ఈటీవీ ఎందుకు మూడో స్థానంలో కొట్టుకుంటోంది… అసలు రెండో స్థానంలో ఉన్న జీతెలుగు ప్రోగ్రామ్సే పెద్ద నాసిరకం… ఐనాసరే, ఈటీవీ రోజురోజుకూ చివరకు జీతెలుగుతో కూడా ఎందుకు పోటీపడలేకపోతోంది… ఏవేవో రియాలిటీ షోలు చేస్తుంటారు… ఆ బూతు జబర్దస్త్ ఉండనే ఉంది, చివరకు ఈటీవీ న్యూస్‌ను కూడా వినోదాల జాబితాలో కలిపేశారు… ఐనా ఆ వెలితి ఎందుకు..? ఆలోచించగా, చించగా వాళ్లకు బోధపడింది ఏమిటంటే..? మన సీరియళ్లను ప్రేక్షకులు ఇష్టపడరు, దేకరు… అందుకే ఈ దురవస్థ అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్…
ఇప్పుడు కాస్త నయం… రంగులరాట్నం అనే సీరియల్ ఈటీవీ టాప్ 30 ప్రోగ్రాముల జాబితాలో రెండో ప్లేసులో కనిపిస్తోంది… కాస్త సీరియళ్లపై దృష్టి పెట్టకపోతే ఇక చానెల్ గతి అంతే అనే ఆత్మమథనం పనిచేస్తున్నట్టుంది… స్టార్‌మాటీవీ సీరియళ్లే దాన్ని దేశంలోకెల్లా నంబర్ వన్ ప్లేసులో ఉంచాయి… సో, సీరియళ్లే గతి… కానీ ఈటీవీలో అన్నీ నాసిరకం సీరియళ్లే కదా… మరెలా..? రంగులరాట్నం కాస్త వోకే, యమలీల కూడా వోకే… మనసంతా నువ్వే సీరియల్ కూడా బెటరే… అంతే… యమలీల అప్పట్లో ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన హిట్ సినిమా… ఆలీ, మంజుభార్గవి గట్రా ఉంటారు… ఆ సినిమాకు ఈ సీరియల్ టీవీ సీక్వెల్ అన్నమాట…
అదుగో, అక్కడ ఈటీవీ పెద్దల బుర్రల్లో ఫ్లాషులు వెలిగినయ్… కాస్త గాడిలో పడి ఆలోచించడం ప్రారంభించాయి… యమలీల సరే, సేమ్, అలాగే ఉషాకిరణ్ మూవీస్ హిట్ సినిమాల్ని కూడా టీవీ సీక్వెల్స్ చేసి వదిలితే..? సొంత సినిమాలు కాబట్టి చికాకులు తక్కువ… వెంటనే మౌనపోరాటం ప్రోమో వదిలారు… షూటింగ్ కూడా సాగుతోంది… అప్పట్లో పెద్ద హిట్ సినిమా అది… యమున, వినోద్‌కుమార్ ఉంటారు అందులో… ఇప్పుడు యమున కూడా యాక్టింగులో యాక్టివ్‌గానే ఉంది… యాభై దాటినా సరే, ఏజ్ మీద పడ్డట్టుగా ఉండదు… ఇంకేముంది..? సీక్వెల్ స్టార్ట్… (నిజానికి ఆలీతో సరదాగా టీం లేడీ ఆర్టిస్టులకు చేసే మేకప్ దరిద్రంగా ఉంటుంది… ఈ చాట్‌లో కూడా అదే స్పష్టంగా కనిపిస్తోంది… మూడునాలుగేళ్ల క్రితం టీఎన్ఆర్ ఇంటర్వ్యూ చేసిన సమయంలో మేకప్ లేకపోయినా అందంగా కనిపించింది యమున… అప్పుడప్పుడే తన చిక్కుల నుంచి బయటపడింది…)
Ads
అకస్మాత్తుగా యమున ‘ఆలీతో సరదాగా’ షోలో కనిపించింది… నిజానికి మూడునాలుగేళ్ల క్రితమే ఆమెను గంటసేపు కూర్చోబెట్టాడు ఆలీ… మళ్లీ ఇప్పుడే ఎందుకొచ్చిందబ్బా అని చూస్తే… చాలాసేపు ఈ మౌనపోరాటం ముచ్చట్లే ఉన్నయ్… సో, ఈ సీరియల్ ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారన్నమాట… తోడుగా వర్షిక అని ఓ నటి… అసలు తెలుగు టీవీ సీరియల్ అంటేనే బెంగుళూరు లేడీ కేరక్టర్స్ కావాలనేది ఇప్పుడు అమల్లో ఉన్న రూల్ కదా… ఈ అమ్మాయి కూడా బెంగుళూరే… అసలు యమున కూడా బెంగుళూరు బేస్డే కదా…
కాకపోతే ఆమధ్య వ్యభిచారం ఆరోపణలు, కేసులు, వివాదాల్లో బాగా డిప్రెసైంది… తరువాత ధైర్యంగా పోరాడింది, కుంగిపోలేదు, మళ్లీ తెర మీదకు వచ్చి నిలబడింది… ఆమధ్య టాక్సీవాలా అనే సినిమాలో కూడా నటించినట్టుంది… సో, ఈటీవీ పెద్దల బుర్రలు ఇప్పుడు ఇక్కడితో ఆగిపోకపోవచ్చు… ఉషాకిరణ్ మూవీస్ వాళ్ల హిట్ సినిమాలు బోలెడున్నయ్… మరీ శ్రీవారికి ప్రేమలేఖ వంటివి సీక్వెల్ చేయగలిగే కొత్త జంధ్యాలలు దొరకడం కష్టం గానీ మయూరి, ప్రతిఘటన, నువ్వే కావాలి, అశ్విని వంటివి తీయడం పెద్ద కష్టమేమీ కాదు…
మయూరి సుధాచంద్రన్ నటనలోనే ఉంది, ఒకటీరెండు తెలుగు సీరియళ్లలోనూ చేసింది… విజయశాంతి ఆమధ్య సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ తెరకెక్కింది… నువ్వే కావాలి రిచా, అశ్విని కూడా రమ్మంటే వచ్చి నటిస్తారు… సీక్వెలే కదా, మనకిష్టమొచ్చినట్టు కథను ఎడాపెడా తిప్పేసుకోవచ్చు, పైగా తెలుగు టీవీ సీరియళ్లే కాబట్టి ఏది ఎలా ఉన్నా చల్తా… ఏమో… రేప్పొద్దున విజయశాంతి ‘‘ఈ దుర్యోధన దుశ్వాసన దుర్వినీత లోకంలో’’ అంటూ ఈటీవీ తెరపై కనిపిస్తే, మరీ ఆశ్చర్యపోవద్దు…!!
Share this Article