జంటనగరాల్లో పోలీసులు ‘ప్రెస్’ మీద ఒక్కసారిగా ఫైరయిపోతున్నారు… బండి మీద ప్రెస్ అని స్టిక్కర్ కనిపిస్తే చాలు, జరిమానాలు వడ్డించేస్తున్నారు… ఇక రేపట్నుంచి జిల్లాల్లో మొదలుపెడతారు… మనల్ని పాలించేవాళ్లకు పెద్దగా ప్రజల ఆక్రందనలు కనిపించవు, వినిపించవు కాబట్టి ఈ స్టిక్కర్ల మహోద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుందేమో… హైదరాబాదులోనే కాదు, దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ స్టార్ట్ చేశారు…
విషయం ఏమిటంటే..? వాహనాలపై ఎలాంటి స్టిక్కర్లు ఉండకూడదు, మోటారు వాహనాల చట్టం అదే చెబుతోంది… అందుకని ఏ స్టిక్కర్ కనిపించినా సరే, వడ్డించేస్తాం అని చెబుతున్నారు… ‘‘రూల్ అనేది జనానికి సౌలభ్యాన్ని ఇవ్వాలి గానీ అకారణ ఇబ్బందుల్ని క్రియేట్ చేయకూడదు… ప్రతి రూల్ ప్రజలకు ఉపయోగకరమనే సత్యం లేదు, సూత్రీకరణ కూడా లేదు…’’ నకిలీ విలేకరులైనా సరే, ప్రెస్ అనే స్టిక్కర్ పెట్టుకుంటే ఈ లోకానికి వచ్చిన నష్టమేముంది..?
పోలీసులు వర్సెస్ నక్సలైట్ల నడుమ నిత్యసమరం జరిగిన కాలంలో… అటూ ఇటూ తుపాకులు, మందుపాతరలు… రాత్రీపగలు… ఈ ప్రెస్ స్టిక్కర్ విలేకరులకు ఓ రక్షాకవచంగా నిలిచేది… ప్రమాదాలు జరిగినప్పుడు, వీవీఐపీల సందర్శన వేళల్లో… ఏ సందర్భమైనా సరే ప్రెస్ స్టిక్కర్ విలేకరులకు అండగా నిలిచేదే తప్ప, అది ఎవరికీ నష్టదాయకం కాదు… నిజంగా పోలీసులకు డౌటొస్తే అక్రెడిటేషన్ కార్డు చూపించమని అడగొచ్చు… అన్నీ పరిశీలించాకే కదా ప్రభుత్వం ఆ అధికారిక గుర్తింపు కార్డులు ఇస్తోంది..? వాటికీ విలువ లేదా..?
ప్రత్యేకించి వందల మంది డెస్క్ జర్నలిస్టులు, ఇతర మీడియా సిబ్బంది అర్ధరాత్రి, అపరాత్రి రోడ్డు మీద తిరగాల్సి ఉంటుంది… నైట్ డ్యూటీలు ఉంటయ్… ప్రెస్ పేరిట రేడియం స్టిక్కర్స్ ఉంటే తప్పేమిటి..? ఓ ఉదాహరణ చెప్పుకుందాం… ఓచోట ఓ పెద్ద ప్రమాదం జరిగింది, అటువైపు వస్తున్న ఓ వెహికిల్‌పై డాక్టర్ సింబల్ కనిపించింది, ప్రజలు ఆపారు, ప్రాథమిక చికిత్స జరిగింది, పలువురి ప్రాణాలు నిలిచాయి… ఇక్కడ డాక్టర్ స్టిక్కర్‌తో వచ్చిన నష్టమేమిటి..? అలాగే అడ్వొకేట్లు, పోలీసులు, పలు వృత్తుల్లో ఉన్నవాళ్ల స్టిక్కర్స్ కూడా కనిపిస్తూ ఉంటయ్… రెడ్ క్రాస్ సింబల్స్ ఉంటాయ్…
Ads
చట్టాన్ని గౌరవించాలి, నిజమే… కానీ అన్నిసార్లూ కాదు… కార్ల అద్దాలకు బ్లాక్ సన్ ఫిలిమ్ ఉండకూడదని అప్పట్లో ఎవరో తీర్పు చెప్పారట, ఇంకేముంది..? ఓ ఉద్యమంలాగా పీకేయించారు, మొన్నటికిమొన్న ఇద్దర హీరోలకు జరిమానాలు కూడా వేశారు… నిజానికి ప్రైవసీ విషయంలోనే కాదు, ఎండాకాలంలో ఈ బ్లాక్ ఫిలిమ్ పెద్ద రిలీఫ్… భారీగా ఫ్యుయల్ సేవింగ్… ఐనా ఇవి పీకేస్తే కిడ్నాపులు ఆగుతాయా..? ఆగాయా..? చట్టవిరుద్ధ కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తాయా..?
వీవీఐపీల రాక సందర్భంగా ట్రాఫిక్ ఆపేస్తుంటారు… ఏ చట్టం వాటిని అనుమతించింది… ఎండల్లో, వానల్లో కూడా వాహనదారులు ఈసురోమంటూ వెయిట్ చేయాలి… ఆ కష్టాల్ని ట్రాఫిక్ పోలీసులు కూడా పడుతున్నారు కదా… మరి వాళ్లు ఎందుకిలా స్టిక్కర్లపై యుద్ధం ప్రకటించినట్టు..? పోనీ, నకిలీ జర్నలిస్టుల్ని, ఇతర వృత్తిదారుల్ని కంట్రోల్ చేయడానికి అనుకుందాం… అక్రెడిటేషన్ ఉన్నవాళ్లనూ వదలడం లేదు… పైగా ఏదో కోపం చూపిస్తున్నట్టుగా, ఈ జరిమానాల గురించి అడగడానికి వెళ్లిన వాళ్లందరికీ జరిమానాలు వేశారట…
డ్రంకెన్ డ్రైవ్ దగ్గర నుంచి మాస్క్, హెల్మెట్ దాకా… ప్రతి విషయంలోనూ జరిమానాలు వేస్తున్నారుగా, జైళ్లకు పంపుతున్నారుగా… ప్రెస్, డాక్టర్, అడ్వొకేట్ సింబళ్ల స్టిక్కర్లుంటే ఏమీ ఫాయిదా లేదుగా… ఎవరూ చట్టం పాటించకుండా ఉండటం లేదుగా… మరిక స్టిక్కర్లతో నష్టమేంటి..?! కార్లపై పొల్యూషన్, టోల్, మత సంబంధ, కులసంబంధ, పార్టీసంబంధ, లీడర్ సంబంధ, మనోభావ స్టిక్కర్లు కూడా ఉంటయ్… మరి ఎలా సార్..? కేవలం వృత్తి సంబంధ స్టిక్కర్లకేనా నిషేధం..?! ఉగ్రవాదులు, తీవ్రవాద పార్టీల సింబళ్లు, హీరోల బొమ్మలు, ఆ పైత్యం స్టిక్కర్లపై ముందుగా యుద్ధం ప్రకటించి, తరువాత మిగతా అన్నిరకాల స్టిక్కర్లకూ క్రమేపీ ఎక్స్‌టెండ్ చేస్తే బెటర్ కాదా..?! చట్టాన్ని ఉల్లంఘించాలని చెప్పడం లేదు… దాన్ని ప్రయోగించడంలో కొంత మెళకువ అవసరమనేదే భావన..!!
Share this Article