……….. By…. విప్పగుంట రామ మనోహర
అలై పాయుదే కన్నా… అలై పొంగెరా కన్నా. సఖి సినిమాలోని పాటగానే చాలా మందికి తెలుసు. ఊతుకాడి వెంకట సుబ్బయ్యర్ కవి రాసిన కృతిగా సంగీతాభిమానులకి తెలిసి ఉంటుంది. నాకు తెలీదు. పోయిన వారం ‘ఆహా’ లో తెలుగు ఇండియన్ ఐడల్ లో వాగ్దేవి అనే సింగర్ ఈ పాట పాడి జడ్జిల ప్రశంసలు అందుకుంది. ఆ ఎపిసోడ్ చూశాక అలై పొంగెరా లిరిక్స్ కోసం వెదికా. వేటూరి రాసిన పాట. వేటూరి పాటని తమిళంలో తీసుకున్నారా లేక తమిళ మూలమా అని వెదికితే తెలిసింది. మన వేటూరి కవితా లాలిత్యం, అనువాద కౌశలాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.
ఊత్తుక్కాడు వెంకట కవి గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. ఊత్తుక్కాడు కుంభకోణం దగ్గర చిన్న ఊరు. కాళింగ నర్తన శ్రీకృష్ణ పెరుమాళ్ వేంచేసిన క్షేత్రం. కాళీయ మర్దన శ్రీకృష్ణ విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. మరెక్కడా లేదని ప్రతీతి. వెంకట కవి 1700-1765 మధ్య కాలంలో జీవించాడు అంటే త్యాగయ్యకు ముందువాడు. ఆనాటి సంగీత గురువు శ్రీ కృష్ణ యోగి తనకు సంగీతం నేర్పనంటే దిగులు పడ్డ వెంకటకవికి శరణు వేడితే కాళీయ నర్తన శ్రీకృష్ణుడే దీక్షనిచ్చి సంగీత జ్ఞానాన్ని ప్రసాదించాడని ప్రతీతి.
Ads
అలై పాయుదే ఎన్ మనమిగ .. నీ మోహన వేణుగానానికి అలలు అలలుగా మనసు చంచలంగా ఉంది నా మనసు కన్నా.. నీ పాట విన్నా, నీవు కనరాక అని తను రాసిన కీర్తన తన జీవిత తత్వాన్ని సమగ్రంగా చెప్పే కృతి. ఓ మోహన మురళీధరా, నీ గానం విని తన్మయత్వంలో ఓ శిలనై నిలిచాను కాలమాగినట్లు. పండు వెన్నెల పట్టపగలులా ఉన్నా, నీ రూపు కనరాక, నా కళ్ళు చికిలించి కనుబొమలు ముడివేసి నీ గానం వినవచ్చే వైపే చూస్తున్నా. నీ వేణుగానం గాలిలో అలలై నన్ను తాకుతోంది. ఏదో తెలీని పారవశ్యంలో నా కళ్ళు మూతలు పడుతున్నాయి. రా కన్నయ్యా.. నా లేత హృదయాన్ని నీ గానంతో తాకి నీ భావంతో నింపు. నిర్మలమైన ఓ వనాన నన్ను నీలో కలుపుకుంటావా. అలలపై రవి కిరణాల్లా మెరిసే కాలి గజ్జెలతో నీతో నే నర్తిస్తానా. నీ విరహంలో ఎంతని విలపించను. నీవేమో నన్ను విడిచి ఇతర గోపికలతో నర్తిస్తున్నావు. ఇది తగునా ఇది ధర్మమా అంటూ సాగే కృతి. కృష్ణ భక్తిలో భక్తుడు గోపిక కృష్ణుడు పరమాత్మ. వయసు మీద పడ్డాక పట్టపగలు కూడా కనుచూపు మందగించి జీవితం చివరిదశలో ఇన్నేళ్ళ ఆత్మ సమర్పణ తరువాత, ఎదురుచూపుల తరువాత కూడా కన్నయ్య తన చెంత లేడనీ, తనతో కలుపుకోలేదని జీవుడు పడ్డ వేదన ఈ కృతి.
వెంకట కవి రచించిన కృతులు 500 వరకు లభించాయి. త్యాగరాజ పంచ రత్నాల్లా వెంకట కవి సప్త రత్న కృతులు ప్రసిద్ధి. సంగీత రత్నాకరంలో సారంగదేవుడు ఒక వాగ్గేయకారునికి ఉండాల్సిన రాగ, తాళ, లయ, నాట్య శాస్త్ర జ్ఞానాలన్నీ అపారమైన స్థాయిలో ఉన్న కవి వెంకట కవి అని ప్రతీతి. తను రచించిన ‘కాళింగ నర్తన థిల్లానా’ విన్నవారెవరైనా అవుననే అంటారు. ‘స్వాగతం కృష్ణా, శరణాగతం కృష్ణా మధురాపురి సదనా మృదు వదనా మదుసూదన… స్వాగతం కృష్ణా..” ‘సుందర నందకుమారా’ వంటి ఎందఱో సంగీతాభిమానుల ఆదరణ పొందిన కృతులు వెంకట కవివే. ఆయన గురించి మరింత తెలుసుకోవాలంటే https://www.venkatakavi.org/ చూడవచ్చు.
ఇంతటి అధ్బుతమైన కృతిని సఖి సినిమాలో ఒక సీమంతపు పేరంటంలో వాడుకున్నారు. తెలుగులో వేటూరి తప్ప మరెవరూ అనువదించలేరేమో. తమిళ మూలంలో గోపికా భక్తి పెల్లుబికితే, తెలుగులో వేటూరి గోపికా విరహాన్ని కళ్ళకి కట్టాడు. తమిళ మూలానికి దగ్గరగా ఉంటూనే, వేటూరితనం చూపించాడు. ఈ అనువాదంలో వేటూరి వాడిన పదాల రమణీయతా, తెలుగుతనం అద్భుతం. నా మనసు అలై పొంగి నీ ఆనంద మోహన వేణు గానమున ఆలాపన అయ్యింది అంటాడు. దొరా కాలమాగినది నీ గానం వింటూ.. దోర ప్రాయమున యమునే అలై పొంగింది అంటాడు. పట్టపగలు వెలుతుర్లా కనుల వెన్నెల పాలు చిలికినట్లుంది అంటాడు. సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా అనీ, ఎడారి గళాన వర్షించవా అనీ ఒక్క వేటూరి మాత్రమే రాయ గలడు.
ఈ కృతి కానడ రాగంలో ఉన్నదన్న స్పృహతో ‘గాదిలి వేణుగానం కానడ పలికే’ అంటాడు వేటూరి. గాదిలి అంటే ప్రియుడు/ ప్రియమైన అని అర్ధం. అచ్చ తెలుగు పదం. సినిమాలో పాడిన వాళ్ళు ‘కాదిలి’ అని పాడారు. తమిళంలో ‘క’ ‘గ’ అభేదం వల్లనేమో.. ఆరోగ్య ని ఆరోక్య అనడం మనకి తెలుసు. తరువాత ఎంతో మంది సింగర్స్ కాదిలి అనే పాడారు. ‘పాడుతా తీయగా’ లో బాలు దీని మీద వివరించాడేమో అని చూశా. ఆయన దృష్టీ దీని మీద పడలేదు. కానీ తెలుగు ఇండియన్ ఐడల్ లో గాయని వాగ్దేవి మాత్రం గాదిలి అనే స్పష్టంగా పాడింది. హాట్సాఫ్ (https://youtu.be/iCHzwudns9E). అనువాద రచన అదీ ఒక వాగ్గేయకారుని కృతిని అనువదించడం రాగ తాళాలు చెడకుండా ఎంత కష్టమో ఊహించవచ్చు. ఒక ఇరుకైన బాట. అక్కడ స్పేస్ లేదు. అయినా వేటూరి మూలంలోని భావం కంటే విస్తృతి పెంచాడు. అదే వేటూరి గొప్పదనం. ఇక వేటూరి ‘తలిరుటాకు’ అనే పద ప్రయోగం. మరో అందమైన తెలుగు పదం. చిగురుటాకు అని అర్ధం.
https://www.youtube.com/watch?v=iCHzwudns9E
కళ్ళు మూసుకుని తెలుగులో ఈ పాట వింటుంటే కన్నయ్య విరహంలో తలిరుటాకులా వణికే ముగ్ధ మోహన గోపికా సౌందర్యం., తమిళంలో వింటే భక్తి పారవశ్యంలో కన్నయ్యకై తపించే గోపికా వేదన తళుక్కుమంటాయి. ఊత్తుక్కాడి వెంకట కవి తమిళుల అదృష్టం. అనువాద కవితలో కూడా జవజీవ ఊపిరులూదే వేటూరి కవి మన అదృష్టం. ఎంతో మంది గొప్ప గాయకులు ‘అలై పాయుదే’ ఆలపించినా.. జేసుగంధర్వదాసు పాడినది నాకైతే పదే పదే వినాలనిపిస్తుంది (https://youtu.be/DngurpPulvM). ఇక కాళింగ నర్తన థిల్లానా వినాలంటే… అరుణా సాయిరాం ని మించి మరొకరుండరేమో (https://youtu.be/c9Cbhpd2zYw). అలాగే సూర్య గాయత్రీ, రాహుల్ వెల్లాల్ కూడా మెప్పిస్తారు. (https://youtu.be/gYiRRS1Qpu8)…
Share this Article