Prasen Bellamkonda…… టూమచ్….. సినీ సమీక్షకు కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు మీరడానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. వాటిని కూడా దాటేసాడితడు. నిజం చెప్పాలంటే సినిమాను సమీక్షించినట్టుగా కాక రాజమౌళి మీద వ్యక్తిగత పగ పెట్టుకుని మూడార్లను వీధి కుళాయి దగ్గర తిట్టుకున్న పద్దతిలో వ్యాఖ్యానం చేసాడు. సినిమా బాగుండకపోతే దాన్ని విమర్శించడానికి చాలా పద్ధతులున్నాయి. ఆ పరిధి లోపల తిట్టొచ్చు. ఆ పద్ధతులను కాదని కూడా మర్యాదగా తిట్టొచ్చు. కానీ ఇతను మరీ మితిమీరాడు. భావ స్వేచ్చ అనేది ఇక్కడ వర్తించనంత మోతాదులో అతని భాష, భావం ఉన్నాయి.
తెలుగు స్టార్లు ఎలుగ్గొడ్లలా ఉంటారట. అందవికారులట. ఎంత కుసంస్కారం ఇతనిది. హిందీ వాళ్ళు అందంగా ఉంటారట. ఇటువంటి కూతలు ఇంకా చాలా ఉన్నాయి. అసలు సౌత్ సినిమా మీదనే ఇతనికి ద్వేషం ఉన్నట్టుంది. తెలుగు స్టార్లలో సీనియర్ ఎన్టీఆర్ ఎంత అందగాడో ఇతనికి తెలుసా. ఏఎన్నార్ ఎంతటి సుందరుడో ఇతనికి తెలుసా. అప్పటి శోభన్ బాబు, ఇప్పటి మహేష్ బాబు అందగాళ్లు కాదా.
అయినా నటనకు అందానికి పొంతన ఎలా. ఓంపురి సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఆ సోకాల్డ్ హిందీ రంగమే నానా మాటలన్నది. అతనెంత గొప్పనటుడో ఇప్పుడు తెలియందెవరికి. శత్రుఘ్న్ సిన్హాను మొదట్లో అచ్చం ఇలాగే ఎలుగ్గొడ్డు అన్నది. ఆ తరవాత అతనే స్టార్ కాలేదా. అమితాబ్ గొంతును పనికి రాదు పొమ్మన్న రేడియో స్టేషన్ మనకు తెలుసు కదా. ఉదాహరణలు బోలెడు. ఇంకా చాలా చెప్పొచ్చు.
Ads
ఇక్కడ చర్చ ఈ సమీక్షకుడి సంస్కారం గురించే. జూనియర్ ఏన్టీఆర్ అందవికారి అని నేను అస్సలు అంగీకరించడం లేదు, అనుకోవడంలేదు. అతని నటనా సామర్ధ్యం దరిదాపుల్లోకి రాగల హీరోలు హిందీలో ఎంతమంది ఉన్నారో ఈ సమీక్షకుడు చెప్పగలడా. అల్లు అర్జున్ హిందీ హీరోలను మించి స్టైలిష్ గా ఉంటాడన్న సంగతి ఇతడికి తెలుసా.
ఎన్టీయార్ ను రాంచరణ్ ను ఇతను నాలుగడుగుల వాళ్ళు అంటాడే… మరి ఆమిర్ ఖాన్ పొడవెంత. అతని యాక్టింగ్ స్కిల్ ను దక్షిణ భారతం కాదందా. ఎందుకీ వాగుడు..? మన సినిమా రంగం ఇతన్ని కచ్చితంగా ఒక చూపు చూడాలి. నోరు మూయించాలి… (తను పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి కూడా ఇలాగే వాగినట్టు గుర్తు… ఇప్పుడు కూడా ఇంకా చాలా చాలా వాగాడు… పేరు కమాల్ ఆర్ ఖాన్… కేఆర్‌కే అంటారు… బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, సాహో తదితర సినిమాలు ఇప్పటికే బాలీవుడ్ మూలాల్ని పెకిలిస్తున్నయ్ కదా… ఆ ఏడుపు కనిపిస్తోంది…)
Share this Article