వాట్సప్ యూనివర్శిటీకి దూకుడు ఎక్కువ… బుర్ర తక్కువ…! వేరే వాళ్లు నిరూపించనక్కర్లేదు… దానికదే ఆవిష్కరించుకుంటూ ఉంటుంది… అకస్మాత్తుగా కొన్ని ప్రచారాలను తెర మీదకు తీసుకొస్తూ ఉంటుంది… దానివల్ల నష్టం జరుగుతుంది బాబూ అని చెప్పినా సరే వినదు… దాని పోకడ దానిదే… హఠాత్తుగా ఈ చర్చ, ఈ ప్రస్తావన ఏమిటీ అంటారా..? ఒకసారి ఈ ఫోటో చూడండి…
ఈయన పేరు స్వామి కృపాకరానంద మహారాజ్… అసలు పేరు, అనగా తను సన్యాసం స్వీకరించక ముందు పేరు దేవతోష్ చక్రవర్తి… త్వరలో ఎన్నికలు జరగబోయే బెంగాల్‌కు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్నారు… నిజానికి గత ఆగస్టులో ఈ ప్రచారం బలంగా తెర మీదకు వచ్చింది… మళ్లీ ఇప్పుడు స్టార్టయింది… ఇదుగో ఇలాంటి మెసేజులు వాట్సప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి మళ్లీ…
Ads
చదివారు కదా… బేలూరులోని రామకృష్ణమఠానికి చెందిన ఆరోగ్యభవన్ ఇన్చార్జి తను… కార్డియాలజిస్టు… అమెరికాలో చదువుకున్నాడు, ఎయిమ్స్‌లో ఎంఎస్ చేశాడు… అసలు బెంగాల్ ఎంసెట్ టాప్ ర్యాంకర్ తెలుసా..? అక్కడ ఉత్తర ప్రదేశంలో యోగి… ఇక్కడ బెంగాల్లో ఈయన… ఆ దీదీని పడగొట్టే దాదా ఆయనే….. అన్నట్టుగా ఉంది కదా ఈ ప్రచారం…
అసలు ఎవరీయన..? ఈ ప్రచారంలో ఉన్నవి వదిలేయండి… తను చిన్నప్పటి నుంచీ మంచి చురుకైన విద్యార్థి… శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నాడు… బెంగాల్ మెడికల్ ఎంట్రన్సులో 17వ ర్యాంకు… ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాడు… ఎయిమ్స్‌లో ఎండీ చేశాడు… తరువాత హార్ట్ రిలేటెడ్ వ్యాధుల రీసెర్చ్ కోసం అమెరికా వెళ్లాడు… అక్కడ అకస్మాత్తుగా మాయం అయిపోయాడు… కొన్నాళ్లకు బేలూరు రామకృష్ణమఠంలో తేలాడు…
కొన్నాళ్లు వారణాసికి కూడా పంపించారు… ప్యూర్ సన్యాసి తను… ఒరిజినల్‌గా బెంగాల్ వాడు కాబట్టి, యోగి లాగే తనను బీజేపీ సీఎంను చేయబోతోందని ఈ వాట్సప్ ప్రచారాల సారాంశం… నిజానికి గత ఆగస్టులోనే ఈ ప్రచారం బాగా పెరిగినప్పుడు బెంగాల్ బీజేపీ ఖండించింది… రామకృష్ణమఠం కూడా ఆ ప్రచారాన్ని తోసిపుచ్చింది… చివరకు ఈ స్వామి వారే ఓసారి స్పందించి… ‘‘ప్రజలకు సేవ చేయటానికి అనేక మార్గాలు… నేను ఎంచుకున్న మార్గం వేరు… స్వామి వివేకానందుడు చూపిన బాటే నేను నడిచేది… రాజకీయాలు అనే మార్గంలోకి నేను వెళ్లను’’ అని స్పష్టంగా చెప్పాడు… అయినా సరే ఈ ప్రచారాలు ఆగడం లేదు… మళ్లీ ఇప్పుడు కాస్త ఎక్కువగా…
సరే, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు… ముందు ఉత్తరప్రదేశంలో కూడా యోగి సీఎం అవుతాడని అనుకోలేదు కదా అంటారా..? అవును, అది నిజమే… కానీ యోగి వేరు, ఈ కృపాకరుడు వేరు… ఎందుకంటే..?
యోగి కూడా సన్యాసే… కానీ తన గురుపరంపర వేరు… గోరఖ్‌పూర్ ఆశ్రమ అధిపతిగా ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చాడు… ఎంపీగా గెలిచాడు… సొంతంగా ఒక నెట్వర్క్ పెంచుకున్నాడు… చాలాసార్లు బీజేపీతో కూడా విభేదించాడు… అసలు తనను సీఎం చేస్తారని ఎవరూ ఊహించలేదు కూడా… తనను సీఎం అభ్యర్థిగా అంతకుముందు ఫోకస్ చేయలేదు కూడా…
కృపాకరుడి నేపథ్యం వేరు… తను ఈరోజుకు రాజకీయ తెర మీదకు రాలేదు… రాజకీయాల్లో ప్రవేశం లేదు… పైగా తనకే ఇంట్రస్టు లేదు… ఇక బీజేపీ ఐనా కుర్చీ మీద ఎలా కూర్చోబెట్టగలదు… అసలు పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది వేరే చర్చ… ఒకవేళ సరిపడా సీట్లు వచ్చినా సరే, సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పుడే తేల్చిచెప్పలేని స్థితి… అందుకే ఎవరి పేరునూ అది ఫోకస్ చేయడం లేదు… ఆ పేర్లలో కృపాకరుడు అస్సలు లేడు… కనుక ఆయన్ని వదిలేయండి ఫాఫం…!! ఈ డాక్టర్ కమ్ సన్యాసి కమ్ క్లాసికల్ సింగర్ కమ్ మ్యూజిషియన్ ఏదో నిఖార్సయిన ప్రజాసేవలో తన బతుకును సార్థకం చేసుకుంటున్నాడు… ఈ రొంపిలోకి ఎందుకు లాగుతారు..?!
Share this Article