ఆమధ్య రాజమౌళి ఆర్ఆర్ఆర్ మీడియా మీట్ నిర్వహిస్తున్నప్పుడు… ఓ జర్నలిస్టు (??) రాజమౌళి వైపు అంతులేని ఆరాధానభావంతో చూస్తూ… జక్కన్న గారూ, మీరు ఉన్న ఈ కాలంలోనే మేం జర్నలిస్టులుగా ఉన్నందుకు, పుట్టినందుకు గర్విస్తున్నాం అని ఏదో కీర్తన ఆలపించాడు… ఇలాంటోళ్లను రోజూ చాలామందిని చూస్తాడు కాబట్టి రాజమౌళి సింపుల్‌గా తనవైపు జాలిగా చూసి, లోలోపల నవ్వుకుని ఉంటాడు… మన మీడియా దాదాపు మొత్తం అంతే… ఆ ఒక్కరినీ మనం తప్పుపట్టలేం…
మన వినోదచానెళ్ల ప్రోగ్రాములన్నీ సినిమా సెంట్రికే… అవే పాటలు, అవే డాన్సులు, అవే స్పూఫులు, అవే అనుకరణలు… సినిమాకు ఓ అనుబంధ పరిశ్రమ అన్నట్టుగా ఉంటయ్… మ్యూజిక్ ప్రోగ్రాం అంటే సినిమా పాటలు… ఏ రియాలిటీ షో చూసినా సినిమా పాటలకు గెంతులు వేస్తూ కంటెస్టెంట్లు, గెస్టులు రావాలి… టీవీలకు సొంతదనం ఏమీ ఉండదు… జస్ట్, అవి రికార్డింగ్ డాన్స్ ట్రూప్స్… చివరకు సీరియళ్లలో కూడా సినిమా పాటలే… బ్యాక్ గ్రౌండ్ నుంచి వినిపిస్తూ ఉంటయ్…
పత్రికలు కూడా విమర్శ, సమీక్షల జోలికి వెళ్లవు… కానీ మరీ టీవీల్లాగా భజన… కీర్తన… ఆలాపన… కంపేరిటివ్‌గా కాస్త తక్కువే… ఏదో స్పాట్ కవరేజీకి ప్రాధాన్యం ఇస్తాయి… అయితే ఎప్పుడూ పెద్దగా సినిమా వార్తల మీద ఫోకస్ పెట్టని నమస్తే తెలంగాణలో ఓ వింత వార్త కనిపించింది… ఓ అన్-ప్రొఫెషనల్ ట్రాన్స్‌లో రాసి, అదే ట్రాన్స్‌లో పేజీలో పెట్టేసి, సేమ్ ట్రాన్స్‌లో పేజీల్ని పాస్ చేసినట్టుగా ఉంది అది…
Ads
వార్త శీర్షికే ‘వెండి వెలుగుల సితార’…. ఫాఫం, ఇప్పుడే కదా తెరపైకి వస్తోంది, అదీ సరదాగా… మహేష్ బాబు అభిమానులకు చిన్న అట్రాక్షన్… అంతేతప్ప అప్పుడే వెండి వెలుగులనే పదాల దాకా ఎందుకు బ్రదర్..? పైగా లీడ్ చూడండి… వేవేల వెలుగుల తారకలా, వెండితెరపై కొంగొత్త కాంతుల్ని వర్షించింది అగ్రహీరో మహేష్ బాబు ముద్దుల తనయ సితార… వామ్మో… జక్కన్న పుట్టిన కాలంలో జర్నలిస్టుగా పుట్టినందుకు తెగ మురిసిపోయిన ఆ జర్నలిస్టు ఈ సితార అభిమాన జర్నలిస్టు ముందు ఎందుకూ కొరగాడు ఫాఫం …
చూడముచ్చటైన నృత్యరీతులతో వీక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిందట… చక్కటి ఈజ్‌తో లిటిల్ ప్రిన్సెస్ డాన్స్ చేసిందట… అప్పుడే లిటిల్ ప్రిన్సెస్ అని పేరు కూడా పెట్టేశారా..? ఫాఫం, చిన్నపిల్ల… అప్పుడే మునగచెట్లు ఎక్కించకండిర భయ్… అసలే వ్యక్తిపూజకు అడ్డాలు మన టీవీలు, సినిమాలు… ఇప్పటికీ మహేష్ బాబు గురించి రాసేటప్పుడు కొందరు ప్రిన్స్ అని రాస్తుంటారు, బాలయ్య గురించి రాస్తే యువరత్న అని రాస్తుంటారు… నవ్వొస్తుంటుంది… ఈ వార్త చదివి నవ్వొచ్చినట్టుగానే…!!
Share this Article