…. రివ్యూయర్ :: Prasen Bellamkonda……… నిజంగా రాజమౌళి తెలుగు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళారా. తెలుగు సినిమా స్ధాయిని ఎక్కడికో పెంచేసారా. అసలు ఇంకో లెవెల్ కు తీసుకెళ్లడం అంటే ఏమిటి. వెయ్యి స్క్రీన్ ల మీద ఆడించడమేనా. ఐదు వందల కోట్ల పెట్టుబడితో రెండు వేల కోట్లు రాబట్టడమేనా. పాన్ ఇండియా మూవీ అని పేరుపెట్టి అన్ని భాషల్లో రిలీజ్ చేసుకోవడమేనా. ప్రభుత్వాలను మంచి చేసుకుని టికెట్ రేట్లను నాలుగైదు రెట్లు పెంచుకుని సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమేనా. దాసరి నారాయణరావు వరుసగా 12 హిట్లు ఇచ్చాడు కనుక తను పదమూడు హిట్లివ్వాలనే ఆర్దిక ధ్యేయంతో వ్యాపారం చేయడమేనా. అంతే అయితే నిజంగానే రాజమౌళి తెలుగు సినిమాను కచ్చితంగా ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లినట్టే.
రివ్యూను స్పాయిలర్ చేద్దామన్నా చెప్పడానికేం లేదు. రామ్ చరణ్ ఎ. సీతారామరాజు. ఎన్టీఆర్ కొమురం భీం. ఈ నిజ పాత్రలకూ ఈ హీరోలకూ సంబంధమేమీ ఉండదు. సినిమా కథ 1920 లో జరుగుతూంటుంది. నిజ లెక్కలు కడితే సీతారామరాజు 1897లో పుట్టి 1924 లో మరణించాడు. అంటే కథా కాలానికి అతని వయసు 23 సంవత్సరాలు. కొమురం భీం 1901 లో పుట్టి 1940 లో మరణించాడు. అంటే కథా కాలానికి అతని వయసు 19 సంవత్సరాలే. చరిత్రలో వీళ్లిద్దరూ కలిసిన దాఖలాలెక్కడా లేవు.
మరీ అల్లూరి పోలీసుగా పని చేయడం ఏమిటి. అండర్ కవర్ ఆపరేషన్ నడపడమేమిటి. అల్లూరి ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్ లపై దాడులు చేసేవాడని చదువుకున్నాం కానీ ఏకంగా బ్రిటిష్ ఆయుధాగారాన్ని కొల్లగొట్టేందుకు పోలీసవతారం ఎత్తినట్టు మనకు తెలియదు. భీం గిరిజనుల కోసం బ్రిటిషర్లను ఎదిరించినట్టు తెలుసుకానీ ఒక చిన్నపాపను కాపాడడానికి గవర్నర్ హత్యకు పథకం పన్నినట్టు మనకు తెలియదు. సరే ఇదీ సినిమాటిక్ లిబర్టీయే అనుకుందాం. జాతీయోద్యమం ఏ భారతీయ భాషా సినిమాకైనా గొప్ప ముడి సరుకు. మూడార్లలో ఎంతసేపూ హీరోల ఎలివేషన్ మీద చూపే తప్ప కనీసం జాతీయోద్యమ స్పూర్తిని ప్రకటించే ఒక్క సన్నివేశం కూడా లేదు.
ఎన్టీఆరే పెంచి పోషించిన పులులూ సింహాలూ ఎన్టీఆర్ మీదే దాడి చేయడమేమిటి. వారానికి ఒక్క పూట భోజనం చేసే రాంచరణ్ జైల్లో సాలిటరీ సెల్ లో జిమ్ చేయడమేమిటి. ఇది కాదేమో సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం. సినిమాలో ఎక్కడా భావోద్వేగం పండించే సన్నివేశాలు లేవు. ఎన్టీఆర్ మరణ దండన సమయంలో పాట పాడడం మినహా మరెక్కడా ఎమోషన్ పలికే సన్నివేశం లేదు. ఇది కాదేమో తెలుగు సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం.
సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం అంటే దాని గౌరవం పెంచడం. సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం అంటే దాని ప్రయోజన విలువను పెంచడం. సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం అంటే దాని సామాజిక సాంస్కృతిక స్ధాయిని పెంచడం. సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం అంటే దాని సంస్కరణ వాద, భావోద్వేగాల మూలాలను మరింత పటిష్టం చేయడం. సినిమాను ఇంకో లెవెల్ కు తీసుకెళ్లడం అంటే సమాజానికి ఏది అవసరమో ఏది అవసరం కాదో తెలియచెప్పడం..ఇదంతా సోది అనుకుంటే ఓ నమస్కారం. అలా అనుకునే వాళ్ల కోసమే అయితే మూడార్ల గురించి ఏకవాక్య సమీక్ష…….. సప్పుడెక్కువ సరుకు తక్కువ…
Share this Article