ప్రతి థియేటర్లో 17 నంబర్ సీటు ఖాళీ ఉంచారు… ఎందుకు..? మరణించిన పునీత్ రాజకుమార్ వస్తాడు, ఆ సీట్లో కూర్చుని సినిమా చూస్తాడు అని..! అవును, కొన్ని ఉద్వేగాలకు రీజనింగ్ ఉండదు, అది అభిమానం, అంతే… కృత్రిమమైన అభిమానం కాదు, పునీత్ మీద కన్నడిగులు కనబరిచేది… ఆ అభిమానంలో స్వచ్ఛత కనిపిస్తుంది… తనను ఓ సినిమా నటుడికన్నా అంతకుమించి చూస్తున్నారు… చూశారు… తను మరణించి ఇన్ని రోజులవుతున్నా అదే అభిమానం…
అదెలా వచ్చింది..? సగటు సినిమా హీరో చేసే ఫైట్లు, డాన్సులు, చెత్తా ఫార్ములా ఇమేజీ కథలతో రాలేదు… తన గుణం, తన వ్యక్తిత్వం, తన ఔదార్యం వల్ల ఆ అభిమానం పాతుకుపోయింది… ఒక్కోసారి అనిపిస్తుంది, నిజంగా ఈ రేంజ్ అభిమానం బహుశా పునీత్ తండ్రి రాజకుమార్ పొందాడో లేదో డౌటే… నెవ్వర్, పునీత్ దక్కించుకున్న ప్రేమను దేశంలో ఏ హీరో పొందలేడు… ఇది నిరుపమానం…
జేమ్స్ అని తను చివరగా నటించిన ఓ సినిమా వచ్చింది… పలు భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో రిలీజ్ చేశారు… తెలుగులో కూడా విడుదలైంది… తను మరణించాక కొన్ని సీన్లను గ్రాఫిక్స్‌తో కవర్ చేశారు… ఇది సినిమా గురించిన రివ్యూ కాదు… అక్కర్లేదు… సినిమా ఎలా ఉందో, కథ ఏమిటో, ఎవరెలా నటించారో ఇక్కడ ముఖ్యమే కాదు… అది కన్నడిగుల సినిమా… మొదటి రోజు నుంచే ఓ ఉత్సాహం, ఓ ఉత్సవం… కన్నీళ్లతో జరుపుకునేది… సినిమా ఎలా ఉందని కాదు, తెరపై మళ్లీ పునీత్‌ను చూసుకునే ఓ ఉద్వేగం…
Ads
అది తన్నుకొచ్చినప్పుడు ఏ లాజిక్కులూ పనికిరావు… అందుకే రాష్ట్రమంతా సెలబ్రేషన్స్… ఒకవైపు కన్నీళ్లు కారుస్తూనే, చప్పట్లు చరుస్తూ, ప్రేక్షకులు ఈలలు వేస్తున్న పరస్పర భిన్నదృశ్యాలు మీరు చూశారా ఎప్పుడైనా..? కన్నడసీమలో వందల థియేటర్లలో జేమ్స్ సినిమాలో పునీత్ కనిపించగానే ఇవే దృశ్యాలు… ఒక్క ఉదాహరణ చెప్పుకుందాం… బెంగుళూరులోని వీరభద్రేశ్వర థియేటర్… ఆరు గంటల షోకు చాయ్, బిస్కెట్లు… 10 గంటలకు దోశెలు… ఒంటి గంటకు చికెన్ బిర్యానీ, నాలుగు గంటలకు సమోసాలు, ఏడు గంటలకు గోబీ మంచూరియా ఇచ్చారు…
పెద్ద పెద్ద కటౌట్లు, పూజలు, గుళ్లకు అలంకరణ చేసినట్టుగా థియేటర్లకు కొత్త మేకప్పులు… అంతెందుకు 25వ తేదీ వరకు అసలు వేరే సినిమాలే ప్రదర్శించరట రాష్ట్రంలో… బాణాసంచా, సీరియల్ బల్బులు, ఉచిత అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, నేత్రదాన శిబిరాలు… కర్నాటకలో ఏదో జరుగుతోంది… ఓ ఉద్వేగం బలంగా ఊపేస్తోంది… పునీత్, ధన్యజీవివి… నెవ్వర్, ఈ స్థాయి అభిమానం కలలో కూడా ఎవరికీ దక్కదు… దక్కదు… అప్పు, పవర్ స్టార్ ఎట్సెట్రా ఏ బిరుదులూ అక్కర్లేదు… పునీత్… అంటే పునీత్… అంతే…
జేమ్స్ విడుదల రోజున పునీత్ సమాధిని అలంకరించారు… సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా నివాళి సందేశాలు, వీడియోలు, ఫోటోలు, స్మరిస్తూ పోస్టులు… ఈ సినిమాలో పునీత్ ఇద్దరు సోదరులు అతిథి పాత్రల్లో కనిపిస్తారు… ఒరిజినల్ వెర్షన్‌కు ఒక సోదరుడు డబ్బింగ్ చెప్పాడు… అసలు ఫ్యాన్స్ హంగామా మాత్రమే కాదు, సౌతిండియన్ సెలబ్రిటీలు కూడా అనేకమంది ట్వీట్లతో పునీత్‌ను స్మరించుకుంటున్నారు ఈ సందర్భంగా… కొన్ని ట్వీట్లు ఇవిగో…
Share this Article