Jagannadh Goud………… ఏ సమాజం లో నుంచి మాట్లాడుతున్నాం..? ఖమ్మం జిల్లాలోని అడవి పక్కన మారుమూల కుగ్రామం మాది. నాతోటి వాళ్ళందరూ చుట్ట/బీడీ తాగుతుంటే నేనూ ఒక రోజు బీడీ కాల్చి ఇంటికి వచ్చా. ఆ వాసన పసిగట్టి దూలానికి వేలాడతీసి కొట్టాడు మా నాన్న. మా నాన్న కొడతాడు అన్న భయంతో బీడీ ముట్టలేదు, ఆ తర్వాత ఊర్లో బయటికి వెళ్ళినా ఎవరో ఒకరు చూసి మా నాన్నకి చెప్తారు అన్న భయంతో ముట్టలేదు. పెద్దయ్యి బయటికి వెళ్ళి చదువులు చదువుతున్నప్పడు అది మంచిది కాదు అన్న ఎరుక వచ్చి ముట్టలేదు. ఇప్పుడు ఎవడైనా 100 కోట్లు ఇస్తా అన్నా ఒక్క బీడీ/ సిగరేట్ కూడా ముట్టను…
Ads
మా నాన్న కొట్టింది అబ్యూస్ కిందకి రాదు నేను పెరిగిన వాతావరణంలో.. కొట్టకుండా అది మంచిది కాదు అని చెప్తే నేను వినేవాడ్ని కాదు, విని అర్ధం చేసుకునే జ్ఞానం, పరిస్థితులు చుట్టుపక్కల లేవు… మా ఊర్లో 10 వ తరగతి పాస్ అయిన వాడే లేడు. అలాంటిది అమెరికా వెళ్ళి Ph.D చేశాను అంటే కారణం మా నాన్న పెంచిన విధానం… నేను మా పిల్లల్ని కొట్టను, వాళ్ళకి అర్ధం అయ్యే భాషలో నేను చెప్పగలను. మా నాన్న చదువుకోలేదు కాబట్టి అతని భాషలో చెప్పాడు, నాకు అర్ధం అయ్యింది…
కోదాడలో ఓ తల్లి తన కొడుకు గంజాయి తాగుతున్నాడనే కోపంతో మొహానికి కారం పూసి శిక్షించింది… ఆ ఘటన తీసుకుంటే వాళ్ళ వాతావరణం, పరిస్థితులు అన్నీ పరిగణనలోకి తీసుకొని మాట్లాడాలి. అంతేగానీ అమెరికాలో చికాగో లేక్ షోర్ డ్రైవ్ లో కార్ నడుపుకుంటూ, నావీ పియర్స్ దగ్గర ఆగి కాఫీ తాగుతూ, ఛస్, అలా కారం పోయటం యేంది, నాన్ సెన్స్ , ఎలాంటి సమాజంలో ఉన్నారు వాళ్ళు, అదంతా అబ్యూస్ అనటం ఎంతవరకు కరక్ట్ ..? అలా అని దాన్ని నేను సమర్దించటం లేదు…
మా ఫ్రెండ్ ఒకడు అమెరికా నుంచి వచ్చి, యేంది ఈ హారన్ ల గోల, ఇక్కడ ఇండియాలో, ఛీ.. మా అమెరికాలో అయితే ఎవరూ హారన్ కొట్టరు తెలుసా అన్నాడు… మన దగ్గర రోడ్లు, జనాలు, పరిస్థితులు అన్నీ తెలుసుకొని మనకి తగినట్లు మనం ఖచ్చితంగా మెరుగుపరచుకోవాలి అంతేగానీ, అమెరికాలో పేపర్లతో ముడ్డి తుడుచుకుంటున్నారు అని మనం కూడా వాళ్ళలాగే పేపర్లతో ముడ్డి తుడుచుకోకూడదు కదా… ప్రతి రోడ్ చివర్లో అమెరికాలో లాగా ఆగి, మళ్ళీ వెళ్ళాలి అంటే మన సిటీ గల్లీలలో అది సాధ్యం కాదు…
అప్పుడప్పుడూ నాకూ అనిపిస్తుంది, మన సినిమాల్లో హీరోల ఈ లేకి డ్యాన్స్ లు ఏంటి, ఈ పిచ్చి ఫైట్స్ ఏంటి, మనవరాలి వయస్సు ఉన్న వారితో ప్రేమలు ఏంటి అని… కానీ ఎవరైనా చచ్చిపోతే ఎంత అందంగా ఉన్నాడు/ఉంది, పాపం చచ్చిపోయింది అనే జనాలు ఉన్నారు మన దగ్గర, మన సమాజం వేరు… మనకి తగినట్లు 4 పాటలు, 3 ఫైట్స్ ఉండటం తప్పు కాదు. మన వాటిని ఇంగ్లీష్ లేదా ఇటాలియన్ సినిమాలతో పోల్చి మనం తక్కువ అనటం కరక్ట్ కాదు. ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాల్సిన వాటిల్లో మెరుగు పరచుకుందాం/ కోవాలి. అయితే మనలో ఎంతమందికి ఆస్కార్ వచ్చింది అనేది మూర్ఖపు ప్రశ్న. వాళ్ళ అవార్డ్స్ వాళ్ళవి, మన అవార్డ్స్ మనవి.
విల్ స్మిత్ చేసినదాన్ని మన సమాజం నుంచి చూస్తే మనకి కరక్ట్ అనిపించటంలో తప్పు లేదు కానీ మెరుగైన సమాజంలో బతుకుతూ, అదీ ఆస్కార్ వేదిక మీద చెంప దెబ్బ కొట్టటం 100% తప్పు. అది విల్ స్మిత్ కూడా ఒప్పుకున్నాడు. నిజానికి ఏ సమాజంలో అయినా హింస తప్పే, అబ్యూస్ తప్పే. అయితే కడుపు నిండిన వాడు ఆలోచించే విధానం మరియూ మాట్లాడే తీరుకు, కడుపు కాలినవాడు మాట్లాడే తీరుని ఒకే స్కేల్ తో కొలవటం కరక్ట్ కాదు…. – సామాన్యుడు
(అమ్మయినా… నాన్నయినా… బడిలో పంతులైనా… తిడతారు, కొడతారు… అందులో ఏముంటుంది..? పిల్లాడు బాగుపడాలనే ఆశ, చెడిపోవద్దనే ఆశ, పదిమందీ వేలెత్తిచూపేలా బతకొద్దనే ఆశ… అంతకుమించి ఏముంటుంది..? మళ్లీ చెబుతున్నా… దండం దశగుణం భవేత్… చాలామందికి… )
Share this Article