కొన్ని అంతే… నవ్వొస్తయ్… నవ్విస్తయ్… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం రాసుకునే కొత్తపలుకు కూడా కొన్నిసార్లు కామెడీ… ఈటీవీ జబర్దస్త్ కూడా పనికిరాదు… తను బేసిక్‌గా తెలుగుదేశానికి కలంకార్మికుడు… పర్లేదు, ఆ సేవలో మునిగిపోతే ఎవరికీ అభ్యంతరం లేదు… తను దాచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు కాబట్టి… కడుపులో ఒకటి, ముసుగు మరొకటి అన్నట్టుగా ఉండటం లేదు కాబట్టి… కాకపోతే ఆ రాతల్లో కాస్త తర్కం, హేతువు గట్రా ఉంటే ఇంకా బాగుండేది… ఊరికే అశ్శరభ శరభ అని సాక్షిలాగే ఊగిపోతే ఎలా..?
హేమన్నాడో తెలుసా తాజాగా..? ఎప్పట్లాగే జగన్ మీద శోకాలు… అయితే ఓచోట ఏం రాశాడంటే… ‘‘బీజేపీకి వోట్లు లేవు, కానీ రాబోయే ఎన్నికల్లో జగన్ అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు బీజేపీ ఉపయోగపడుతుంది కాబట్టి జనసేన-టీడీపీ కలిసి బీజేపీని కలుపుకుంటాయి’’.., హహహ… అక్కడికి టీడీపీతో కలవడానికి బీజేపీ ఏదో ఏడుస్తున్నట్టు… పవన్ కల్యాణ్ మాత్రమే తమకు దిక్కు అంటూ పాహిమాం పాహిమాం అని వేడుకుంటున్నట్టు…!!
అక్కడికి బీజేపీకి, జగన్‌తో ప్రాబ్లం ఏముందిప్పుడు..? అంత యమర్జెంటుగా టీడీపీతో జతకట్టే అవసరం ఏముంది..? జతకడితే తనకు వచ్చేదేముంది..? నిజాలు కొన్ని మరిచిపోతే ఎలా..? తనకు అలవాటైన రీతిలోనే మోడీకి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మూడునాలుగేళ్లయింది కదా… అంతకుముందే గోద్రా అల్లర్ల వేళ మోడీని పులుసులో ఈగలాగా తీసిపారేశాడు కదా… మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నతరువాత, ఎక్కడ మోడీ పగబట్టి జైలులో వేయిస్తాడో అని భయంతో మళ్లీ మోడీని ప్రసన్నం చేసుకోవడానికి నానాపాట్లూ పడుతున్నాడు కదా… ఐనాసరే, మోడీ, అమిత్ షా తనను మైళ్ల దూరంలోనే నిలబెట్టేస్తున్నారు కదా…
Ads
మరి అలాంటప్పుడు పవన్ కల్యాణ్ చెప్పగానే, జీహుజూర్ అంటూ చంద్రబాబును పిలిచి అలుముకుని ఆనందబాష్పాలు రాలుస్తారా మోడీ, అమిత్ షా… రేప్పొద్దున చంద్రబాబును నమ్మేసి, జతకలిసి, జగన్‌ను బంగాళాఖాతంలో కలిపేసి, కుర్చీ ఎక్కిస్తారు సరే… ఆ వెంటనే చంద్రబాబు మళ్లీ రెండు పెద్ద కత్తుల్ని ఇటు మోడీ వెన్నులో, అటు పవన్ వీపులో పొడిచేస్తే… అప్పుడెవరికి చెప్పుకుని ఏడుస్తారు..? అసలు అంత తీట ఏముంది..? హహహ, నా గురించి మీకు తెలియంది ఏముంది బ్రదర్స్ అని హిరణ్యకశిపుడిలా వికటాట్టహాసం చేస్తే మోడీ, పవన్ కలిసి బావురుమనాలా..? మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి, ఎన్నికలు అయిపోగానే సోనియాకు కూడా వెన్నుపోటే కదా చివరకు…!!
పోయింది, నాశనమైపోయింది, జగన్ మీద ప్రజల్లో ఛీత్కారం పెరిగిపోయింది అని రాధాకృష్ణ ఉవాచ… కావచ్చు… జగన్‌లు వస్తుంటారు, పోతుంటారు… ఇవి రాజకీయాలు… ఎవరూ శాశ్వతం కాదు… ప్రజలు నిజంగానే కోపగిస్తే పోతేపోతాడు… తనేమీ అతీతుడు కాదు… అయితే తెలంగాణలో షర్మిల పార్టీ, ఆంధ్రాలో రాబోయే బ్రదర్ అనిల్ పార్టీ జగన్‌ను దెబ్బతీయడానికి అని రాధాకృష్ణ నమ్మడమే ఓ చిత్రం…
జగన్, షర్మిల నడుమ ఆస్తి తగాదాలు ఉన్నాయట, జగన్ గనుక అవి పంచిస్తే ఇక అనిల్ పార్టీ పెట్టడట… ఓహో, ఇదంతా ఆస్తుల పంచాయితీయా..? అంతకుమించి ఇంకేమీ లేదా..? నిజానికి ఆ రెండు పార్టీల వెనుక ఎవరున్నారో, ఎవరు వదులుతున్న బాణాలో, ఏ రాజకీయ వ్యూహాలు దాగున్నాయో తెలుసుకోలేడా ఈ జగమెరిగిన జర్నలిస్టు..?!
Share this Article