ఫోన్ ఎందుకోసం చేస్తున్నారో చెప్పే ట్రూ కాలర్!
————————
స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళల్లో చాలా మందికి ట్రూ కాలర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు తెలియని నంబర్ల నుండి కాల్ వస్తే ఆ కాల్ చేసినవారి పేరు డిస్ ప్లే అవుతుంది. అవసరమనుకుంటే ఫోన్ ఆన్సర్ చేస్తారు. లేదంటే వదిలేస్తారు. ఒకరకంగా ఇలా తెలియడం మంచిదే. అయితే ట్రూ కాలర్ యాప్ ద్వారా మన ఫోన్లో సకల సమాచారం తస్కరణ జరుగుతోందని ఆమధ్య వార్తలు గుప్పుమనడంతో చాలా మంది ట్రూ కాలర్ ను తొలగించుకున్నారు. నిజానికి ప్రపంచంలో ఇంటర్నెట్ తో కనెక్ట్ అయిన ఏ డివైజ్ డేటా అయినా భద్రం కాదు.
Ads
ఇన్నాళ్లుగా ఎవరు కాల్ చేశారో చెబుతున్న ట్రూ కాలర్ ఇకపై ఎందుకు చేశారో కూడా చెప్పబోతోంది. మీరు కట్టాల్సిన బ్యాంక్ ఈఎంఐ గురించి;
మీరు చేయించుకోవాల్సిన హెల్త్ చెకప్ గురించి; లాప్స్ అయ్యే మీ పాలసీ గురించి…ఇలా ఎవరు ఎందుకు చేస్తున్నారో డిస్ ప్లే అవుతుందట. తెలియని నంబర్లు అని ఆన్సర్ చేయకపోవడం వల్ల ఒక్కోసారి అత్యవసరమయిన సమాచారాన్ని కాల్ సెంటర్లు ఇవ్వలేకపోతున్నాయట. దాంతో ట్రూ కాలర్ వారిని ఈ అప్షన్ ను ప్రవేశపెట్టమని అడిగాయట.
మార్కెటింగ్ కాల్స్ ఆన్సర్ చేయలేక ప్రపంచం గొంతు బొంగురుపోతోంది.
“మీరు సక్రమంగా అప్పు ఏనాడూ తిరిగి కట్టనందుకు మా బ్యాంకు వారు చెమర్చిన కళ్లతో బాధ్యతగా పరవశంగా ఉదాత్తంగా మీకు మరో పాతిక లక్షల టాపప్ లోన్ ఇవ్వాలనుకుంటున్నారు. కావాలా? వద్దా?”
“మీ ఇన్సూరెన్స్ అయిదు లక్షలే ఉంది. మీరు పొతే మీ కుటుంబానికి యాభై లక్షలు కావాలి. మీరు బతికి ఉండగానే ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచుకోవాలి. పెంచుకుంటారా? పెంచుకోకుండానే పోతారా?”
“మీరు మొన్న ఫలానా బార్ లో తప్ప తాగి వాంతులు చేసుకున్నారు కదా? ఆ బార్ లో ఇప్పుడు వాంతులు కాని కొత్త రకం ద్రవాలు వచ్చాయి. వస్తారా? రారా?”
“మా కంత్రీ క్లబ్ లైఫ్ మెంబర్ షిప్ మీకు ఉచితంగా జన్మ జన్మలకు ఇవ్వాలనుకుంటున్నాం. దానికి మీరు ఏటా పదివేలు ఇచ్చుకుంటే చాలు. కావాలా? వద్దా?”
“సార్, హైదరాబాద్ కు అతి దగ్గర్లో బీచుపల్లి బ్రిడ్జి దగ్గర ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. గజం పదివేలకే అమ్ముతున్నాం. కావాలా? వద్దా?”
“మేడం! మీ అబ్బాయికి రెండు నిండి మూడు వస్తోంది కదా? మా సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఇంటిగ్రేటేడ్ లాంగ్ టర్మ్ లైఫ్ ఇంప్రెజెన్ మెంట్ అండర్ గ్రౌండ్ ఒన్ ఆన్ ఒన్ పర్సనల్ మెంటల్ రీహాబిలిటేషన్ క్రాష్ కోచింగ్ సెంటర్లో చేరుస్తారా? లేదా?”
దాదాపుగా మార్కెటింగ్ కాల్స్ ఇలా ఉంటాయి. కాల్స్, ఎస్సెమ్మెస్ లు, మెయిల్స్ అది ఇది ఏమని? అన్నిట్లో మార్కెటింగ్ ప్రమోషన్లే.
ఎందుకోసం ఫోన్ చేస్తున్నారో చెప్పే ట్రూ కాలర్- మనం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పి బెదిరించకపోదు.
ఎస్. ఇట్స్ ట్రూ!
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article