మార్పు… మార్పు… సహజం… చంచలమైన రాజకీయాల్లో విధేయతల్లో మార్పులు కూడా సహజం… పెద్ద ఆశ్యర్యం ఏమీ లేదు… కాకపోతే గతంలో పూర్తి రైటిస్టు బీజేపీ నుంచి గానీ… లెఫ్టిస్టు పార్టీల నుంచి గానీ ఈ జంపింగులు కనిపించేవి కావు… మరీ అరుదు… రైటో, లెఫ్టో… ఏదో బుర్రలోకి ఎక్కితే ఇక జీవితాంతం ఆ అభిమానాన్ని పదిలంగా కాపాడుకునేవాళ్లు… మధ్యేవాద, అవకాశవాద, ఫ్యూడల్ పార్టీల నాయకులు ఎప్పుడూ గోడ మీదే కూర్చుని ఉండివాళ్లు… చాలామంది ఆయారాం, గయారాాం బాపతే… నిబద్ధత అనే పదం డిక్షనరీలో ఉంటుందనే సంగతే తెలియదు వాళ్లకు…
కానీ లెఫ్ట్, రైట్ వింగుల నుంచి కూడా ఈమధ్య లెఫ్ట్, రైట్ అంటూ కవాతు చేస్తూ బయటికి వెళ్లిపోతున్న తీరే విచిత్రం… అఫ్కోర్స్, సీపీఎం, సీపీఐ వంటి పార్టీల నాయకులు మరీ అమ్ముడుపోనంత నిఖార్సయిన సరుకు ఏమీ కాదు… తెలంగాణలో కేసీయార్ ఆ భ్రమాత్మక బట్టలు విప్పేసి చూపించాడు ఇంతకుముందే… ఇప్పుడు బెంగాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చదువుతూ ఉంటే ఇవే గుర్తొస్తున్నాయి…
Ads
బెంగాల్లో ఏదో భారీ మార్పు కనిపిస్తోంది… అసలు జెండా ఎత్తుకునేవాడు కనిపించని బీజేపీ ఇప్పుడక్కడ బలాన్ని రోజురోజుకూ విపరీతంగా ప్రోది చేసుకుంటోంది… అనూహ్యంగా… ఆశ్చర్యకరంగా… మొన్నటి లోకసభ ఎన్నికల్లో మమతకు చుక్కలు చూపించిన బీజేపీ… రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పీఠం లాక్కునే దిశలో కదులుతోంది… క్షేత్ర స్థాయిలోనూ బీజేపీ విస్తరించి, ఇటు లెఫ్ట్‌ను, అటు టీఎంసీని ఎదుర్కుంటోంది… కొత్తగా మజ్లిస్నూ ఢీకొట్టబోతోంది కొన్నిచోట్ల…
టీఎంసీ ముఖ్యనాయకుడు సువేందు అధికారితోపాటు ఇద్దరో ముగ్గురో ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారు కావచ్చునని అనుకున్నారు చాలామంది… కానీ ఏకంగా పదిమంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అమిత్ షా సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు… టీఎంసీలో ఇక మమత దీదీ ఒక్కతే మిగలబోతోంది, చూస్తూ ఉండండి అని అమిత్ షా కాస్త వెటకారాన్ని దట్టించి వ్యాఖ్యానించాడు…
ఇలా జంపిన నాయకుల్లో టీఎంసీ నేతలే కాదు… సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉండటం విశేషం…
- Tamluk MLA Ashok Dinda, CPI
- Haldia MLA Tapashi Mandal, CPIM
- Purulia MLA Sudeep Mukherjee, Congress
వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జంపడం పెద్ద విశేషం ఏమీ కాదు… కానీ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన ఎర్ర నేతలు కూడా ఆయా పార్టీలను ఎందుకు వీడుతున్నారు..? ఈ మార్పుకి కారణం ఏమిటి..?
పార్టీలు వీడి వెళ్లిపోయేవారు చెప్పేమాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు… కానీ మార్పును విశ్లేషించుకోవాల్సిన అవసరం అయితే ఆ పార్టీలకు ఉంది… ఇప్పటికే లెఫ్ట్ కూటమి బెంగాల్లో దయనీయమైన స్థితికి చేరుకుంది… తన దశాబ్దాల పాలనలో అనుసరించిన రాజకీయ, పాలన ధోరణుల మీద ఈరోజుకూ ప్రజల్లో వ్యతిరేకత ఉంది… ఇన్నాళ్లూ మమత బెనర్జీ దాన్ని వాడుకోగా… ఇప్పుడు దాన్ని బీజేపీ అందిపుచ్చుకుంటోంది…
మోడీని రానివ్వను, అమిత్ షాను రానివ్వను, సీబీఐని రానివ్వను, బీజేపీ గుజరాతీ పార్టీ, అర్జెంటుగా తన్ని తరిమేద్దాం, ఈ గవర్నర్ ఓ పెద్ద శుద్ద మొద్దు…. ఇలా దీదీ ఎంత గర్జిస్తున్నా సరే, అవన్నీ మరింత నెగెటివ్ అయిపోతున్నయ్ ఆమెకు… ఈ పదిమందే కాదు… ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు జనవరిలో బీజేపీలో చేరబోతున్నారట…
ఒవైసీ దూకుడు చూస్తుంటే మమత మైనారిటీ వోట్లకు భారీగా గండిపడబోతోంది… అన్నింటికీ మించి… ఏ ప్రశాంత్ కిషోర్‌ను ఆమె నమ్ముకుని, కోట్లు వెచ్చిస్తూ రంగంలోకి దింపితే… ఆ ప్రశాంత్ కిషోర్ టీం ఉనికినే టీఎంసీ కేడర్ సహించడం లేదు… టీఎంసీ కేడర్ అంటేనే దుడ్డుకర్రల బ్యాచ్… అది పీకే టీంను కూడా గంగవెర్రెలెక్కిస్తోంది… పీకే ఆలోచిస్తున్న స్ట్రాటజీలేవీ వర్కవుట్ కావడం లేదు… చివరకు మమత ఎక్కిన రథం ఎటువైపు పరుగులు తీస్తుందో ఆమెకే అర్థం కావడం లేదు ప్రస్తుతానికి… అరుణకుడ్యాలను పగులగొట్టిన ఆమె అయోమయంలోకి దూసుకుపోతున్నట్టుంది…
Share this Article