్నికల నిర్వహణ ఏజెన్సీ చెప్పే మాటలకు పోలీసులు విలువ ఇస్తారా..? 7) అసలు పోలీసులకు ఫిర్యాదు చేశారా..? 8) అన్నింటికీ మించిన పెద్ద ప్రశ్న… ఈ పంచాయితీ ఇక్కడితో ఆగుతుందా..?!
అప్ డేట్ :: సూరజ్ వివరణ ఏమిటంటే..? ‘‘ప్రెస్ క్లబ్ ఎన్నికల బరిలో నేనున్నాననే ఏకైక కారణంతో నాకు అనేక అనవసర విషయాలు ఆపాదించడం, నాపై ముద్రలు వేయడం సమంజసం కాదు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో నేను ఏ పార్టీ పేరు కూడా వాడుకోలేదు. నా వెనక ఎవరో ఉన్నారనడం సబబు కాదు’’
Share this Article