……. By…. Abdul Rajahussain……….. సినిమా పాత్రల్లోనే ర్యాడికల్… నిజ జీవితంలో “ మూఢనమ్మకాల పుట్ట ” ఎన్టీఆర్ !! ఆంధ్రుల ఆరాధ్య నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి గౌరవాన్నిఅంతర్జాతీయ స్థాయికి చాటి… చెప్పినవాడు, కాంగ్రెస్ ను మట్టి కరిపించి ‘ తెలుగుదేశం’ జెండాఎ గరేసిన మేరునగధీరుడు నందమూరి తారకరామారావు. అటువంటి వ్యక్తి మూఢ నమ్మకాల్ని నమ్మాడంటే…. నమ్మగలమా? నమ్మలేని నిజమే, అయినా.. జరిగిన వివిధ సంఘటనల్ని బట్టి నమ్మక తప్పదనిపిస్తుంది…
సినిమాల్లోని పాత్రల్లో ఎన్టీఆర్ ఎంతో విప్లవవాదిగా కనిపిస్తాడు. పురాణాల్లోని దుర్యోధనుడు, రావణాసురుడు, వంటి పాత్రల్లో సైతం హీరోయిజం చూపి, ర్యాడికల్ గా కనిపించే రామారావు నిజ జీవితంలో మాత్రం మూఢనమ్మకాలకు తలొగ్గినట్లు కనబడుతోంది. రాజకీయాల్లోకి వచ్చాక ఎన్టీఆర్ మూఢనమ్మకాలకు జనానికి తెలిశాయి గానీ, సినీ రంగంలో వున్నప్పుడు కూడా…. ఆయన మూఢనమ్మకాలకు పెద్దపీట వేసేవారని సినీ పెద్దలు చెబుతుంటారు.
అంతే కాదు. ఆ నమ్మకాలతో సొంతంగా కొన్ని సినిమాలు కూడా తీశారు. ఎన్టీఆర్ కు కుటుంబ నియంత్రణ పట్ల నమ్మకం వుండేది కాదు. భగవంతుడిచ్చిన సంతానాన్ని వద్దన కూడదన్నది ఆయన గట్టి నమ్మకం. నిజ జీవితంలో కూడా దీన్నే అక్షరాలా పాటించారు. అలాగే…. ఉమ్మడి కుటుంబం అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. ఈ పేరుతో ఓ సినిమా కూడా తీసి, ఉమ్మడి కుటుంబమే మంచిదన్న సందేశాన్ని కూడా ఇచ్చారు. చండశాసనుడు, తాతమ్మకల అనే సినిమాలు కూడా ఎన్టీఆర్ నమ్మిన నమ్మకాల ఇతివృత్తాలతో రూపొందించబడినవే.
Ads
తాతమ్మకలలో కుటుంబ నియంత్రణ విషయాన్ని , చండశాసనుడిలో భూసంస్కరణల వల్ల రైతులు నష్టపోతారని చూపించారు. భూస్వామ్య వ్యవస్థను ఆయన గట్టిగా…. సమర్థించారు. భూసంస్కరణల వల్ల చిన్న కమతాలు ఎక్కువై రైతులకు నష్టం కలుగుతుందని ఆయన దృశ్యీకరించారు. ఈ సినిమాలన్నింటినీ సొంత బ్యానర్ లో ఆయనే స్వయంగా నిర్మించారు. కృష్ణ పాత్ర ధరించినపుడు వీపు ఎడమన నల్లటి పెద్ద పెట్టుమచ్చను పెట్టేవారు. దీన్ని…. కుడిభాగంలో పెడితే బాగుంటుందని సినీ పెద్దలు చాలా మంది సలహా ఇస్తే, ఎన్టీఆర్ మాత్రం… ససేమిరా అన్నారట. అలాగే ముహూర్త బలాన్ని ఎన్టీఆర్ బాగా విశ్వసిస్తారు. బ్రహ్మి ముహూర్తంలో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయని ఆయన గట్టిగా నమ్మేవారు.
ఎన్టీఆర్ కు కిర్రు చెప్పులు ధరించడమంటే ఎంతో ఇష్టం. నల్ల తోలుతో ప్రత్యేకంగా తయారు చేసే ఈ చెప్పుల్ని చూస్తే రాజసం ఉట్టిపడేది. ఎన్టీఆర్ సిఎం అయ్యాక నెల్లూరుకు చెందిన ఆనం వివేకానంద రెడ్డి కిర్రు చెప్పుల్నితయారు చేయించి ఎన్టీఆర్ కు ఇచ్చేవారు. పనిలో పనిగా వివేకా కూడా కిర్రుచెప్పుల జత ధరించేవారు. ఓసారి వివేకా చెప్పుల్ని చూసి ఎన్టీఆర్ గుర్రుమన్నారట. అప్పటి నుండి వివేకా కిర్రు చెప్పులకు మంగళం పాడేశారు.
రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయన మూఢ నమ్మకాల్ని వదల్లేదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచేవారు. బ్రాహ్మీ…… ముహూర్తంలో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయన్నది ఆయన నమ్మకం. అందుకే ముఖ్యమైన నిర్ణయాలన్నీ అప్పుడే తీసుకునే వారు. ఎన్టీఆర్ కు శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టిన రెండురూపాయల కిలో బియ్యం పథకం, రాష్ట్రంలో కరణం, మునసబు వ్యవస్థను రద్దు చేయడం మండల వ్యవస్థ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే తీసుకున్నవేనట.
ఎన్టీఆర్ జాతకాల్ని బాగా నమ్మేవారు. కర్నూలు జిల్లాకు చెందిన బి.వి.మోహన్ రెడ్డి చెప్పే జాతకం అంటే ఎన్టీఆర్ కు గురి ఎక్కువ. ఈ బలహీనత మోహన్ రెడ్డికి బాగా ఉపకరించింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. వెంటనే ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ తో ఆయన
ఇక ఉన్నట్టుండి కాషాయరంగు దుస్తులు ధరించి, స్వామిలాదర్శనమివ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ కాషాయ దుస్తులతో కూడిన గెటప్ చాలా కాలం వుండింది. కాషాయ దుస్తులు,తలపాగాతో వివేకానందుడ్ని కూడా తలపింపజేశారు. ఇవన్నీ ఆయన నమ్మకాలతో చేసినవే.
సిఎంగా ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శించే వారు. గండిపేటలో పార్టీ కార్యాలయాన్ని ఆనుకొని ఓ కుటీరాన్ని నిర్మించారు. అంతకు ముందు నాచారం రామకృష్ణ స్టూడియోలో కూడా ఓ కుటీరాన్ని నిర్మించి, కొంతకాలం అందులో వున్నారు. అయితే ఇది తాత్కాలిక కుటీరం.
విశ్వామిత్ర సినిమాలో ఈ కుటీరాన్ని చూడొచ్చు. ఆ తర్వాత గండిపేటలో శాశ్వత కుటీరాన్ని నిర్మించి చాలా కాలం అందులోనే వున్నారు. (లక్ష్మీపార్వతితో వివాహమయ్యాక వస్త్రధారణ మారింది. నివాసం బంజారా రోడ్ నెం 13 కు షిఫ్ట్ అయింది.) ఈ కుటీరంలోకి ఎవరినీ అనుమతించే వారు కాదు. గట్టి బందోబస్తు వుండేది. చివరకు విలేకరులకు కూడా ప్రవేశం నిషిధ్ధం. నావరకు నేనెప్పుడూ ఈ కుటీరం లోపలికి అడుగు కూడా పెట్టలేదు. బయటి నుంచి చూడటమే.
చౌదరి గారని గండిపేట స్థానికులు ఈ కుటీర నిర్వహణని చూసేవారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు మాత్రమే కుటీర ప్రవేశం వుండేది. చివరకు ముఖ్య అధికారుల్ని , సెక్యూరిటీ వారిని కూడా లోనికి అనుమతించే వారు కాదు. అతి ముఖ్యం అత్యవసరం అనుకుంటే మాత్రం…. కుటీరం బయటే కలిసేవారు.
ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసిన వాటిలో మూఢనమ్మకాలూ ఓ భాగమే. అలాగని ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూడలేం. ఆయన నమ్మకాల్ని మనం అంగీకరించకపోవచ్చు. అవి మంచివా? చెడ్డవా అన్నది పక్కన బెడితే… ఎన్టీఆర్ తాను నమ్మినదాన్ని తూచ తప్పకుండా పాటించేవారు.
సాంప్రదాయాలన్నా, పౌరాణిక, ఐతిహాసిక సాహిత్యమన్నా ఆయనకుఎంతో ఇష్టం. పురాణలపైన, భాషపైన ఆయనకు గట్టి పట్టుంది. ఎన్టీఆర్ ఎంత సాంప్రదాయిక వాదైనా , ఆయనలో కనిపించని ఓ విప్లవకారుడు, ఓ సామాజిక వేత్త వున్నాడు. ఫలితంగానే దానవీరశూరకర్ణ సినిమాలో ఫ్యూడల్…. భావజాలంపై, కుల వ్యవస్థపై తిరుగుబాటు చేశారు.
అప్పటిదాకా ప్రతినాయక పాత్ర అయిన దుర్యోధనుడ్ని ఏకంగా హీరోని చేసేశారు. ఆయన తిరుగులేని నటనతో జనాన్ని మెప్పించి, ఒప్పించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదల దృష్టిలో దైవంగా మిగిలిపోయారు. ఎన్ని ఆరోపణలొచ్చినా,ఎందరు ఎన్ని రకాలుగా విమర్శించినా “మడమ తిప్పని నైజం, తలొంచని వ్యక్తిత్వం”.ఆయనది. ఆయన జీవితంలోని చివరి పేజీలు మసక మసగ్గా వుండొచ్చుగాక, ఎందరు నటులొచ్చినా, ఎందరు సిఎంలు వచ్చినా. ఇప్పటికీ ఆయనే జనహృదయాల్లో మిగిలిపోయిన’ రియల్ హీరో, రియల్ సిఎం. రియల్ లెజెండ్!!
— ఎ.రజాహుస్సేన్, నంది వెలుగు.!!
Share this Article