కంటికి కనిపించేది అంతా నిజం కాదు… మనకు కనిపించిన సన్నివేశాన్ని, దృశ్యాన్ని బట్టి మనం ఏదేదో ఊహించేసుకుంటాం… కానీ సత్యం వేరే అయి ఉండవచ్చు… ఈ మాట మనకు పెద్దలు పదే పదే చెప్పినా సరే… మన రక్తంలో జీర్ణించుకుపోయిన తత్వాన్ని బట్టి ఇప్పటికీ మనం మారం… ఉదాహరణ చెప్పడానికి… చాలామంది ఇదుగో ఈ బొమ్మ చూపిస్తారు…
ఫస్ట్, బొమ్మ చూడగానే మనకు కొన్ని నెగెటివ్ ఆలోచనలు కలుగుతాయి… ఛిఛీ అనిపించొచ్చుగాక… కానీ అసలు కథ తెలిస్తే కన్నీటిబొట్లు రాలతాయి… హృదయం ద్రవిస్తుంది… ప్రేమ గాఢత అర్థమవుతుంది… దురదృష్టం కొద్దీ మన దిక్కుమాలిన సినిమాలు, సీరియళ్లు, సాహిత్యం కారణంగా ప్రేమ అంటే బూతు అయిపోయింది… కానీ ప్రేమకు పరిధి, పరిమితి, నిర్వచనం ఉన్నాయా అసలు..?
Ads
ఒక పురుషుడు… ఒక స్త్రీ స్తన్యాన్ని గ్రోలుతున్నాడు… ఆమెకు అప్పటికే ఓ పిల్లాడు…. ఈ చిత్రం చూడగానే తోచేది వేరు.,. కానీ అసలు కథేమిటంటే..?
ఫ్రాన్స్… లూయీస్-14 పాలనకాలం… శిక్షలు ఘోరంగా ఉండేవి… ఆకలి, క్షామం, దుర్భిక్షం… ఈ చిత్రంలో చూస్తున్న ఓ వ్యక్తి ఆకలి తట్టుకోలేక రొట్టెలను దొంగతనం చేస్తాడు… పట్టుబడతాడు… న్యాయాధికారులు అప్పటి రాజు ఏర్పాటు చేసిన చట్టాల మేరకు మరణశిక్ష విధించారు… ఎలాగంటే..? జైలులో పారేస్తారు, ఆహారం ఇవ్వరు… తనంతటతనే ఎండిపోయి, మాడిపోయి మరణించాలి… అదీ శిక్ష…
ఆయనకు ఓ బిడ్డ… ఆమెకు పెళ్లయ్యింది… ఓ పిల్లాడు… తండ్రికి పడిన శిక్ష గురించి తెలిసి పరుగుపరుగున వస్తుంది… చేయడానికేమీ లేదు… తండ్రి మీద ప్రేమ… నిజంగా బిడ్డలకు తప్ప పేరెంట్స్ మీద కొడుకులకు ప్రేమ గాఢంగా ఉండదు కదా… అవసరమైనప్పుడు సేవ చేసినా… చచ్చిపోతే మనస్పూర్తిగా ఏడ్చినా అది బిడ్డలే…
రోజూ తండ్రిని చూడటానికి వెళ్లేది… ఆమె తన బిడ్డ కాబట్టి ఒక్కదానికే అనుమతి… చంటిపిల్లవాడిని ఎత్తుకుని వెళ్లేది… పిల్లాడికి పట్టాల్సిన పాలను తండ్రికి తాగించేది… ఆకలి… బతుకు మీద ఆశ… ఇక్కడ కనిపించేది, అనిపించేది, గుండెలోని తడిని కదిలించి, కంటిరెప్పల్ని దాటించేది ఆ బిడ్డ చూపించిన ప్రేమ… దీన్ని నిర్వచించడానికి ప్రపంచంలోని ఏ భాషలోనూ పదాల్లేవు…
నాలుగు నెలలైనా జైలులోని ఖైదీ మరణించకపోయేసరికి అధికారులకు సందేహమొస్తుంది… నిఘా వేస్తారు… ఆమె చర్యను గమనిస్తారు… తీసుకెళ్లి న్యాయాధికారుల ఎదుట నిలబెడతారు… కోపగించుకోరు, సిగ్గుపడతారు… ఆమె ప్రేమ లోతు తెలిసి… ఆశ్చర్యంగా చూస్తూ… తండ్రిని, బిడ్డను వదిలేస్తారు… ఇదీ కథ…
ఈ బొమ్మను hans sebald beham గీశాడు… ఇదేకాదు, ఇదుగో ఈ బొమ్మ కూడా తనే గీశాడు అంటారు…
తను గీసిన మొదటి బొమ్మ అక్షరాలా 3 కోట్ల డాలర్లకు అమ్ముడుబోయిందని అంటారు… అసలు ఈ కథే కల్పితం అనేవాళ్లున్నారు… ఈ చిత్రం మీద రకరకాలుగా రాసేశారు అందరూ… సరే, నిజం ఏదయితేనేం..? చిత్రం నిజం… చిత్రం చెప్పే కథ నిజం… ఆ కథాంశం తల్లిస్తన్యం అంతటి మహత్తరం అనేదీ నిజం… పాలిండ్లు చూడగానే వాంచ, కాంక్షలే కాదు… పాలుకారే ప్రేమాభిమానాలూ అనేది నిజం…!
Share this Article