MOHANA – a mellifluous raga
————————————————–
Ads
ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రమూ,
అన్ని రంగాల్లో అభివృద్ధీ దేనికోసం?
ఎక్కడికీ ప్రయాణం? దీని లక్ష్యం ఏమిటి?
సింపుల్ గా ఒక్క వాక్యం తో సమాధానం చెప్పారు పెద్దలు.
MORE HAPPINESS TO PEOPLE AND HAPPINESS TO MORE NUMBER OF PEOPLE
శాస్త్రీయ సంగీతం, సినీ గీతాలు, జానపదాలు … ఏవైనాసరే, పాట ఆ పని ఎప్పటినించో చేస్తోంది. అశేష జనానికి ఆనందాన్ని పంచి యిస్తూనే వుంది.
నానాటికీ యాంత్రికం అయిపోతున్న, నిరాశతో నిండిపోతున్న, ఎర్రని ఇసుక ఎడారుల్లా ఎండిపోతున్న జనం బతుకుల మీద, పాట – పల్లవై, చరణమై మంచుపూల వాన కురిపిస్తూనే వుంది.
1990 ప్రాంతాల్లో విజయవాడ క్షేత్రయ్య కళాక్షేత్రంలో పర్వీన్ సుల్తానా కచేరీ అంటే నేను, మా ఆవిడ నళిని వెళ్ళాం.. ఆమె ఒక ట్రాన్స్ లో, ఒక తన్మయంతో పాడతారు కదా! మూడు గంటలు అలాగే మైమరిచి విన్నాం. కచేరీ అయిపోగానే గబగబా బైటికొచ్చి, కార్ పార్కింగ్ దగ్గర మాటు వేశాం. అనుకున్నట్టుగానే.. కారెక్కడానికి అక్కడికే వచ్చారు పర్వీన్. పలకరించి, పరిచయం చేసుకున్నాం. ఈరోజు లండన్ లో, మర్నాడు పారిస్ లో కచేరీ చేసే ఆమె ఎంతో మామూలుగా, హాయిగా మాట్లాడారు. అంత గొప్ప ఆర్టిస్ట్ అయినా ఎలాంటి భేషజమూ లేదు. కొద్దిసేపు మాట్లాడి, ఒక వెన్నెల నవ్వు నవ్వి, వెళిపోయారావిడ. మేం ఆనందంతో తబ్బిబ్బు అయ్యాం.
*
వోసారి హైదరాబాద్ లో ఆర్టిస్ట్ మోహన్, సంగీతం స్పెషలిస్ట్ మృణాళిని, జర్నలిస్టులు తల్లావజ్ఝుల శివాజీ, జొన్నలగడ్డ రాధాకృష్ణ వెళ్లి పర్వీన్
సుల్తానాని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు మోహన్ ఇలా రాశాడు.
“…. కమిన్ అంటూ తలుపు తీసింది ఆవిడ. అరోరా బొరియాలిస్ లాగా జిగేల్మంది. ఆవిడొక మార్బుల్ మేజిక్. ఫ్లారెన్స్ శివార్ల నుంచి తవ్వితీసిన పాలరాయి వొళ్ళు. పైన నల్లటి సల్వార్ కమీజ్ మీద తెల్లగీతల డిజైన్. ముందుకి దూసుకొచ్చే ముక్కు, వెనక్కి అలల్లా కదిలి తెరల్లో కరిగిపోయే జుట్టు. భగవంతుడు ఈవిణ్ణి చెక్కడానికి నానా కష్టాలూ పడివుండాలి. ఈవిడ ఎంతోమంది కుర్ర సన్నాసుల్ని అష్టకష్టాలూ పెట్టివుండాలి….”
*
ఒకసారి రవీంద్రభారతిలో పర్వీన్ సుల్తానా కచేరీ ముగిసిపోతున్నపుడు చిన్న gap లో – ఎక్కడో వెనక సీట్లలో ఫ్రెండ్స్ తో కూర్చునివున్న నేను, ‘భవానీ….’ అని గట్టిగా అరిచాను. తలెత్తి చూసి, అప్రూవల్ గా నవ్వి, పర్వీన్ ఆ కీర్తన ఆలపించారు. ఆ పాట కెరటాల మీద రవీంద్ర భారతి పువ్వుల పడవై తేలియాడింది.
ఇంతకీ మోహన రాగం గురించి రాద్దామని కూర్చుని పర్వీన్ మాయలో పడ్డాను. వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తిపోతుంది – అని శ్రీశ్రీ అన్నట్టు, పర్వీన్ సుల్తానా పాటంటే నేను మహదానందంగా దారి తప్పిపోతాను.
***
మోహన సుతిమెత్తని,మృదువైన రాగం. 28వ మేళకర్త హరికాంభోజి కి జన్యురాగం అంటారు. హిందుస్తానీ సంగీతంలో మోహన రాగాన్ని భూప్, లేదా భూపాలి అని పిలుస్తారు. ‘నిన్ను కోరీ… వర్ణం, సరిసరి కలిసేనే నయనం…’ చిత్ర పాడిన ఘర్షణ సినిమా పాట మోహనకి మంచి ఉదాహరణ.
మోహన రాగం విశ్వరూప సాక్షాత్కారం కావాలంటే పాండురంగ మహత్యంలోని ‘జయకృష్ణా ముకుందా మురారీ ..’ పాట వింటే సరిపోతుంది. మన ఘంటశాల గొంతు తడాఖా కూడా అవగతం అవుతుంది. మోహన బాగా flexible. సంగీత దర్శకుడు చెప్పిన మాట వింటూ ఎన్ని వొంపుసొంపులు పోతుందో… రాగాల గారాల బంగారుతల్లి మోహన!
*
దశాబ్దాల తరబడి జనం తన్మయంతో పాడుకుంటున్న సూపర్ హిట్ సినీగీతాలెన్నో మోహన రాగానికి పుట్టిన బిడ్డలే! మనందరి All time favourite మాయాబజార్ లోని లాహిరి లాహిరి లాహిరిలో ఈ రాగమే. లీల, ఘంటశాల పాడారు. ఘంటసాలే పాడిన గుండమ్మకథలోని ‘మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటినే…’ మోహన రాగ పరిమళమే! తెనాలి రామకృష్ణలో సుశీల ఎప్పటికీ నిలిచి వెలిగేలా పాడిన జయదేవుని ఇష్టపది ‘చందన చర్చిత నీల కళేబర…’ కూడా ఆ తోటలో పూసిన పువ్వే!
***
సంగీత దర్శకవి పెండ్యాల నాగేశ్వరరావు మనసుకి మల్లెతీగ చుట్టుకున్నట్టే పాట కడతారు. ఆయనవే వో మూడు పాటలు :
‘మహామంత్రి తిమ్మరుసు’లో మోహనరాగమహా మూర్తిమంతమాయే… సుశీల.
జగదేకవీరుని కథలో ‘అయినదేమో అయినదీ ప్రియ గానమేదే ప్రేయసీ…’
ఏదో మంత్రం వేసినట్టుగానే, మత్తు చల్లినట్టుగానే పాడారు సుశీల, ఘంటసాల.
‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ లో లీల, ఘంటసాల – మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే నవవసంత రాగములో … అంటూ కొత్తపూల నెత్తావుల్లోకి మనల్ని నడిపించిందీ ఆ మృదుమోహన రాగమే!
***
ఎస్ రాజేశ్వరరావు అనేవాడొక అరివీర భయంకరుడు. ఎంత కవిత్వం హృదయంలో పొంగిపొర్లకపోతే, ఇంత అందమైన బాణీలు కడతాడు! ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమాలో వినిపించని రాగాలే, కనిపించని అందాలే, కలలే అలలై విరిసే… ఇంకెవరు సుశీలే!
‘నమ్మిన బంటు’ లో, చెంగు చెంగునా గంతుకులు వేయండి … జాతివన్నె బుజ్జాయిల్లారా, నోరులేని తువ్వాయిల్లారా…’ అంటూ సుశీల సమ్మోహనంగా పాడింది. సుస్వరాల సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు హుషారైన బాణీ కట్టారు.
‘ఆత్మీయులు’ చిత్రంలో ఆమె పాడిందే – మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నొ చెలరేగే … సుశీల – ఆ తేనెగొంతుతో flawless గా, భావం perfect గా బట్వాడా అయ్యేలా, హృదయతంత్రులు తెగిపోయేలా పాడుతుందికదా, దొంగముండ!
అర్జెంటుగా మద్రాస్ వెళిపోయి, సుశీలని కిడ్నాప్ చేసి, తిరుమలకొండ మీద పెళ్లి చేసుకుందామని కొన్ని లక్షల మంది అనుకుని వుంటారు నలభై, యాభై ఏళ్ళ క్రితం!
నేనూ అలాగే ఆవేశపడి, పాడుతుందికదాని నళినీని పెళ్లి చేసుకుని దొరికిపోయాను ఒక జీవితకాలం! కనుక గానకోకిల అని మురిసిపోయి మొదటి పెళ్ళికో, రెండో పెళ్ళికో రెడీ అయిపోకండి! చాలా డేంజర్! (ఇక్కడ మీకు మధుర గాయని సునీత గుర్తొస్తే నా పూచీ లేదని గమనించగలరు)
*
‘మిస్సమ్మ’లో ఏ. యం. రాజా పాడిన – తెలుసుకొనవె యువతీ, అలా నడుచుకొనవె యువతీ…’ మోహనరాగపు మెరుపుతీగ. ఆ పాటలో, మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని… అనే సందేశం చాలా బావుంటుంది. విప్రనారాయణలో ఏఎం రాజా పాడిన ‘మధుర మధురమీ తీయని రేయి…’ ఇదీ మోహనరూపమే!
***
ఇళయరాజా మేజిక్ లో వో రెండు పాటలు :
సాగరసంగమంలో శైలజ, బాలు ఇరగదీసిన
“వే..వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే .. ఆ ముద్దూ గోవిందుడే..”
‘స్వర్ణకమలం’లో సుశీల గాలిలో తేలిపోయేలా పాడిన “కొత్తగా రెక్కలొచ్చెనా, మెత్తగా రేకు విచ్చెనా …”
ఈ రెండూ మోహనరాగం కవలపిల్లలే!
రెండూ కే విశ్వనాథ్ సినిమాలే!
***
నీ వూహతోనే పులకించిపోయే ఈ మేను నీదోయీ … అని మోహంతో కంపించిపోయేలా.. ‘లీలా’మృతధారలు కురుస్తున్నపుడు… ఈనాటి ఈ హాయీ, కలకాదోయి నిజమోయీ .. అని ఆ గొంతు వూరిస్తున్నపుడు – హిమాలయ పర్వత సానువుల్లో నేనొక అరుదైన పూలమొక్కనై విరబూస్తాను… నల్లని మబ్బులగుంపు చివర వెండి అంచునై వెలిగిపోతాను. చిరునవ్వుతో రుక్మిణిని రథం ఎక్కించుకు వెళిపోయే శ్రీకృష్ణుణ్ణి అయిపోతాను. (కృష్ణపాండవీయంలో కేఆర్ విజయని మాత్రమే!)
‘జయసింహ’ (1955) లో లీల, ఘంటసాలతో ఈ పాట పాడించిన మహాకవి పేరు టీవీ రాజు. మోహన రాగాన్ని జాజిపూల జలపాతంగా మార్చే విద్య నేర్చిన రాజు అతను! మరపు రాని ఈ గీతాన్ని రాసింది సముద్రాల రాఘవాచార్య ది గ్రేట్.
మంగమ్మ శపథం సినిమాలో టీవీ రాజే కట్టిన ఉర్రుతలూగించే బాణీ ‘ఈ రాజు పిలిచెను, రేరాజు నిలిచెను … ఈరేయి నీదే కదా, చెలీ నా రాణి నీవే కదా…’ మోహన లోనే మరింత అందం కోసం అన్యస్వరం చొప్పించినట్టున్నారు.
*
రాజన్ నాగేంద్ర : ‘సిరిమల్లె నీవే, విరిజల్లు కావే’ అని బాలసుబ్రమణ్యం ‘పంతులమ్మ’ని ప్రేమించినా…
ఆదినారాయణరావు : ఘనాఘన సుందరా, కరుణా రసమందిరా … అంటూ ‘భక్తతుకారం’ కీర్తించినా…
కేవీ మహదేవన్ : నను పాలింపగ నడచీ వచ్చితివా … అంటూ ‘బుద్ధిమంతుడు’ కృష్ణపరమాత్ముణ్ణి చూసి పరవశించిపోయినా సుతారమైన మోహనరాగాల మధురశ్రుతిలోనే!
***
హిందీ లో ఇంపైన, వినసొంపైన మోహన గీతాలు:
వొ మెరే షాహె ఖుబా, వొ మెరీ జానె జనాన ..
రఫీ, లవ్ ఇన్ టోక్యో, శంకర్ జైకిషన్
హే.. నీలె గగన్ కె తలే, ధర్తిక ప్యార్ పలే .. మహేంద్రకపూర్ – హమ్రాజ్
సాయొనార… సాయొనార వాద నిభావుంగీ సాయొనారా… లత – లవ్ ఇన్ టోక్యో
ఎ మేరా ప్రేమ్ పత్ర్ పడ్కర్ తుమే నారాజ్ న హోనా .. రఫీ – శంకర్ జైకిషన్, సంగం
దిల్ హూమ్ హూమ్ కరే, ఘబ్ రాయే ..
లత – భూపేన్ హజారికా, రుడాలి
జ్యోతి కలష్ ఝల్ కే … లత – సుధిర్ ఫడ్కే,
భాభీ కి చూడియా
దేఖ ఏక్ ఖాబ్ తో ఎ సిల్ సిలే హువే, దూర్ తక్ నిగాహ్ మె హై ఏ గుల్ ఖిలే హుయే..
లత, కిషోర్ – సిల్ సిలా – శివ్ హరి
చందా హై తూ, మేరా సూరజ్ హై తూ..
లత – ఎస్డీ బర్మన్, ఆరాధన
జిందగీ ఎక్ సఫర్ హై సుహానా, యహ కల్ క్యా హో కిస్నె జానా .. కిషోర్ – శంకర్ జైకిషన్, అందాజ్
ఇవన్నీ మోహనరాగ ప్రవాహంలోని గలగలలే…
పచ్చి వ్యాపార సినీ సంగీతానికి గొప్ప గౌరవాన్ని యిచ్చిన అలనాటి అపురూప జ్ఞాపకాలే!
చివరి మాట :
‘… ఎక్కడో గుచ్చుకుంది చేప ముల్లు ,
సట్టిలో సరుకంతా నింపుకెళ్ళు…
… ఎత్తమంటావా , నన్నెత్తుకుంటావా … గుండెల్లోన గుబులవుతుందయ్యో … రత్తయ్యో… యోయో..
ఇలాంటి నీచాభిరుచితో అలరారే పాటల బురదలో కూరుకుపోకుండా కళ్యాణి, మోహన, భాగేశ్వరి లాంటి రాగాల్లోని పాటలు వింటే ‘మనసానంద నాట్యాలు చేయునే’ అని ఈ తరం కుర్రకారు గమనించిందనే వొక చిన్న ఆశ.
– TAADI PRAKASH —– 9704541559
Share this Article