జాతికి అత్యంత అరిష్టదాయకాలు ఏవి..? ఇంకేముంటయ్..? క్షుద్ర రాజకీయాలు..! మీడియా, సోషల్ మీడియా కూడా నాయకుల ప్రేలాపనలకు, అజ్ఞానపు ప్రవచనాలకు ఇస్తున్న ప్రాధాన్యం ఇతరత్రా వార్తలకు ఇవ్వదు కదా… డిబేట్ జరపదు కదా… మన రాజకీయాలు, మన మీడియా రేంజ్ ‘‘వెంట్రుక పీకడం’’ డిబేట్ల దాకా వెళ్లిపోయింది… సంతోషిద్దాం… సరే, ముందుగా ఓ వార్త చదవండి…
రాజస్థాన్ హైకోర్టు ఓ ఆసక్తిదాయకమైన ఉత్తర్వులను వెలువరించింది… అదేమిటీ అంటే… ఒక భార్య కోర్టుకు మొరపెట్టుకుంటే జీవితఖైదు అనుభవిస్తున్న భర్తకు 15 రోజుల పెరోల్ అనుమతించింది… ఎందుకో తెలుసా..? భార్యకు పిల్లలు పుట్టడం కోసం… ఆమె లైంగిక, భావోద్వేగ అవసరాలు తీరడం కోసం… అర్థం కాలేదా..? ఇంకాస్త వివరంగా చదవండి…
భిల్వారా జిల్లాకు చెందిన నందలాల్… ఓ మర్డర్ కేసులో జీవిత ఖైదు పడింది… ప్రస్తుతం జైలులో ఉన్నాడు… ఆయన భార్య మొన్నటి డిసెంబరులో జిల్లా కలెక్టర్‌కు ఒక మొర విన్నవించుకుంది… పెరోల్ కమిటీకి ఆయనే ఛైర్మన్… ‘‘అయ్యా, నాకు పిల్లల్లేరు, పిల్లల్లేకుండా ఓ వివాహిత జీవితం సంపూర్ణం కాలేదు… అందుకని ఓ 15 రోజులపాటు నా భర్తకు పెరోల్ ఇవ్వండి, పిల్లలు పొందడం నా హక్కు…’’ అనేది ఆమె విజ్ఞప్తి సారాంశం…
Ads
కలెక్టర్ పట్టించుకోలేదు, తిరస్కరించాడు… దాంతో ఆమె హైకోర్టుకు వచ్చింది… డివిజన్ బెంచ్ ఆమె విజ్ఞప్తిని మన్నించి పెరోల్ మంజూరు చేసింది… ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు కొన్ని ఆసక్తికరం…
- చతుర్విధ పురుషార్థాలు ఏ మనిషికైనా ప్రధానమే… ధర్మం (సక్రమ ప్రవర్తన, నైతిక నడత), అర్థం (ఆర్థిక స్థితి, ఆస్తులు), కామం (ప్రేమ, శృంగారం), మోక్షం (ఆధ్యాత్మిక మార్గం, స్వేచ్ఛ)… ఇందులో ధర్మం, అర్థం, మోక్షం ఒంటరిగా సాధించగలడు… కానీ కామం… వారసత్వ కొనసాగింపుకై సంతానం అనే లక్ష్యాలకు భాగస్వామి అవసరం…
- ఖైదీ భార్యకు జరిగిన నేరంతో సంబంధం లేదు… పిల్లలు కావాలని కోరుకోవడం స్త్రీ సహజధర్మం… మాతృత్వం అనేది స్త్రీ హక్కు… సంతానం లేక స్త్రీత్వానికి సార్థకత, సంపూర్ణత లేదు కదా… పిల్లలున్న స్త్రీని సమాజంలో ఎక్కువ గౌరవం, మర్యాద కూడా లభిస్తాయి…
- పిల్లలు లేక, భర్త దూరమై ఆమె గడిపే జీవితం ఓ శిక్ష… ఏ నేరమూ చేయని స్త్రీ ఆ శిక్షను ఎందుకు అనుభవించాలి…
- హిందూయిజం, జూడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీలకు సంబంధించిన పలు సూక్తులను కూడా కోర్టు ఉదహరించింది తన తీర్పులో…
- గర్భం పొందడం కూడా 16 రకాల మతకర్మలలో ఒకటి… మొదటిది…
- ఆడం, ఈవ్‌లకు అందిన ప్రధాన సాంస్కృతిక సందేశం కూడా… ‘‘Be fruitful and multiply and fill the Earth’… (కడుపులు పండనివ్వండి, సంఖ్యను పెరగనివ్వండి)
- వంశపరిరక్షణ అనేది ముఖ్యమేనని ఇస్లాం షరియత్‌తో పాటు కైరో మానవహక్కుల ప్రకటన చెబుతున్నాయి…
- సంతానం పొందడం అనేది ఖైదీ తత్వాన్ని మార్చడానికి కూడా దోహదపడుతుంది…
- ఖైదీ భార్య నిర్దోషి, ఆమె లైంగిక, భావోద్వేగ అవసరాలను కూడా గుర్తించాల్సి ఉంది… తన ఖైదీ భర్తతో సహజీవనం ఆమె అవసరం… దాన్ని తోసిపుచ్చలేం… ఒక్కో కేసు ఒక్కోరకంగా ఉండవచ్చు… ఈ కేసులో సంతానం పొందే హక్కు ఆ భార్యాభర్తలకు సహజసిద్ధమే…
- రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ మాత్రం ఖైదీ భార్య పెరోల్ అభ్యర్థనకు అభ్యంతరం వ్యక్తం చేశాడు… సంతానం కోసం పెరోల్ అనేది అసాధారణం అనేది తన వాదన…
- అసలు పెరోల్ ఉద్దేశం ఏమిటంటే… ఖైదీ శిక్ష తరువాత సాఫీగా, ప్రశాంతంగా ప్రధాన జీవన స్రవంతిలోకి ప్రవేశించేలా చేయడం… ఈ పెరోల్ దానికే ఉపయోగపడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది…
నిజానికి ఇక్కడ నిబంధనల మేరకు… సంతానం కోసం పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు కూడా గుర్తించింది… కానీ పలు మతాల సారం, సాంస్కృతిక, సామాజిక, మానవతా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు… రాజ్యాంగం ద్వారా కల్పించబడిన పలు ప్రాథమిక హక్కుల్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు… పెరోల్‌కు అనుమతించడమే న్యాయం, సరైన చర్య అవుతుంది… అని కోర్టు పేర్కొంది…
స్థూలంగా చూస్తే తీర్పు బాగుంది… డిఫరెంట్ అప్రోచ్ కనిపించింది… తీర్పులో లోతైన పరిశీలన, నిర్ణయం కూడా ఉన్నాయి… 15 రోజుల పెరోల్ అనేది పెద్ద ఇష్యూయే కాదు… అయితే ఇక్కడ ఇంకొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి… నేరస్థుడికి శిక్ష అనేదే పరివర్తన కోసం, తదుపరి నేరాల నుంచి సొసైటీకి రక్షణ కోసం… అలాంటి నేరస్థుడితో బంధం ఉన్న భార్య మాత్రమే కాదు, తల్లిదండ్రులు, బంధుగణం, స్నేహితులు అందరూ ఆ అప్రతిష్టను మోయాల్సి ఉంటుంది… అది కర్మఫలం… వీళ్లెవరూ ఏ తప్పూ చేయలేదు, ఆ నేరస్థుడి తప్పులో భాగం కాదు, ఐనాసరే ఆ శిక్షా వేదనను అనుభవించాల్సి వస్తుంది…
తల్లో తండ్రో మరణిస్తే టెంపరరీగా పెరోల్ ఇస్తారు… పితృరుణం తీర్చుకోవడం కోసం, అంత్యక్రియల కోసం… అవీ దక్కని ఖైదీలు బోలెడు మంది… పిల్లల పెళ్లిళ్లకు కూడా పెరోల్ ఇస్తారు… అదీ తండ్రిగా లేదా తల్లిగా రుణం తీర్చుకోవడం, బాధ్యత నిర్వర్తించడం కోసం… ఈ పెరోల్స్‌కు సామాజిక ఆమోదం కూడా ఉంటుంది… కానీ ఓ వివాహిత భావోద్వేగ, మాతృత్వ, లైంగిక అవసరాల కోసం పెరోల్ ఇవ్వడమనేది అసాధారణం, పైగా ఓ ఆనవాయితీగా మారితే ఎలా..? ఇదంతా మరో కోణం, మరో వాదన… కీలకమైన తీర్పులపై ఇలాంటి నిర్మాణాత్మక డిబేట్లు ఎందుకు సాగడం లేదు..?! ఎంతసేపూ నీచస్థాయిలో సాగే ‘‘వెంట్రుకలు పీకే’’ డిబేట్లేనా..? అసలు మన మీడియా ఈ తీర్పును పబ్లిష్ చేసిందా..?!
Share this Article