విలేఖరి అంటే ఎవరు..?
అలా అడుగుతావేం..? వార్తలు రాయువాడిని విలేఖరి అంటారు కదా…
అది ఒకప్పుడు… వార్తలు రాయకపోయినా సరే, రాయలేకపోయినా సరే, విలేఖరి నిర్వచనం మారిపోయింది…
Ads
అదెలా..? ఫాఫం, వార్తలు రాయాలి కదా…
పిచ్చివాడా… పేపర్ కాపీలు అమ్మాలి, జీవిత చందాలు కట్టించాలి, యాడ్స్ సేకరించాలి, పెద్దలు అడిగిన పనులు చేసిపెట్టాలి, డిజిటల్ ఎడిషన్ను వాట్సప్ గ్రూపుల్లో షేర్లు చేయాలి, అంతేతప్ప వార్తలు ఎవడికి కావాలి..?
మరి వార్తలు..?
ఏముంది..? వాట్సపుల్లో కనిపించేవి కాస్త అటూఇటూ మార్చి పంపించేసి చేతులు, మెసేజులు దులుపుకుంటే సరి… ఆఫీసుల్లో ఏవో తిప్పలు పడి వాటిని పేజీల్లో పెట్టేస్తారులే…
పోనీలెండి… కనీసం ఈనాడు విలేఖరులకైనా ఆ బాధల్లేవు ఫాఫం…
ఎవరన్నారు..? మొన్నమొన్నటిదాకా ఈటీవీ భారత్ యాప్స్ టార్గెట్లు పెట్టి చావగొట్టారు కదా… ఇప్పుడేమో లైబ్రరీలకు ఉద్దరించాలట…
నిజమే… ఇప్పుడు అర్జెంటుగా ఈనాడు విలేఖరులు తమ ప్రాంతాల్లో ఉన్న లైబ్రరీలకు పుస్తకాలు, కుర్చీలు, టేబుళ్లు, చేతనైతే డెస్క్ టాపులు గట్రా ఇప్పించాలట… ఎందుకు..? కేసీయార్ అర్జెంటుగా అత్యంత భారీ ఎత్తున ఉద్యోగాల్ని నింపేస్తున్నాడు కదా… (అనుమానంగా చూడకండి…) నిరుద్యోగుల వయోపరిమితిని పెంచేశాడు కదా… ఎంత వయస్సొచ్చినా సరే పరీక్షలు రాయొచ్చు… ఇన్నేళ్లు కొలువంటే చాలు, కొట్టేట్టుగా కనిపించారు కాబట్టి సబ్జెక్టు పుస్తకాలు గట్రా అటక మీద పారేశారు అందరూ…
ఇప్పుడు చదవాలి కదా… పరీక్షలు రాయాలి కదా… అదుగో అలాంటివాళ్ల కోసం ఈనాడు విలేఖర్లు పూనుకుని, లైబ్రరీలకు అవన్నీ సమకూర్చాలన్నమాట… దాంతో జనమంతా ఈనాడును వేనోళ్ల పొగడాలట… అది సరే, అసలు నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయో ఎవరూ చెప్పలేరు, పైగా అన్నీ టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలు కావు… ఏ శాఖకు ఆ శాఖే బోర్డులు పెట్టేసుకుని నిర్వహిస్తుంది… ఏ సిలబసో తెలియదు…
పత్రికలు ఆల్రెడీ హైప్ క్రియేట్ చేస్తున్నయ్… కాంపిటీటివ్ పరీక్షల తీరూతెన్నూ మీద యమర్జెంటుగా బోలెడు ఇంటర్వ్యూలను పబ్లిష్ చేస్తున్నయ్… కోచింగ్ సెంటర్లు మళ్లీ కుర్చీలు దులిపి, నాలుగు ఊదుబత్తీలు వెలిగించి, ఫీజుల దందాలు మొదలుపెట్టేస్తున్నయ్… అందుకని ఈనాడు కూడా ఉడతా భక్తిగా వాళ్లను ఉద్దరించాలన్నమాట…
ఇదంతా సరే, కానీ ఓ డౌట్… ఆంధ్రాలోనో, దేశంలో ఇంకెక్కడో ఏదైనా ఉపద్రవాలు వాటిల్లితే ఈనాడు వేంఠనే తను కొంత విరాళం ప్రకటించేసి, పాఠకుల నుంచి చందాలు వసూలు చేస్తుంది… అఫ్కోర్స్, దుర్వినియోగం ఆరోపణల్లేవు… కానీ తెలంగాణలో ఏం జరిగినా అది స్పందించదు… పోనీ, ఇప్పుడు తను కొంత రుణం తీర్చుకోవచ్చు కదా… కొంత డబ్బు తను సమకూర్చి, పాఠకుల నుంచి సేకరించి, గ్రామీణ ప్రాంతాల లైబ్రరీలకు బల్లలు, కుర్చీలు, డెస్క్ టాపులు, పుస్తకాలు సమకూర్చవచ్చు కదా… మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని మోసినందుకు తెలంగాణ సమాజానికి ఈమాత్రం చేయలేరా..? మీ విలేఖరులను గెదిమి జనం మీదకు తోలడం దేనికి..?!
Share this Article