ఇంత ఆశ్చర్యం ఎప్పుడూ కలగలేదు… క్వాసీ జుడిషియల్ అధికారాలు, బాధ్యతలున్న ఓ అధికారి కరెంటు చార్జీల పెంపును రాజకీయ కోణంలో విశ్లేషించి సమర్థించుకున్న తీరు…! ఏపీలో కరెంటు ఛార్జీలు అడ్డగోలుగా పెంచారు… సరే, జగన్ ఇంతకుముందు ఏమన్నాడు..? ఇప్పుడు ఎందుకు వాయగొడుతున్నాడు అనేది వదిలేయండి కాసేపు… ప్రతిపక్షాల విమర్శలూ వదిలేద్దాం కాసేపు… కానీ ఓ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సమర్థించుకునే తీరు విస్మయకరంగా ఉంది…
కరెంటు ఛార్జీలను పెంచడం మీద… మెయిన్ స్ట్రీమ్ పత్రికల స్పందన సిగ్గుపడేలా ఉంది… అబ్బే, ఈ చార్జీల పెంపు పెద్ద ప్రాబ్లం కాదు అని ఓ ఇంజనీర్ల సంఘం ప్రతినిధి నమస్తే తెలంగాణలో పెద్ద వ్యాసం రాశాడు… నీకేం నష్టం నాయనా..? వశపడని జీతాలు పొందుతున్నారు… నీదేం పోయింది..? అది రాసిన పత్రిక పరువు తప్ప..! మీరేమైనా త్యాగాలు చేసేది ఉందా..? ఫీల్డులో మీ కరెంటోళ్ల అవినీతి, అక్రమాల మీద ఎన్నడైనా స్పందించావా..? ప్రభుత్వ ఉద్యోగిగా కాదు, మనిషిగా కూడా ఓ ఆత్మ ఉంటుంది కదా… అదెక్కడికి పారిపోయింది..?
ఆర్టీసీ చార్జీలు పెరగలేదు, జస్ట్, సెస్ పెంచి, చిల్లర సమస్యలు లేకుండా రౌండాఫ్ చేశాం, ఇంకా పెరగాల్సిన చార్జీల కథ ముందుంది అని సాక్షాత్తూ బాజిరెడ్డి గోవర్ధనుడు చెబుతున్నాడు… ఎవడైనా రాశాడా..? అంటే అసలు కథ ముందుంది అన్నమాటే కదా… వాయగొడతాం అని చెబుతున్నాడు కదా… మరిక పత్రికలకు ప్రజాకోణం ఎక్కడ ఏడ్చింది..? పాత్రికేయం అట, ప్రజలట… పార్టీ గొంతులు అని చెప్పుకోవచ్చు కదా… మేం ప్రజావ్యతిరేకమే అని ప్రకటించుకోవచ్చు కదా…
Ads
ఏపీలో కరెంటు చార్జీల పెంపు స్వల్పమే తెలుసా అన్నట్టుగా సాక్షి రాసింది… అంతకుమించి దానికి గతేముంది..? ప్రజల కోణంలో వార్తలు అనేది ఇప్పుడు లేదు కదా… దిగజారిన పాత్రికేయానికి ప్రతీకలు ఇవన్నీ… పోనీ, ప్రతిపక్షంలో ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమైనా సక్కగా రాశాయా..? వాటికి అంతకన్నా సోయి లేదు… (టీవీలను వదిలేయండి, అవి బుర్రల్ని మూసీలో కలిపేసి చాన్నాళ్లయింది… దిక్కుమాలిన డిబేట్లలో పిచ్చి ఒర్రుడు తప్ప వాటికి ఇంకేమీ తెలియదు…)
కరెంటు ఛార్జీల పెంపుకు ప్రధాన కారకుడైన రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ నాగార్జునరెడ్డి స్పందన చదివారా..? ’’పెట్రోల్ ధరలు పెరగడం లేదా..? ఏ వస్తువు మీద భారం లేదో చెప్పండి, ఏ వస్తువు ధరైనా స్థిరంగా ఉందా..? పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతుంటే ఎవరైనా అడిగారా..? జస్ట్, 1400 కోట్ల భారం ఓ పెద్ద విషయమా..? నథింగ్’’ అంటున్నాడు… అయ్యా, కరెంటు ఛార్జీల పెంపుకు కారణాలు చెప్పండి, సమర్థించండి, నిజానికి అదీ బహిరంగంగా చేయకూడదు… విద్యుత్తు వ్యవస్థలో అన్ని సెక్షన్లకూ న్యాయం చేయాలి, చేశారా లేదా అనేదే ప్రధానం…
అంతేతప్ప, పెట్రోల్ ధర పెరిగిందా..? పారాసెటమాల్ ధర పెరిగిందా..? పప్పు, ఉప్పు పెరగలేదా అనే మాటలు దేనికి..? అది కమిషన్కు అనవసరం… అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగింది, ఇంకా నయం, దానికీ లింక్ కలిపేయలేదు… పార్టీలు నానారకాలుగా స్పందిస్తాయి… నడుమ మీకెందుకు ఈ తిప్పలు..? థాంక్ గాడ్, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించలేదు…
నిజానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా సరిగ్గా రాయలేదు… రాయడం చేతకాదు… గాయిగత్తర తప్ప వాటికీ వీసమెత్తు సబ్జెక్టు లేకుండా పోయింది… సరైన విశ్లేషణ, విమర్శ వాటికీ చేతకావడం లేదు… పచ్చచొక్కాలు కాదు మాస్టారూ, ప్రజల కోణంలో వాస్తవాల విశ్లేషణ నేర్చుకొండి… ఏపీలో కరెంటు చార్జీలు 1400 కోట్లు కాదు పెరిగింది… ట్రూఅప్ చార్జీలను కూడా కలిపి లెక్కేస్తే 3400 కోట్ల పైమాటే అని ప్రజాశక్తి అనే పత్రిక వివరంగా రాసింది… ఆమాత్రం కూడా ఈ so-called పెద్ద పత్రికలకు చేతకాలేదు…
అంతేకాదు, పరిశ్రమలపై టైమ్ ఆఫ్ డే (TOD) టారిఫ్తో ఒక్కొక్కరికీ వాచిపోబోతోంది… అబ్బే, అది సగటు గృహవినియోగదారుడికి ఏం సంబంధం అనకండి… అన్నీ అంతిమంగా పడేది సగటు వినియోగదారుడిపైనే..! అడ్డగోలు ధరలకు కరెంటు కొనుగోళ్లు, అసమర్థ విధానాలు, కమీషన్ల దందాలు, అసంబద్ధ ఆర్థిక నిర్వహణే కదా కరెంటు సంస్థల్ని ముంచేస్తున్నది..? అవన్నీ వదిలేసి, అబ్బే, మేమే నయం అంటాడు తెలంగాణ ఇంజినీర్… పెట్రోల్ ధరలతో పోల్చుకొండి అంటాడు ఓ కమిషన్ అధ్యక్షుడు… ప్రజల ఖర్మ అని వదిలేద్దామా సార్… మీకేం..? మీరు బాగానే ఉంటారు… కరోనా దెబ్బకు ఇంకా కోలుకోని జనం మరింత చావుదెబ్బ తింటారు… పోతేపోనివ్వండి సార్, వాళ్ల ఖర్మ అంటారా..? అంతేలెండి…!!
Share this Article