కాస్త నవ్వొచ్చింది… సినీ మేధావులు తమను మించిన బుర్రలు లేవనుకుంటారు… వాళ్లు ఏవో ప్రవచనాలు వినిపిస్తారు… మీడియా మిత్రులు కళ్లకద్దుకుని, కలాలకు పదును పెట్టి భక్తిగా అచ్చేసి ప్రచారం చేస్తారు… మొన్న ‘అంటే సుందరానికీ’ అనే సినిమా తాలూకు హీరోయిన్ నజ్రియా ఫస్ట్ లుక్‌ను, వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు… టీజర్లు, ట్రెయిలర్లు, సాంగ్ రిలీజులు, వీడియో గ్లింప్స్, ఫస్ట్ లుక్, ప్రిరిలీజ్, ఆడియో రిలీజ… ఎన్నెన్ని ప్రచార మార్గాలో…
నిజానికి ఎప్పట్నుంచో ఈ సినిమా వార్తల్లో ఉంది… నాని కొత్త గెటప్పు, కొత్త తరహా పాత్ర చేస్తున్నాడు… కాస్త నటన తెలిసినవాడే కాబట్టి ట్రెయిలర్లలో తన డిక్షన్, లుక్కు వెరయిటీగా కనిపిస్తున్నయ్… రొటీన్ ఫార్ములా చెత్త నుంచి ఈ భిన్నత్వం బాగుంది… అయితే మొన్నటి వీడియో గ్లింప్స్ విడుదల వార్తను దాదాపు ప్రతి పత్రిక ఒకేరకంగా రాసింది… బహుశా మేకర్స్ పంపించిన నోట్ అలాగే కొట్టేసి ఉంటారు… అందులో ఆకర్షించింది ఏమిటీ అంటే..?
నానితో వాళ్ల కుటుంబం హోమాలు చేయిస్తూ ఉంటుంది… ఏవో గండాల నుంచి తప్పించడానికి అన్నమాట… ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు… ఇక లీలా థామస్ అనే పాత్రను నజ్రియా పోషిస్తోంది… ఆమె క్రిస్టియన్, చర్చిలో ప్రేయర్ చేస్తోంది… ఓ ఫోటోగ్రాఫర్ పాత్ర ఆమెది… వాళ్లిద్దరి నడుమ ప్రేమ ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్… సదరు వీడియో చివరలో ఓ సూక్తి కనిపించింది… అదీ మనం చెప్పుకునేది…
Ads
ఆవకాయ సీజన్‌ని కేక్, వైన్‌తో సెలబ్రేట్ చేసుకొండి… పత్రికల్లో వార్తలే తప్పుడు బాష్యం చెబుతున్నాయో, లేక మేకర్స్ ఉద్దేశమే అలా ఉందో గానీ… ఆవకాయ అంటే హిందూయిజం, అందులోనూ బ్రాహ్మణ్యం, కేక్, వైన్ అంటే క్రిస్టియానిటీ అట… అందులోనూ ఆవకాయ అని తెలుగులో రాసి, కేక్ అండ్ వైన్ అని ఇంగ్లిషులో రాశారు… కొంపదీసి తెలుగులో రాస్తే హిందుత్వ, ఇంగ్లిషులో రాస్తే క్రిస్టియానిటీ అని కాదు కదా…!! హేమిటో… ఆవకాయ, కేక్ అందరి ఆహారమే కదా…! ఇంత తేడా ఉంటుందని తెలియదు…
వోకే, ఒక హిందువు, ఒక క్రిస్టియన్ నడుమ ప్రేమ కథ ఇప్పుడు కొత్తేమీ కాదు… చాలా సినిమాలు వచ్చినయ్… కొత్తగా ఎలా చెబుతారనేదే ఆసక్తికరం… అయితే బ్రాహ్మణ్యానికి ఆవకాయ ఎలా సింబాలిక్ ఐడెంటిటీ అయ్యిందో అర్థం కాదు… సేమ్, కేక్ అండ్ వైన్ కూడా..! పైగా ఓ సంప్రదాయ హిందువు అనగానే బ్రాహ్మణ యువకుడినే చూపించాలా..? ఆ టిపికల్ డిక్షన్‌తో మాట్లాడింపజేయాలా..? ఈ కాలం బ్రాహ్మణ యువకులు అలాగే ఉంటున్నారా..?
అందుకే కాస్త నవ్వొచ్చింది… అఫ్‌కోర్స్, రెండు భిన్నమైన మతాలకు చెందిన ప్రధాన పాత్రలతో ఓ ప్రేమ కథను భిన్నంగా చెప్పాలనుకోవడం బాగానే ఉంది… తప్పేమీ లేదు… నానికి జోడీగా నజ్రియాను ఎంచుకోవడం ఇంట్రస్టింగే… అప్పుడెప్పుడో ‘రాజా రాణి’ అనే డబ్బింగ్ సినిమాలో కనిపించింది… స్ట్రెయిట్‌గా తెలుగులో చేయడం ఇదే మొదటిసారి… ఆ డబ్బింగ్ సినిమాకు, ఈ సినిమాకు నడుమ తొమ్మిదేళ్ల వ్యవధి…
ఈమె మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ భార్య… ఫాజిల్ తెలుసు కదా… పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్… ఆమెకు మరీ 19 ఏళ్లకే ఫాజిల్‌తో పెళ్లయ్యింది… పెళ్లయ్యాక నాలుగేళ్లపాటు ఏ సినిమాలోనూ చేయలేదు… 2018 నుంచి ఒకటీఅరా సినిమాలు చేస్తోంది… తను నటి మాత్రమే కాదు, డాన్సర్, యాంకర్, మోడల్, సింగర్… సో, నాని కొత్త పాత్ర మాత్రమే కాదు, ఆమె కూడా ఈ సినిమాకు సంబంధించి అప్పియరెన్స్, నటన కూడా పరిశీలనాంశమే..!!
Share this Article