…… By…. పార్ధసారధి పోట్లూరి……….. రష్యా నుండి ఎవరయినా క్రూడ్ ఆయిల్ కానీ నాచురల్ గ్యాస్ కానీ కొనాలి అంటే రూబుల్స్ లో డబ్బు చెల్లించాల్సిందే .. పుతిన్!
ఫిబ్రవరి 24 న పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ కోసం ఆదేశించిన తరువాత అమెరికా, యూరోపియన్ యూనియన్ తో పాటు జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్యాతో ఎలాంటి వాణిజ్య లావాదేవీలు జరపడానికి వీలులేకుండా కఠిన ఆంక్షలు విధించాయి. రష్యా సెంట్రల్ బాంక్ లో ఉన్న డాలర్లని స్తంభింప చేసింది అమెరికా ! చివరకి మాస్టర్ కార్డ్, విసా కార్డ్ ల కార్యకలాపాలని కూడా నిషేధించింది. ఇంటర్ బాంక్ లావాదేవీలు చేయడానికి వీలు కల్పించే SWIFT ని నిలిపివేసింది అమెరికా.
అయితే అందరూ ఊహించినట్లుగా రష్యా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోలేదు. కాకపొతే స్వల్ప కాలానికి ఇబ్బందులు పడ్డది. డాలర్ తో పోలిస్తే రష్యన్ రూబుల్ మళ్ళీ పుంజుకుంది. మొదట్లో ఒక డాలర్ కి 134 రూబుల్స్ దాకా వెళ్లి, మళ్ళీ ఇప్పుడు 82 దగ్గర సెటిల్ అయిపొయింది. ఆంక్షలు విధించినా ఇప్పటికీ జర్మనీతో పాటు ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు ఇంకా క్రూడ్ ఆయిల్ తో పాటు నాచురల్ గ్యాస్ ని యథావిధిగా వాడుకుంటున్నాయి. ఆంక్షలు విధించక ముందు వరకు EU దేశాలు యూరో కరెన్సీలో చెల్లింపులు చేస్తూ వచ్చాయి రష్యాకి. ఇప్పుడు ఆ డబ్బంతా ఆంక్షల వల్ల వాడుకోవడానికి వీలు లేకుండా పోయింది.
Ads
అమెరికా ఆంక్షలు : అమెరికాకి ఏ దేశం మీద అయినా కోపం వస్తే మొదట చేసేది ఆంక్షలు… అంటే డాలర్ల తో ఏవీ కొనడానికి వీలు ఉండదు. అమెరికా ఏ దేశంతో స్నేహంగా ఉండాలి … అలాగే ఏ దేశంతో స్నేహంగా ఉండకూడదో కూడా ప్రపంచ దేశాలని ఆదేశిస్తున్నది. మాట వినకపోతే డాలర్లతో ఏవీ కొనడానికి వీలు పడదు. పైగా డాలర్ తో పోలిస్తే మిగతా దేశాల కరెన్సీ తక్కువగా ఉండాల్సిందే.
EU కి చెందిన యూరో లు, బ్రిటన్ కి చెందిన పౌండ్, ఆస్ట్రేలియా డాలర్, కెనడా డాలర్లు, ఇవన్నీ మిగతా దేశాల కరెన్సీ కంటే పైఎత్తులో ఉంటాయి. గల్ఫ్ దేశాల దగ్గర ఆయిల్ ఉంది కాబట్టి వాటికి మినహాయింపు. కానీ ఈ దేశాలు ఎలాంటి ఉత్పత్తులని ఉత్పత్తి చేయవు కానీ ఇతర దేశాల నుండి చౌకగా దిగుమతులు చేసుకుంటాయి. అలా చౌకగా దిగుమతి చేసుకోవాలి అంటే డాలర్ విలువ ఎక్కువగా ఉండాలి.
ఇప్పుడు రష్యన్ సెంట్రల్ బాంక్ లో ఉన్న డాలర్లని ఫ్రీజ్ చేయడంతో ఆగిపోలేదు అమెరికా. రష్యన్ వ్యాపారవేత్తలు మరియు పారిశ్రామికవేత్తల అకౌంట్లని కూడా ఫ్రీజ్ చేసింది. ఇది మరీ దుర్మార్గమయిన చర్య. రష్యా అధికారిక అకౌంట్లని ఫ్రీజ్ చేసారంటే అర్ధం చేసుకోవచ్చు కానీ వ్యాపారవేత్తల, పారిశ్రామిక వేత్తల అకౌంట్లని ఫ్రీజ్ చేయడం దేనికి ?
తాజాగా అమెరికన్ మైక్ మెక్ ఫాల్ [Mike McFaul] ఒక ప్రకటన చేస్తూ రష్యా ఆయిల్ అమ్మినప్పుడు వచ్చిన డాలర్లని ఎస్క్రో అకౌంట్ లో ఉంచాలి అంటూ ప్రతిపాదన చేసాడు. ఈ మైక్ మెక్ ఫాల్ ఒబామా హయాంలో రష్యాలో అమెరికా రాయబారిగా పనిచేసాడు. ఇప్పుడు రష్యా ఎలా వ్యాపారం చేయాలో కూడా నిర్దేశిస్తున్నది అమెరికా. దాంతో అమెరికా ప్రతిపాదనకి జవాబుగా పుతిన్ కేవలం రూబుల్స్ లో అయితేనే ఆయిల్, గ్యాస్ అమ్ముతాను అంటూ గట్టిగా చెప్పేసాడు.
పుతిన్ చేసిన ఈ ప్రకటన తరువాత రష్యన్ రూబుల్ కి మళ్ళీ డిమాండ్ పెరిగి డాలర్ తో పోలిస్తే విలువ పెరిగిపోతూ వస్తున్నది. అగ్ర దేశాల సంగతి సరే ! మిగతా దేశాల సంగతేంటి ? క్రమక్రమంగా డాలర్ తో తూగలేని దేశాలు అన్నీ ఇతర మార్గాలని అన్వేషించే పనిలో బిజీగా ఉన్నాయి. అంటే డాలర్ తో కాకుండా ఇతర మార్గాలు ఏమన్నా ఉన్నాయా అనే వెతుకులాటలో ఉన్నాయి. దాంతో అంతర్జాతీయంగా డాలర్ నిల్వలు తగ్గిపోవడం మొదలుపెట్టాయి.
1. IMF తాజాగా విడుదల చేసిన ప్రకటనలో అంతర్జాతీయ డాలర్ రిజర్వ్ లో భారీ తగ్గుదలని సూచిస్తున్నది అని చెప్పింది. 2. చాలా దేశాల సెంట్రల్ బాంక్స్ డాలర్ కి ప్రత్యామ్నాయ మార్గాలని అన్వేషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో డాలర్లు అమ్మేసి ఇతర కరెన్సీలలోకి మార్చుకోవచ్చు. ఆ సూచనలు ఇప్పటికే కనపడుతున్నాయి. 3. చైనా ఇటీవలే సౌదీ అరేబియాతో యువాన్ తో ఆయిల్ కొనడానికి చర్చలు జరిపింది. అలాగే సౌదీ అరేబియా చైనా నుండి చేసుకునే దిగుమతులని కూడా యువాన్ లలోనే చెల్లించమని అడిగింది.
ఇక ఒకరకంగా వస్తు మార్పిడిలాగా పనిచేస్తుంది. చైనా సౌదీ నుండి ముడి చమురుని దిగుమతి చేసుకొని యువాన్లలో చెల్లింపులు చేస్తుంది. అలాగే సౌదీ చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువుల కోసం అదే యువాన్లని చెల్లిస్తుంది చైనాకి. ఇది ఒక ఒప్పందంగా ఖరారు అయితే మాత్రం చరిత్రలో మొదటిసారిగా పెట్రో డాలర్ ఆధిపత్యానికి చరమగీతం పాడే ప్రక్రియలో ఒక టీజర్ లాంటిది అవుతుంది.
చాలా సంవత్సరాల నుండి చాలా దేశాలు అమెరికా ఆగ్రహం, అనుగ్రహం మీద ఆధారపడకుండా ఉండాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పుడు రష్యా ఒక దారి చూపిస్తున్నది. తక్కువ ధరకి అమెరికాకి ఎగుమతి చేయాలి కానీ అదే అమెరికాకి కోపం వస్తే తమ డబ్బులని వాడుకోకుండా ఆంక్షలు విధిస్తున్నది. ఇదీ అసలు సమస్య !
ఆఫ్ఘనిస్థాన్ సెంట్రల్ బాంక్ కి చెందిన 7 బిలియన్ డాలర్లని ఆఫ్ఘన్ ప్రభుత్వం వాడుకోకుండా ఫ్రీజ్ చేసింది అమెరికా . తాజాగా శ్రీ లంక డాలర్ల కొరత వల్ల క్రూడ్ ఆయిల్ మరియు LPG ని దిగుమతి చేసుకోలేకపోతున్నది. శ్రీలంక కూడా డాలర్ మీద గుర్రుగా ఉంది కానీ ఏమీ చేయలేదు. పైగా 5 బిలియన్ డాలర్ల పాకేజ్ ఇవ్వమని అడగడానికి అమెరికా వెళ్ళబోతున్నాడు రాజపక్షే !
మరో వైపు రష్యా విదేశాంగ మంత్రి మరో రెండు రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవ్వబోతున్నారు. రూపీ-రూబుల్ ద్వారా ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం ఖరారు చేసుకోవడానికే న్యూధిల్లీ వస్తున్నాడు. ఇక రష్యన్ ఆయుధాల దిగుమతి మీద కూడా రూపాయల్లో చెల్లింపులు చేసుకునే అవకాశం మీద చర్చ జరగవచ్చు. అదే జరిగితే మనం డాలర్లని ఖర్చుపెట్టకుండా నేరుగా రూపాయల్లో చెల్లింపులు చేయవచ్చు. పైగా రష్యా మార్కెట్ రేట్ కంటే 20% తక్కువ ధరకే మనకి ముడి చమురు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి .
ప్రస్తుతం బెంట్ క్రూడ్ ధర బారెల్ కి 113 డాలర్లుగా ఉంది. రష్యాతో ఒప్పందం జరిగితే అది పరోక్షంగా ఒపెక్ దేశాల వైఖరిలో మార్పు రావడానికి దోహదం చేస్తుంది అంటే ధర ఇంకా తగ్గవచ్చు. మరి అమెరికా సంగతేమిటి ? ఇప్పటికే అమెరికా ఆర్ధిక పరిస్థితి బాగా దిగజారింది అనే వార్తలు వస్తున్నాయి. ఎడాపెడా ఆంక్షలు విధిస్తే ఏమవుతుందో బిడెన్ యంత్రాంగానికి అర్ధం అవడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. హేలికాప్టర్ మనీ దిశగా అమెరికా వడివడిగా అడుగులు వేస్తున్నది అన్నది నిజం ! బహుశా అమెరికాని భ్రష్టు పట్టించి గానీ జో బిడెన్ దిగిపోయేలా లేడు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడి చచ్చింది అనే సామెత అమెరికా విషయంలో జరగబోతున్నది…!!
Share this Article