అసలే నక్క రకరకాల నొప్పులతో మూలుగుతోంది… దానిమీద తాటిపండు పడింది… ఎండిన ఓ తాటికొమ్మ దభీమని నెత్తిమీద పడింది… తలదాచుకునే చోటు లేదు ఎక్కడా, ఈలోపు పెద్ద పెద్ద వడగళ్లు పడసాగాయి… ఎలా ఉంటుంది..? అచ్చం మన పత్రికల ప్రస్తుత దురవస్థలా ఉంటుంది… మొన్నమొన్నటిదాకా మీడియా హౌజులు శోకాలు పెట్టాయి… ఇప్పుడు ఏడిచే ఓపిక కూడా లేదు వాటికి… బ్యాడ్ నుంచి వర్స్ స్టేజీకి చేరిపోయాయి వాటి కష్టాలు… ప్రత్యేకించి ఉక్రెయిన్ మీద రష్యా వేస్తున్న బాంబులు, మిస్సయిళ్లు మన పత్రికాఫీసుల మీద కూడా పడుతున్నయ్…
ఒక్క ముక్కలో చెప్పాలంటే… అసలే సంక్షోభంలో ఉన్న పత్రికలు మరింతగా కూరుకుపోతున్నయ్… ఇప్పుడున్న కరోనా అనంతర కష్టాల్లో పాఠకుడు కవర్ ప్రైస్ పెంచినా చెల్లించే స్థితిలో లేడు, పత్రికల్ని కొనడమే ఆపేస్తున్నాడు, డిజిటల్ ఎడిషన్లకు మళ్లిపోతున్నాడు వేగంగా… పోనీ, యాడ్ టారిఫ్ పెంచితే ఇప్పుడున్న ప్రకటనల స్పేస్ కాస్తా ఇంకా పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది… ఇప్పటికే టైమ్స్, ఈనాడు వంటి పెద్ద పత్రికలు సైతం అడ్డగోలు రాయితీలు ఇస్తూ తమ రెవిన్యూ ఘోరంగా పడిపోకుండా కాపాడుకునేందుకు కష్టపడుతున్నయ్…
అసలు కొత్తగా వచ్చిన కష్టాలేమిటీ అంటారా..? కాస్త వివరంగా చెప్పుకుందాం… కరోనాకు ముందు టన్నుకు 450 డాలర్లు ఉండేది ఇంపోర్టెడ్ న్యూస్ ప్రింట్ ధర… ఇప్పుడది ఏకంగా 950 డాలర్లకు పెరిగింది… 1050-1100 అవుతుందని అంటున్నారు… ఐనా దొరకడం లేదు… ఎందుకు..?
Ads
- ఉక్రెయిన్‌తో యుద్ధం, ఆంక్షల కారణంగా బోలెడు రష్యన్ పోర్టుల్లో కార్యకలాపాలు స్థంభించిపోయాయి… షిప్పింగ్ కంపెనీలు కొత్త ఆర్డర్లు పూర్తిగా నిలిపివేశాయి… అసలు మనకు 45 శాతం ఇంపోర్టెడ్ న్యూస్‌ప్రింట్ రష్యా నుంచే రావల్సింది…
- న్యూస్ ప్రింట్ తయారీకి 30 శాతం ఖర్చు ఇంధన వ్యయమే… ప్రపంచవ్యాప్తంగా సహజవాయువు, బొగ్గు ధరలు పెరిగాయి… దాంతో న్యూస్ ప్రింట్ తయారీ ఖర్చు కూడా పెరిగిపోయింది…
- మనకు 60 శాతం దాకా గ్లాసీ న్యూస్ ప్రింట్ ఫిన్‌లాండ్ నుంచి రావాలి… అక్కడ యూపీఎం అనే పెద్ద తయారీ పరిశ్రమలో వర్కర్స్ సమ్మెకు దిగారు…
- వేక్సిన్లు తప్పనిసరిగా వేసుకోవాలన్న ప్రభుత్వ నిబంధనల్ని వ్యతిరేకిస్తూ కెనడాలో ట్రక్కుల యజమానులు సమ్మెకు దిగారు… మన 40 శాతం దిగుమతులు అక్కడి నుంచే… అదీ డిస్టర్బ్ అయిపోయింది…
ఎప్పటికప్పుడు కరోనా లాక్ డౌన్లు పెడుతున్నందున ప్రపంచవ్యాప్తంగా రవాణారంగం అస్తవ్యస్తంగా మారిపోయింది… ప్రత్యేకించి పోర్టుల యాక్టివిటీ దారుణంగా తగ్గిపోయింది… సప్లయ్ చెయిన్ దెబ్బతిని ఫ్యాక్టరీలు మూసుకోవాల్సి వస్తోంది… ప్రపంచవ్యాప్తంగా 2017లో 2.38 కోట్ల టన్నుల సామర్థ్యం ఉండగా ఇప్పుడది 1.36 కోట్ల టన్నులకు పడిపోయింది… సముద్ర రవాణా ఛార్జీల భారం ఈ రెండుమూడేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది…
చైనా సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ షెంజెన్ కూడా తాజా లాక్ డౌన్‌తో మూతపడింది… ఉక్రెయిన్, బెలారస్, రష్యా తదితర ప్రాంతాలకు రైల్ రవాణా కూడా తాజా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్నది… పోనీ, ఇండియాలో ఉత్పత్తి సంగతేమిటీ అంటారా..? అదీ అంతే… చాలా కంపెనీలు న్యూస్ ప్రింట్ తయారీ ఆపేసి ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేస్తున్నయ్… ఈ-కామర్స్ పరిమాణం పెరిగింది, డిమాండ్ పెరిగింది… పైగా న్యూస్ ప్రింట్ తయారీకి అవసరమైన పాత రద్దీ పేపర్ కూడా ఆశించినంతగా దొరకడం లేదు… రీసైకిల్డ్ ఫైబర్ కొరత…
ఇదంతా న్యూస్ ప్రింట్ కష్టాల కథ… దినపత్రిక తయారీలో 40, 50 శాతం ఖర్చు అదే కదా… ఇక ఇంకులు, ప్లేట్ల ఖర్చు పెరిగింది… ప్రపంచవ్యాప్తంగా కరోనా అనంతరం అన్ని ధరలూ పెరిగాయి… ఆ ప్రభావం పత్రిక రవాణా వ్యయం మీద కూడా పడింది… అరయగ కర్ణుడీల్గె అన్నట్టుగా… ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ… మల్టిపుల్ దెబ్బలు… ఇప్పటికే పలు పత్రికలు మరీ స్ట్రిక్టుగా పది, పన్నెండు పేజీలకు పరిమితమయ్యాయి… త్వరలో ఎనిమిది పేజీలకు కూడా కుదించుకుపోవచ్చు, మరీ చిన్న పత్రికలైతే షట్టర్లు దింపాల్సి రావచ్చు… ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు… ఎవరూ ఇప్పటికిప్పుడు చేయగలిగింది కూడా ఏమీలేదు… జై డిజిటల్ ఎడిషన్స్… జై జై వాట్సప్ ఎడిషన్స్…
Share this Article