రెండేళ్లకోసారి ఎలక్షన్లు. అందరూ అందరికీ స్నేహితులే ఐనా, ఆ ఎన్నికల సమయంలో ఫన్నీ శతృత్వం నడిచేది. అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ, కిషన్ రెడ్డి లా స్నేహంగా ఉండి, ఎలక్షన్ల టైంలో అచ్చం అలాగే తన్నుకు చచ్చేవాళ్లు. అందర్లాగే నాకూ అందరూ స్నేహితులే..! ప్రశాంత్ కిషోర్ లా అందరికీ సలహాలిస్తూ, చంద్రబాబులా సమన్యాయం పాటించేవాణ్ని..! సంఘంతో నాకు దాదాపు పనుండేది కాదు. ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనకున్నా, పవర్ లాబీల్లో బతికేసే అరుణ్ జైట్లీ టైపు మనం..!
అసలు విషయానికొస్తే, ఇంకో మూడువారాల్లో ఎలక్షన్లన్నప్పుడు మా సంఘపోళ్లు సాంస్కృతిక పోటీల కార్యక్రమాలు ప్రకటించేసారు. వ్యాసాల పోటీలు, వక్తృత్వ పోటీలు, పాటల పోటీలు, కవితల పోటీలు, అంత్యాక్షరులు వగైరాలు వగైరాలు…
మా ఘనత వహించిన సాంస్కృతిక కార్యదర్శి గారు మాకేవేం వచ్చో, మేవేవేం పోటీల్లో పాల్గొనాలో తను నిర్ణయం తీసేసుకుని నన్ను పాటలూ, అంత్యాక్షరి పోటీలకు పరిమితం చేసాడు. “నేను మాట్లాడతాను, వ్యాసం రాస్తాను మొర్రో..!” అని మొత్తుకుంటే, “ఆహా, ప్రైజు దొబ్బుదామని అశా..?” అన్నాడు. అప్పుడు నాకు పోటిల్లో తనకు నచ్చిన రిజర్వేషన్లూ, గట్రా మెయిన్టైన్ చేస్తున్నాడని అర్ధమైంది. మా సెగట్రీ గారి మేనేజుమెంటు కోటాలో ఆ రెండిట్లో కూడా బెర్తు సంపాదించాను..!
Ads
వక్తృత్వ పోటీల్లో “ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలన సాధ్యమా..?” అని అంశాన్నిచ్చారు. అందరూ చాలా ఆదర్శవంతంగా, భారతీయుడికీ, ఠాగోర్ కూ, గణేష్ కూ కళ్లు చెమర్చేలా ప్రసంగించారు. ఈ ఉలిపికట్టె లేచి “నాగార్జునసాగర్ డామ్ లీకౌతుంటే, బ్యాండ్ ఎయిడ్ వేసి ఆపొచ్చేమో; ప్రపంచవ్యాప్తంగా పడుపువృత్తిని నిర్మూలించొచ్చేమో.., కానీ అవినీతి నిర్మూలన అసాధ్యం.., కాకపోతే కనిష్ట స్థాయికి తగ్గించవచ్చు..!” అంది. సహజంగానే పది మంది మాట్లాడితే, నాకు పదో స్థానం వచ్చింది. బహుమతి గ్రహీత మరుసటి నెలలో పదిహేను వందల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు.
పాటలపోటీలో “ఎస్పీబీ” లేకుండానే అందరూ సంస్కారవంతులైపోయారు..! పాడటవైతే పాడారు గానీ, పాడుతున్న వాళ్లకొక్కరికే తీయగా అనిపించింది. కొత్తగా మతం మారిన మా పాల్ పెదబాబు (అసలు పేరు పల్లి పెదబాబు) “నడిపించు నా నావా..,
నడి సంద్రమున దేవా..!” అంటూ ప్రైవేటు పాట అందుకున్నాడు. మా తిప్పభట్ల వేంకటేశ్వర మూర్తి ప్రైవేటు పాటలెలా పాడతాడని గోలెట్టాడు. ఆఫీసు రెండుగా చీలి గొడవ మొదలైంది. తురకలందరూ టీ బ్రేక్ కోసం బైటికెళ్లారు. మా పెదబాబు “రాజ్యము బలమూ..!” అనగానే, “అది ఆడవాళ్ల పాట” అంటూ తిప్పభట్ల గోల..! చివరాఖరికి మా పెదబాబు “భలే మంచిరోజూ, పసందైన రోజూ..!” అంటూ కోపంగా పళ్లు నూరుకుంటూ పాడేసాడు.
తిప్పభట్లాయన సెకనుకు రెండుసార్లు ఊపిరి పీల్చుకుంటూ “ఓం మహాప్రాణదీపం..!” అంటూ ఆయాసపడుతూ అందుకున్నాడు. “ఇది తెలుగు పాట కాదు., సంస్కృతం..!” అంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాడు పెదబాబు. మళ్లీ గొడవ మొదలైంది. చివరికి ఆయన కైలాస్ ఖేర్ గొంతుతో “ఎటో వెళ్ళిపోయింది మనసూ..!” అంటూ మా ప్రాణాలను పైకి పంపించాడు..!
నా వంతొచ్చింది. “అందరూ ఇంతసేపు తన్నుకు చచ్చారు, కాసేపు సరదాగా కవ్విద్దాం, నవ్విద్దాం” అన్న సదుద్దేశ్యంతో #మబ్బేమసకేసిందిలే అందుకున్నాను..!
మహిళా తుఫాను మొదలైంది..!
హేవిటిది, ఇక్కడున్నదెవరు, ఏం పాడాలన్న స్పృహ లేదా..? ఇలాంటి బూతు పాటలు పాడతావా..? చూడ్డానికి సంస్కారవంతుడిలా కనిపిస్తావ్..! ఇదేనా పద్ధతీ..? అంటూ రేవెట్టేసారు. అందులో ఒహావిడ #అలామండిపడకేజాబిలీ పాట నాకు పంపింది కూడానూ…!
నేను బిక్కమొహాన్నేసుకుని #దేవుడేఇచ్చాడువీధిఒకటీ అంటూ పాట మొదలెట్టా..! అందరూ నన్ను జయప్రదలా కోపంగా చూస్తూ, వాళ్ల అమ్మ పాత్రలా దైన్యంగా మొహాలెట్టి విన్నారు. ఆ హాల్లో ఆత్రేయా, ఎమ్మెస్వీ, యేసుదాసూ, రజినీకాంత్, బాలచందర్ ల ఆత్మలు ఆర్తనాదాలు చేస్తుండగా పాట పూర్తి చేసాను.
అక్కడా ప్రైజు రాలేదు…!
మహిళామణుల మనోభావాలు దెబ్బతీసినందుకు గానూ, ఇంకెలాంటి బూతు పాటలు పాడతానో అన్న భయంతోనూ, నన్ను అంత్యాక్షరి నుండి బహిష్కరించారు. నాలోని #రామం #అపరిచితుడిగా మారిపోయాడు. ప్రేక్షకుల్లో కూర్చున్న మరుక్షణం #రెమో లా మారి పోటీదార్లకన్నా ముందే, కావాలనే రొమాంటిక్ పాటలూ, బూతుపాటలూ పాడటం మొదలెట్టాను. ఆ సంస్కారవంతులంతా మూకుమ్మడిగా నన్ను బైటికి పంపేసి సంసారపక్షంగా ఆడుకున్నారు.
****
గుంపులో విమర్శించిన అందరూ తరువాత్తరువాత ఒక్కొక్కరూ ఆ రొమాంటిక్ పాటల ఎంపికను తెగ మెచ్చేసుకున్నారు…..
Share this Article