‘‘నిజమేనోయ్… ఈమధ్య ఈనాడు మరీ రంగురుచివాసనచిక్కదనం కోల్పోయిందనేది నిజమే… మటన్ బిర్యానీలా ఉండకపోయినా సరే, మరీ రాతలు ఇంకా దిగజారి చివరకు పాచిపోయిన బువ్వ కనిపిస్తున్నదోయ్…’’ అంటూ పొద్దున్నే ఓ ఈనాడు శ్రేయోభిలాషి తెగ ఆవేదన, ఆందోళన, ఆగ్రహం, అసహనం గట్రా చాలా ఫీలింగ్స్ వెలిబుచ్చాడు… ఏడిచేవాళ్లను ఆపకూడదు, మనసు నిమ్మళం అయిపోయేవరకూ ఏడవనిస్తే, మనసు ఖాళీ అయిపోయి, కూల్ అయిపోతారని ఈనాడులోనే ఎప్పుడో చదివినట్టు గుర్తు… అందుకే ఊరడించలేదు… కాసేపటికి ముక్కు ఎగబీల్చుకుంటూ… ఈ వార్త ఓసారి చదవ్వోయ్… అని గబగబా చెప్పేసి, కాల్ కట్ చేసేసి, ఓ క్లిప్పింగ్ వాట్సప్ ద్వారా పంపించాడు… అదే ఇదీ…
ముందుగా ఈ వార్తలో ఏం తప్పుందో అర్థం కాలేదు… మన మెదళ్లు ఇలాంటి రాతలకు అలా యుగాల తరబడీ ట్యూన్ అయిపోయాయి కదా… తప్పులు దొరకడం అంత వీజీ కాదు… మళ్లీ మళ్లీ చదివితే మొదటి పేరాలోనే దారుణంగా తప్పులో కాలేసినట్టు బోధపడింది… కష్టమ్మీద వార్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేకొద్దీ బుర్ర ఇంకా ఎక్కువ తిరగసాగింది… (దేవుడా… ఈరోజు తన పత్రికను రామోజీరావు చదవకుండా ఉండుగాక… పాపం, ఈ వయస్సులో తట్టుకోలేడు కదా…)
Ads
ఫస్ట్ పేరా చదివారు కదా… (ఇందులో పేరా విభజన ఎక్కడ పాడైంది… మొత్తం ఒకటే పేరా కదా… ఇప్పుడు కొత్త ట్రెండ్, పేరాలు, సబ్హెడ్డింగులు లేవు, కలిపి కొట్టేయడమే అంటారా..? సరే, సరే…) గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వసనీయుడు, రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ మరణించడంతో… ఆయన లేకుండానే సోనియాగాంధీ శనివారం కీలకసమావేశం నిర్వహించే వీలుంది… హబ్బ… ఎంత సూపర్ గ్రాస్పింగ్… భలే పట్టేసుకున్నారులే… అహ్మద్ పటేల్ లేకుండానే కీలక భేటీ జరగనుందని స్కూప్ రాయడం మామూలు విషయమా..?
అక్కడితో ఆగలేదు సుమండీ… అసమ్మతిగళం వినిపిస్తున్న బృందానికి జీ-23 అని కూడా ఓ పదం వాడేశారు… సరే, కొందరు ఇంగ్లిష్ ఘన పాత్రికేయులు ఆ పదాన్ని వాడుతున్నందున ఈనాడుకు పేటెంట్ రైట్స్ లేవు కానీ ఆ పదాన్ని ఆమోదించి, ఓన్ చేసుకున్న తీరు సూపరర్…
ఇక అసలు హైలైట్ చెప్పుకుందాం… ‘‘పార్టీ అగ్రనాయకత్వానికీ, సీనియర్ నేతలకూ మధ్య అనుసంధానకర్తగా పేరు తెచ్చుకున్న పటేల్ మరణం… వారి మధ్య అగాధాన్ని సృష్టించిందని విశ్లేషకులు భావించారు…’’ ఇదీ వాక్యం… హమ్మయ్య… పటేల్ మరణించడం వల్ల వచ్చిన సమస్యే తప్ప… నిజానికి సోనియాగాంధీకి సీనియర్ నేతలకూ మధ్య పెద్ద వేరే ఇష్యూస్ లేవన్నమాట… పటేల్ మరణం ద్వారా ఏర్పడిన అగాధమే అన్నమాట… వావ్, ఎంతటి సునిశితమైన విశ్లేషణ… సూపరెస్టు…
పటేల్ స్థానంలోకి వచ్చిన కమలనాథుడికి సీనియర్ నేతలతో మంచి సంబంధాలు లేవట, సోనియా దగ్గర అంత పలుకుబడీ లేదట… ఐనా సరే, నేరుగా జీ-23 నేతలతో మాట్లాడటమే బెటర్ అని ఓ మధ్యవర్తిగా చెప్పాడట, ఆమె తలూపిందట… మళ్లీ తనే వ్యవస్థాగత సంస్కరణ పట్ల మక్కువతో ఉన్నాడట… ఇంతకీ ఈ కమలనాథుడు రాహుల్ విధేయ, ప్రతికూల వర్గాల మధ్యవర్తా..? లేక గుర్రుమంటున్న జీ-23 సీనియర్ నేతల కూటమికి నాయకుడా..? కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవచ్చు… అచ్చం కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలాగే అత్యంత గందరగోళంగా ఉంది వార్త కూడా… వార్తాంశాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించేలా, పాఠకుడు కూడా అలాగే ఫీలయ్యేలా వార్త రచనశైలి ఉండటం గొప్ప విషయం… ఐనాసరే, ఈ క్లిప్పింగు ఎవరూ రామోజీరావుకు మాత్రం పంపించొద్దు ప్లీజు…
Share this Article