రాజ్ తరుణ్… మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు… షార్ట్ ఫిలిమ్స్‌తో వెలుగులోకి వచ్చి, కథానాయకుడు అయిపోయి, ప్రతి తెలుగింటికీ పరిచయమయ్యాడు… కానీ 9 ఏళ్లుగా కొట్టుకుంటున్నా సరే, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది… మొత్తం 15 సినిమాలు… సినిమా చూపిస్త మావ ఒకటి గుర్తొస్తుంది తన పేరు వినగానే… అదొచ్చి కూడా ఏడేళ్లయింది… ఇక సినిమాలు వస్తున్నయ్… పోతున్నయ్… ఫాఫం, తన తప్పేమీ లేదు, తన శక్తివంచన లేకుండా కష్టపడతాడు…
కెరీర్‌పరంగా బ్యానర్లు, కథలు వంటి విషయాల్లో పెద్ద తప్పులు చేసినట్టు కూడా అనిపించదు… కానీ ఎక్కడో శని తిష్ఠవేసుకుని కూర్చున్నట్టున్నాడు… ప్చ్, కూర్చుంది చాలు, స్టాండప్ రాహుల్ అని తాజాగా అరుస్తున్నా, లేవడం లేదు… ప్రేక్షకులే అర్థంతరంగా లేచి థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నారు… రాజా, ఏమిటీ గ్రహచారం తమ్ముడూ… మళ్లీ కొట్టేసింది… షార్ట్ ఫిలిమ్స్ తీసీ తీసీ, అలాంటి కాస్త ఎక్సట్రా షార్ట్ సినిమాల్నే ఎంచుకుంటున్నట్టు అనుకోవాలా..?
హీరోయిన్ వర్ష బొల్లమ్మది కూడా సేమ్ స్టోరీయే… ఆమె కూడా 2015 నుంచి తిప్పలు పడుతోంది… 17 సినిమాలు… ప్చ్, ఐనా కెరీర్ గొప్పగా ఏమీ లేదు… కాస్త బొద్దు బుగ్గల బొల్లమ్మ… కన్నడ కస్తూరి… మన తెలుగు టీవీ సీరియళ్లలో కన్నడ నటీమణులదే హవా… కానీ సినిమాలకొచ్చేసరికి వాళ్లు నిలదొక్కుకోవడం లేదు ఎందుకో మరి… వర్ష కూడా గొప్ప నటి, మస్తు అందగత్తె అనలేం గానీ… మార్కెట్‌లో ఉన్న చాలామందికన్నా బెటరే…
Ads
రెండు దురదృష్టాలు ఒక్కటయ్యాయి… సహజీవనం చేస్తున్నట్టుగా స్టాండప్ రాహుల్ సినిమాలో జతకట్టారు… ఇంకేముంది..? డబుల్ ఇంజన్ ఎఫెక్ట్… నిజానికి ఈ సినిమా మీద సాగిన ప్రచారాన్ని బట్టి ఇదేదో కామెడీ సినిమా అనుకున్నారు ప్రేక్షకులు… రాజ్ తరుణ్ కాబట్టి కాస్త కామెడీ ఎక్స్‌పెక్ట్ చేశారు, పైగా వెన్నెల కిషోర్ ఉన్నాడు… కానీ నిజానికి ఈ కథ వేరు… సహజీవనం చుట్టూ అల్లబడిన ఓ సాదాసీదా కథ…
రాజ్ తరుణ్ లుక్కు మారింది… బాగుంది… హీరోయిన్ బాగుంది… కానీ ప్రేక్షకుడు ఆశించిన కామెడీ పెద్దగా నవ్వించలేదు, అది ఓ మైనస్… నిజానికి తెల్లారిలేస్తే టీవీల్లో రకరకాల కామెడీ షోలు ప్రేక్షకుల్ని నవ్వించడానికి తెగ ప్రయాసపడుతున్నాయి… వాటిని మించి పంచ్ ఉంటే తప్ప సినిమాల్లో కామెడీ క్లిక్కవదు… పైగా స్టాండప్ కామెడీ కష్టం… పోనీ, సహజీవనం కథనైనా ఆసక్తికరంగా చెప్పగలిగారా అంటే అదీ లేదు…
బలమైన భావోద్వేగాలు ఎక్కడా కనిపించవు… ఎంచుకున్న థిన్ లైన్ మంచిదే… తల్లిదండ్రుల అనుభవాల నేపథ్యంలో పెళ్లి మీద నమ్మకం లేని యువకుడు ప్రేమలో పడతాడు… అయితే దీనికి మంచి సీన్లు పడితే తప్ప కథ రక్తికట్టదు… అదే లోపం అనిపిస్తుంది… ఈ సినిమాలో ఓ డైలాగుంది… యావరేజీ జోకులకు జనం చప్పట్ల కొట్టరు… నిజమే… ఈ సినిమాయే ప్రూఫ్…
బ్రహ్మానందం మొనాటనీ అయిపోయి, ఇక తను తెరపై కనిపించినా సరే ఇప్పుడు పెద్దగా నవ్వు రావడం లేదు… అయితే తను ఈ స్థితికి చేరడానికి కొన్నేళ్లు పట్టింది… వెన్నెల కిషోర్ త్వరగానే ఆ స్థితి చేరుకున్నాడు… ప్రతి సినిమాలో కనిపిస్తాడు, ఏదో తన వంతు తను ప్రయత్నిస్తాడు… ఒకేతరహా… మొనాటనీ వచ్చేసింది… ఈ సినిమాలోనూ అంతే… ఇంద్రజ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు గానీ మురళీ శర్మ వంటి ప్రతిభ గల నటుడికి తగిన పాత్ర కాదు ఇది… వెరసి రాజ్ తరుణ్ దురదృష్టాల జాబితాలో మరో పేరు చేరింది…!!
Share this Article