నో డౌట్… ఎస్పీ బాలు రేంజుకు పాడగలిగే గాయకులు లేకపోవచ్చుగాక… బాలు అంటే బాలు… అంతే… కానీ తనను సరిగ్గా అనుకరించగలిగి, తనకు ఎంతోకొంత దగ్గరకు వెళ్లగలిగి, పాడగలిగేవాళ్లే లేరా ప్రస్తుతం..? సరే, లేరనే అనుకుందాం… కానీ ఒరిజినల్ ఒరిజినలే… ఒక పాటను రీమిక్స్ చేసినప్పుడు అచ్చు ఒరిజినల్‌లాగే ఉండాలని ఏముంది..? రీమిక్స్‌లో కొత్తదనం ఉండాలి కదా… ఆ పాతదనమే ప్రదర్శించే పక్షంలో ఆ పాత పాటనే వాడేసుకుంటే పోలా..?
ఈ ప్రశ్నలు ఎందుకొస్తున్నాయంటే… జూనియర్ ఎన్టీయార్, రాంచరణ్‌లతో ఎంఎంకీరవాణి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కోసం ఓ చిట్‌చాట్ వీడియో రిలీజ్ చేశారు కదా… అందులో ఓ చిన్న ప్రస్తావన వచ్చింది, ఏమిటంటే..? చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో బంగారు కోడిపెట్ట వచ్చెనండీ పాట ఉంది కదా… దానికి కీరవాణే సంగీతం… సూపర్ డూపర్ హిట్ సాంగ్… మొదట చేసిన ట్యూన్ వేరు… చిరంజీవి దాన్ని విని, ఇది నేను డాన్స్ చేయడానికి వీలుగా లేదని రిజెక్ట్ చేశాడు… అంటే స్లోగా ఉందని…
తనే కొన్ని హింట్స్ ఇచ్చి, ఈ స్పీడ్ ఉంటే బాగుంటుందని చెప్పాడు… ఇక తప్పేదేముంది..? వేరే ట్యూన్ చేయాల్సి వచ్చింది… తరువాత మగధీర సినిమా కోసం ఈ పాట రీమిక్స్ చేశారు… దానికీ సంగీతం కీరవాణే… ఈ చిట్‌చాట్‌లో కీరవాణి రాంచరణ్‌ను అడిగాడు… నీకు పాత వెర్షన్ ఇష్టమా..? కొత్త వెర్షన్ ఇష్టమా అని… నాకు పాత వెర్షనే ఇష్టం అన్నాడు రాంచరణ్… అప్పుడు కీరవాణి ఏమన్నాడంటే… ఆ పాటలో అప్ అప్ హేండ్సప్ అనే పదాల్ని మనవాళ్లు ఎవరూ అనలేకపోయారు… నేనూ ట్రై చేశాను, రాలేదు… ఆ పవర్ రావడం లేదు…
Ads
చివరకు పాత పాటలోని బాలు వాయిస్ ఆమేరకు కట్ చేసి, కొత్త పాటలో కలిపేశాం… తరువాత బాలు అడిగాడు నన్ను, ఇది నా వాయిస్‌లాగే ఉందేమిటి అని… మీదేనని అంగీకరించాల్సి వచ్చింది…. ఇదీ కీరవాణి చెప్పుకొచ్చిన ముచ్చట… ఆ పాటలో అప్ అప్ హేండ్సప్ పదాలే కాదు… చెక్ చెక్ నీ లక్, దిక్ దిక్ డోలక్, చేస్తా జిప్ జిప్ జాకప్, షిప్ షిప్ షేకప్, స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో… ఇలా చాలా పదాల్ని వాడారు… వాటికి అర్థాలేముంటయ్… ఏదో ఫ్లోలో ఆ ట్యూన్‌లో పాడేసుకోవడానికి… అంతే…
అయితే ఇక్కడ ప్రశ్న పాట గురించి కాదు… అలాంటి సవాలక్ష పాటలు ఇండస్ట్రీలో వస్తుంటయ్… కానీ ఒక దివంగత గాయకుడిని అందుకునేలా కాకపోయినా, ఓ మోస్తరుగానైనా ఇలాంటి జిప్ జిప్ పదాల్ని పాడగలిగేవాడే ఇప్పుడు ఇండస్ట్రీలో లేడా..? అదీ ఓ ప్రముఖ సంగీత దర్శకుడు చెబుతుంటే ఆశ్చర్యమేసింది… కారుణ్య, శ్రీకృష్ణ, శ్రీరామచంద్ర, రేవంత్, ధనుంజయ్, హేమచంద్ర,.. ఎవరూ పనికిరాలేదా..? హవ్వ… ఈ పాటను సినిమా కోసం పాడింది మాత్రం రంజిత్… ఫాఫం, తెలుగు మేల్ సింగర్స్…!! ఇండియన్ ఐడల్స్ కంచుఢక్కాలు పగులగొడతారు గానీ ఈ చిన్నపాటి హమ్ చేయలేకపోయారా..? హవ్వ…!! ఫాఫం, చాలా పాటలు కీరవాణే స్వయంగా పాడుకోవాల్సి వస్తోంది…!!
Share this Article